ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజల్లో విపరీతమైన పలుకుబడి ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అందరూ శత్రువులే అని చెప్పొచ్చు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని అంటుంటారు. కానీ ఏపీ రాజకీయాలు ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయాయి.
పరస్పరం శత్రువులుగా భావిస్తూ, వారి ఉనికే లేకుండా చేయాలనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయన్నది పచ్చి నిజం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
రామకృష్ణ అంటే టీడీపీ నేత చంద్రబాబుకు కుడి భుజం లాంటివారనే విమర్శ లేకపోలేదు. ఈ అభిప్రాయం ఎలా ఉన్నా…జగన్పై ఆయన చేసిన వ్యాఖ్య, హెచ్చరిక మాత్రం ఆలోచనాత్మకంగా, చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారన్నారు.
ఇందులో భాగంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు టార్గెట్లు పెట్టి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే… తన ఇంట్లోనే ప్రతిపక్షం పుడుతుందని గ్రహించాలని హితవు చెప్పారు.
ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్న వారిస్తున్నా వినకుండా తెలంగాణలో సొంతంగా ఓ పార్టీ పెడుతుండడం, మరోవైపు తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై వైఎస్ వివేకా కూతురు అన్న ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రామకృష్ణ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.