ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకూ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వన్డే సీరిస్ ను కోల్పోయిన కొహ్లీ జట్టు మూడో వన్డేలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా 2-1 తేడాతో వన్డే సీరిస్ ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియన్ జట్టు.
తొలి రెండు మ్యాచ్ లలో పరాజయంతో భారత జట్టుపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఏ మాత్రం పోరాటపటిమను కనబరచలేదనే విమర్శలే తీవ్రం అయ్యాయి. ప్రత్యేకించి ఫైనల్ ఎలెవన్ ఎంపికలో కొహ్లీ తీరును అనేక మంది విశ్లేషకులు తప్పు పట్టారు.
అలాగే బౌలింగ్ స్పెల్స్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. బౌలర్లు తమ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ పరచడంతో తొలి రెండు మ్యాచ్ లలో భారత్ పేలవమైన రీతిలో ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చింది.
మూడో మ్యాచ్ లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. బౌలర్లలో షమీ, సైనీలను పక్కన పెట్టారు. వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, కొత్త బౌలర్ నటరాజన్ లకు అవకాశం ఇచ్చారు. ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. స్పిన్నర్ చాహల్ ను పక్కన పెట్టి, కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇచ్చాడు కొహ్లీ.
తొలి రెండు మ్యాచ్ లకు భిన్నంగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్. దీంతో తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ప్రదర్శన అంతంత మాత్రంగానే కనిపించింది. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా, జడేజాలు కాస్త శ్రద్ధ చూపడంతో టీమిండియా స్కోరు 300 దాటింది. వారిద్దరూ ఆరో వికెట్ కు 150 పరుగులు జోడించారు.
అయితే ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ఉన్న ఫామ్ ను బట్టి ఆ స్కోర్ ను వారు ఊదేస్తారేమో అనే అభిప్రాయాలే వినిపించాయి ఇన్నింగ్స్ విరామంలో. అయితే భారత బౌలర్లు ఈ సారి కాస్త గాడిన పడ్డారు. ప్రత్యేకించి ఐపీఎల్ లో రాణించి జాతీయ జట్టులో స్థానం పొందిన నటరాజన్ చక్కగా బౌలింగ్ చేశాడు. దీంతో అవససరమైనప్పుడల్లా వికెట్లు లభించాయి.
ఆఖర్లో మ్యాక్స్ వెల్ కాస్త గాబరా పెట్టినా.. చూడచక్కని యార్కర్ తో బుమ్రా అతడిని బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఫలితం ఇండియాకు అనుకూలంగా వచ్చింది. 13 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకూ టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయగలిగారు.
కరోనా పరిస్థితుల్లో.. తొలి సారి టీమిండియా ప్రేక్షకుల మధ్యన ఆడిన సీరిస్ ఇది. కరోనాను ఎదుర్కొంటూ కూడా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లకు వీక్షకులను అనుమతిచ్చింది.
వన్డే సీరిస్ ను కోల్పోయినప్పటికీ చివరి మ్యాచ్ లో విజయంతో టీమిండియా పరువు నిలుపుకుంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఇండియా-ఆస్ట్రేలియాల మధ్యన టీ-20 సీరిస్ మొదలు కానుంది. ఆ సీరిస్ లో భాగంగా మూడు టీ-20 మ్యాచ్ లు జరగనున్నాయి.