తెలుగుదేశం పార్టీనే కాదు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఖాతరు చేయకపోవడానికి మూలాలు క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే అర్థం అవుతాయి. ఇకనైనా చంద్రబాబు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటే హుందాగా ఉంటుందన్నా, పవన్ కల్యాణ్ ను జస్ట్ ఒక పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా అభివర్ణిస్తున్నా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్షేత్ర స్థాయి వ్యూహాల్లో, వాటిని అమలు పెట్టడంలో చాలా పక్కగా ఉంది. స్థూలంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఓటు బ్యాంకు మీద దృష్టి పెట్టింది. దృష్టి పెట్టడమే కాదు.. అక్కడ పక్కగా పలుకుబడి సంపాదించింది.
గత ఎన్నికలతోనే బీసీ ఓటర్లను చాలా మేరకు తన వైపుకు తిప్పుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బీసీ ఓటు బ్యాంకు విషయంలో జగన్ కు గత ఎన్నికలు చాలా కాన్ఫిడెన్స్ ను ఇచ్చాయి. వారిని మరింతగా ఆకట్టుకోవడానికి, వారిని మరింతగా తనవైపుకు తిప్పుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండున్నరేళ్లలో చాలా పథకాలు పెట్టారు. అవి కూడా పూర్తిగా సఫలం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తులు బీసీలు. సరిగ్గా ఈ కుంభస్థలాన్ని కొట్టిన వారికి రాజకీయంగా తిరుగు ఉండదు.
ఆఖరికి కొన్ని చోట్ల తమ సంప్రదాయ ఓటు బ్యాంకు ను అయినా జగన్ నిర్లక్ష్యం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి కానీ, బీసీలకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించడంలో ఎక్కడా నిర్లక్ష్యం లేదు. ఫలితంగా.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. రోజు రోజుకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలత కనిపిస్తూ ఉంది.
పచ్చ ప్రచారాలు పారడం లేదు!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ జగన్ విషయంలో టీడీపీ , దాని అనుకూల మీడియా చేయని ప్రచారం అంటూ లేదు. తమ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలనూ సంధించారు. మత మార్పిడిలు అంటూ, అవినీతి అంటూ, అభివృద్ధి లేదంటూ, చంద్రబాబు అధికారంలో ఉంటే అద్భుతాలు జరిగేవంటూ, అమరావతి దెబ్బతిందంటూ, రాష్ట్రానికి రాజధానే లేదంటూ.. ఇలా అన్ని రకాల విష ప్రచారాలతో మొదలుపెడితే, అన్ని రకాల ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లూ అన్నీ పూర్తయ్యాయి.
మామూలుగా ఇలాంటి ప్రచారాలు చేయడంలో పచ్చ బ్యాచ్ కు తిరుగులేదు. ఈ విషయంలో హిట్లర్ అనుచరుడు గోబెల్స్ ను ఆదర్శంగా తీసుకుని, గోబెల్స్ కూడా చిన్నబోయేలా ప్రచారం చేయడంలో పచ్చ బ్యాచ్ కు తిరుగే లేదు. ఈ విషయంలో టీడీపీ ఎల్లవేళలా ఒక చాంఫియన్. పత్రికలు చదివే వారిని, మీడియా ప్రభావానికి లోనయ్యే వారిని టీడీపీ, దాని అనుకూల మీడియా చాలా తేలికగా ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదో జరిగిపోయింది, జరిగిపోతోంది, చంద్రబాబు లేకపోతే అంతే, చంద్రబాబు అధికారంలో ఉంటే.. అంతే.. అనే రేంజ్ లో ప్రచారాన్ని చేయడంలో టీడీపీ మీడియా వాడి ఇప్పటికీ ఏమీ తగ్గలేదు.
పచ్చ మీడియా తను చేయగలిగినంతా చేస్తోంది. అయితే ప్రజల్లో మీడియా అంటే ఉన్న నమ్మకాన్నే ఆల్రెడీ తగ్గించి వేసింది పచ్చమీడియా. మీడియాపై విశ్వసనీయతను దెబ్బతీసిన వారు మళ్లీ కొత్త కథలు అల్లితే.. నమ్మే వాళ్ల శాతం కూడా ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది కదా. సోషల్ మీడియా విజృంభించడం, టీడీపీ అనుకూల మీడియాకు ఆ ముద్ర బలంగా పడటం.. వంటి కారణాలు ఆ ప్రచారాలకు చెక్ పెట్టాయి. ఆ పై జనం టు జగన్, జగన్ టు జనం ఒక బంధం ఏర్పడింది. ఈ పరిస్థితి కూడా టీడీపీ ని ఒడ్డున పడ్డ చేపను చేస్తోంది.
అదే చంద్రబాబుకు పెనుశాపం!
2014 సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల వర్షం బాగా పని చేసింది. రైతు రుణ మాఫీ, తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపించి ఇస్తామంటూ టీడీపీ నేతలు గట్టిగా ప్రచారం చేయడం.. టీడీపీకి సానుకూలంగా నిలిచింది. సరిగ్గా అలాంటి హామీల విషయంలో జగన్ వ్యతిరేక ధ్వని వినిపించడంతో మొదటికే మోసం వచ్చింది. అయితే 2014 ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు నాయుడు మోసం చేయడంతో జగన్ కు విశ్వసనీయత మరింత పెరిగింది. తను ఏదైనా చెబితే జగన్ చేస్తాడు, చేయని పనులను జగన్ చెప్పడు, చెప్పలేడు అనే భావన ప్రజల్లో ఏర్పడింది.
అదే చంద్రబాబు విషయానికి వస్తే.. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చెబుతాడు. అధికారం అంటూ దక్కడం కోసం ఎలాంటి హామీని అయినా ఇస్తాడు. అధికారం అందుకున్నాకా చంద్రబాబు నాయుడు అన్నీ మరిచిపోతాడు. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతాడు. ఎన్ని హామీలు ఇచ్చినా చంద్రబాబు ఒక నమ్మకం లేని వ్యక్తి.. అతడిని నమ్మలేం .. అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. ఇలా 2014, 19 ల మధ్య పరిణామాలు చంద్రబాబును ఒక విశ్వసనీయత లేని వ్యక్తిగా నిలిపితే, జగన్ ను చేయగలిగింది మాత్రమే చెప్పే పాలకుడిగా నిలిపాయి.
ఇక 2019 అనంతర పరిణామాలు కూడా జగన్ పై నమ్మకాన్ని మరింత పెంచితే, చంద్రబాబును ఒక వంచకుడిగా నిలుపుతున్నాయి! ప్రజలు నాయకుడిని ఏం కోరుకుంటారంటే.. ప్రధానంగా విశ్వసనీయత. నాయకుడికి ఏమున్నా లేకపోయినా.. అతడిపై నమ్మకం ఉండాలి. ఈ వ్యక్తిత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. అయితే ఈ వ్యక్తిత్వం విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ఏ రోటికాడ ఆ పాట పాడే టైపే. రాజకీయమైన పొత్తుల విషయంలో అయినా, ప్రజలతో డైరెక్టుగా డీల్ చేయడంలో అయినా… చంద్రబాబు మోసపూరిత వైఖరి ఆయనకు రాజకీయ జీవిత చరమాంకంలో పెను శాపంగా మారుతోంది.
ఆ సంప్రదాయం పోయింది!
పదేళ్ల కిందటి వరకూ కూడా బీసీ వర్గాలు తామేదో టీడీపీకి రుణపడ్డట్టుగా స్పందించేవారు. తాము తెలుగుదేశం పార్టీ అని, తమకు గుర్తింపు దక్కేది టీడీపీ వద్దే అనే భావన ఉండేది. అయితే రోజులు మారాయి. రాజకీయాలు మారాయి. ప్రత్యేకించి 2014 వరకూ కూడా టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు గట్టి మద్దతుదారుగా నిలిచింది. 2014 కే కొంత మేరకు బీసీల ఓట్లు రూట్లు మారాయి. అయితే తాము తెలుగుదేశం వైపే ఉండాలనే తీరు బీసీల్లో క్రమంగా పోయింది. ఎన్టీఆర్ నాటి హయాం టీడీపీ కాదిది అని అర్థం చేసుకోవడానికి వారికి చాలా సమయమే పట్టింది. 1999 నాటి నుంచినే టీడీపీలో బీసీల ప్రాధాన్యత తగ్గిపోయింది.
టీడీపీ క్రమం ఒట్టి కమ్మ వాళ్ల పార్టీగా మిగులుతూ వచ్చింది. టీడీపీని కమ్మ వాళ్లు అతిగా ఓన్ చేసుకోవడంతో బీసీలకు అక్కడ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. గమనిస్తే.. 1999 నుంచి 2019 వరకూ టీడీపీ లో బీసీ నేతలంటే పట్టు మని పది మంది పేర్లకు మించి వేరే వి వినిపించవు! రాష్ట్రమంతా కలిపి కూడా బీసీలకు ప్రతినిధులుగా టీడీపీ నుంచి ఎదిగిన వారు లేరు! జిల్లాకు ఒకరిద్దరు నేతల పేర్లే చెబుతూ.. వాళ్లే బీసీ నేతలు, బీసీలంటే వాళ్లే అనే పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. రాజకీయం సంగతి అలా ఉంటే.. సంక్షేమం విషయంలో కూడా బీసీలను చంద్రబాబు ఉద్ధరిచింది ఏమీ లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర మొత్తాన్నీ పరిశీలిస్తే.. బీసీలకు బాగా లబ్ధి కలిగించిన తొట్టతొలి ప్రోగ్రామ్ ఫీజు రీయింబర్స్ మెంట్. దీని వల్ల లక్షలాది మంది బీసీ యువతీయువకులు మంచి చదువులు చదువుకోగలిగారు. ఆ ప్రోగ్రామ్ సృష్టి కర్త వైఎస్ రాజశేఖర రెడ్డి. అక్కడ నుంచినే పరిస్థితి మారడం మొదలైంది.ఇక జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో కూడా ఇప్పుడు బీసీలకే అగ్రతాంబూలం అందుతోంది.
బీసీల ఓట్లను సంప్రదాయంగా పొందిన చంద్రబాబు, వారి కోసం కత్తెర్లు, బ్లేడ్లు ఇచ్చే ప్రోగ్రామ్ తప్ప మరోటి డిజైన్ చేయలేకపోయారు. 14 సంవత్పరాల పాటు సీఎంగా ఉండి, అదీ బీసీల బతుకులను మార్చేందుకు చంద్రబాబు చూపిన చిత్తశుద్ధి! ఇలాంటప్పుడు బీసీలు ఎందుకు టీడీపీకి రుణపడి ఉంటారు? ఈ ప్రశ్నను వేసుకుంటే.. చంద్రబాబు చేసిన పొరపాట్లు, పాపాలు ఏమిటో టీడీపీ భక్తులకు కూడా అర్థం అవుతాయి.
ఇప్పుడేం చేస్తున్నారు?
అధికారంలో ఉన్నప్పుడు అంటే.. మోసం చేయడం, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, అయిన వారికి దోచి పెట్టడం, పచ్చ చొక్కాలు వేసుకున్న వారి జేబులు నింపడమే పాలన అయ్యింది. అమరావతి రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడమే రాజకీయం అయ్యింది! మరి ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఇప్పుడు పాత వాటిని కాపాడుకునే వ్యూహాలే తప్ప టీడీపీ చేస్తోంది మరోటి లేదు. అమరావతిని కాపాడుకోవడానికి, జగన్ అమలు పెడుతున్న పథకాలకు చట్టపరంగా అడ్డంకులు సృష్టించడానికే టీడీపీ తన సమయాన్ని అంతా కేటాయిస్తోంది.
ఈ విషయంల టీడీపీది దాపరికం ఏమీ లేదు. అంతా బట్టబయలే. దీని వల్ల ఇప్పుడు టీడీపీ ఏం ఒరుగుతోందో కానీ.. రేపటి ఎన్నికల్లో వీటి వల్ల కలిగే లబ్ధి ఏమాత్రం లేదని మాత్రం వేరే చెప్పనక్కర్లేదు. తన రాజకీయ, సంక్షేమ కార్యాచరణతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో తన పరపతిని పెంచుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ఈ వర్గాలకు వైఎస్ జగన్ బాగా దగ్గరయ్యారు. రెండున్నరేళ్లలోనే జగన్ దీన్ని సాధించారు.
రాజకీయంగా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా అపరిమితంగా మారింది. తనకు ఓటేయని సామాన్య వర్గాలపై జగన్ పాలనలో ఎలాంటి కక్ష సాధింపు లేదు. రాయలసీమలో కమ్మ వాళ్లు అయినా, బలిజలు అయినా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో ఎలాంటి వివక్షనూ ఎదుర్కొనడం లేదు. ఈ వర్గాల ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడదు. అయినా.. వారిపై ఎలాంటి వివక్ష లేదు. బీసీలు మాత్రం జగన్ మార్కు పాలనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా దగ్గరయ్యారు. మరింత దగ్గరవుతున్నారు కూడా.
ఇదే సమయంలో టీడీపీ అక్కసు మాటలు, ఆక్రోశపు కూతలతో తన అహాన్నీ చల్లార్చుకునే పనిలో ఉంది. ఈ అక్కసు ఆక్రోశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ను అపరిమితంగా ద్వేషించే వాళ్లకు ఆనందాన్ని ఇవ్వొచ్చు. ఈ ఓట్లను తెలుగుదేశం, జనసేనలు పొందవచ్చు. అయితే ఆల్రెడీ జగన్ వైపు మొగ్గిన జనంతో పోలిస్తే.. ఈ ద్వేషించే వారి సంఖ్య పరిమితంగా కనిపిస్తోంది. ఫలితంగా టీడీపీ బలం కుంచించుకుపోతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. రేపటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయవచ్చు. దాదాపు కలిసి పోటీ చేస్తాయి కూడా.
గత ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీల ఉద్దేశం ఒక్కటే. అప్పుడు వేర్వేరుగా పోటీ చేసి జగన్ ను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు పెట్టిన పార్టీలే రేపు ఒక్కటిగా పోటీ చేసి జగన్ ను ఓడించే ప్రయత్నం చేయబోతున్నాయి. ఉద్దేశం, శక్తి ఒక్కటే. కాబట్టి.. జగన్ కూడా ఈ పొత్తు విషయంలో పెద్దగా గాబరాపడటం లేదు. అప్పుడు చెరో వైపు నుంచి జగన్ ను కార్నర్ చేయాలనుకునే వారు..ఇప్పుడు ఒక్కటిగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హైరానా లేదు.
రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎప్పుడూ రెండు కాదు అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు కూడా! వీళ్లు పొత్తుతో వచ్చినా, బీజేపీని కూడా కలుపుకుని వచ్చినా.. జగన్ మాత్రం తను అనుకున్న రాజకీయం చేస్తూ, ప్రజలను మాత్రమే నమ్ముకుని సాగుతున్నారు. మరి ప్రజలనే నమ్ముకున్న పాలకుడికి ఎలాంటి ఫలితాలుంటాయో వేరే చెప్పనక్కర్లేదు.