నిన్నటి దాకా రాష్ర్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి ఇపుడు సొంత పార్టీలోనే ఇబ్బందికరంగా తయారైంది అంటున్నారు. ఆయన మాట పార్టీలో ఎటూ చెల్లడంలేదు.
తన రాజకీయ వారసుడిగా ఎచ్చెర్లకు కుమారుడిని చూసుకుందామనుకుంటే దానికి కూడా అధినాయకత్వం సహకరించడంలేదు అన్న అసంతృప్తిని కళా వ్యక్తం చేస్తున్నారు.
కళాతో చాలా సన్నిహితంగా మెలిగిన చినబాబు లోకేష్ కూడా ఇపుడు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారుట. స్ధానిక ఎన్నికలలోనూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళా టీడీపీకి కొత్త వెలుగులు తీసుకు రాలేకపోవడంతో పార్టీ పెద్దల వద్ద మరింతగా పలుచన కావాల్సి వచ్చిందని అంటున్నారు.
ఇక రాజాం నుంచి కళా వచ్చి ఎచ్చెర్లలో పెత్తనం చేయడం పట్ల స్ధానిక నాయకులు సహించలేకపోతున్నారుట. వచ్చే ఎన్నికలలో స్ధానికులేక టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటి నుంచే డిమాండు పెడుతున్నారుట.
తనకు కాకపోయినా తన కుమారుడికైనా ఎచ్చెర్ల టిక్కెట్ ఇప్పించుకుందామని చూస్తున్న కళాకు స్ధానిక నాయకుల నుంచే చుక్కెదురు అవుతోంది.
పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పదవి అయితే కుమారుడికి తెచ్చుకున్న కళా రేపటి రోజున టిక్కెట్ మాత్రం సాధించలేరన్న మాట పార్టీలో ఉంది.
ఈ నేపధ్యంలో ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం పక్క చూపులు చూస్తారా అన్న చర్చ అయితే ఉంది.