ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయని పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా విస్పష్ట ప్రకటన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అసలైన వాస్తవాల్ని సభలో ప్రవేశపెట్టారు.
దివంగత నేత వైఎస్ఆర్ హయాంలోనే ఏకంగా 86 శాతం భూసేకరణ జరిగిందని.. మిగిలిన 14శాతం భూసేకరణను చంద్రబాబు చేశారని చెప్పుకొచ్చారు జగన్.
అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 80శాతం అనుమతులు వైఎస్ఆర్ హయాంలోనే వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు జగన్. ఈ మేరకు వైఎస్ఆర్ హయాంలో వచ్చిన అనుమతుల్ని, తేదీలతో పాటు చదివి వినిపించారు.
ఇలా అంతా సిద్ధం చేసి పెడితే.. చంద్రబాబు మాత్రం తన హయాంలో కేవలం 29.89శాతం పనులు మాత్రమే పూర్తిచేశారని అన్నారు సీఎం.
“పొద్దున్న లేస్తే మేం 70శాతం పోలవరం పనులు పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుంటారు. అయితే ఆయన హయాంలో పూర్తయింది కేవలం 29.89 శాతం మాత్రమే. మరో 30శాతం పనులు చంద్రబాబు హయాం కంటే ముందే పూర్తయ్యాయి.
మొత్తంగా చూసుకుంటే.. మే 2019లో మేం అధికారంలోకి వచ్చే సమయానికి 60శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఎవరు పూర్తిచేస్తున్నారంటే అది రాజశేఖర్ రెడ్డి కొడుకు మాత్రమే అనే విషయాన్ని గర్వంగా చెబుతున్నాను.”
పోలవరం ప్రాజెక్టులో అవినీతి వరదలా పారిందన్నారు జగన్. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 1343 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయంటే.. కరెప్షన్ ఏం రేంజ్ లో జరిగిందో ఎవ్వరైనా ఇట్టే ఊహించుకోవచ్చన్నారు.
“పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరెప్షన్ జరిగిందో సాక్షాత్తూ ప్రధాని మోడీనే చెప్పారు. ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చేశారని అన్నారు. ఇదే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేస్తే, అక్షరాలా 1343 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది. చంద్రబాబు ఏ స్తాయిలో కరెప్షన్ చేశారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.”
పోలవరం విషయంలో బాబు చేసిన అవినీతిని అంకెలతో సహా జగన్ చదువుకుంటే.. టీడీపీ నేతలు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ముఖ్యమంత్రి స్పీచ్ ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో పోడియం వద్దకొచ్చి ఆందోళన చేశారు.
అయినప్పటికీ వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో జగన్ తను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క సెంటిమీటర్ కూడా తగ్గదని, ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు ముఖ్యమంత్రి.