ఈ కరోనా కష్టకాలంలో పెళ్లిళ్లు కూడా కొత్తగా జరుగుతున్నాయి. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో కొందరు పెళ్లి చేసుకుంటుంటే, మరికొందరు ఆన్ లైన్ లోనే పెళ్లి తంతు ముగించేసి మమ అనిపిస్తున్నారు. దీనికి భిన్నంగా మధురైకు చెందిన ఓ జంట, విమానంలో పెళ్లి చేసుకుంది.
మధురైకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ బుక్ చేశాడు. పెళ్లికూతురితో పాటు 160 మంది బంధువులతో బెంగళూరు బయల్దేరాడు. బెంగళూరులో పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. గాల్లో ఎగురుతున్న విమానంలో తన కొడుకు పెళ్లి జరిపించాడు ఆ వ్యాపారవేత్త. పెళ్లికి సంబంధించి వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
మధురై నుంచి బెంగళూరు వెళ్లి, తిరిగి మధురై వచ్చేలా విమానం బుక్ చేసుకున్నారు. కానీ గాల్లోనే పెళ్లి చేసుకొని తిరిగి మధురై ప్రయాణమయ్యారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇలా గాల్లో పెళ్లి చేసుకుంటారనే విషయం తమకు తెలియదని వాళ్లు చెప్పుకొచ్చారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. విమానాశ్రయంలోనే కాదు, విమాన ప్రయాణంలో కూడా మాస్కులు, పీపీఈ కిట్లు ఇప్పుడు తప్పనిసరి. కానీ ఈ పెళ్లిలో మాత్రం ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ మాస్కులు ధరించలేదు. పీపీఈ కిట్ మచ్చుకైనా కనిపించలేదు. దీంతో ఈ వివాహం కాస్తా వివాదాస్పదమైంది.
అయితే పెళ్లికూతురు తండ్రి మాత్రం తన వాదనను మరోలా వినిపిస్తున్నారు. విమాన ప్రయాణానికి ముందే తను 160 మంది బంధువులకు సంబంధించిన కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లను అధికారులకు అందించానని.. ఇక విమానంలో ఉన్నదంతా తామే కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు.
ఏదేమైనా ఈ ఘటనను డీజీసీఏ మాత్రం సీరియస్ గా తీసుకుంది. కంప్లయింట్ ఫైల్ చేయాల్సిందిగా సదరు విమానయాన సంస్థను ఆదేశించిన డీజీసీఏ చర్యలు తప్పవని అంటోంది.