ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలినుంచి కూడా ప్రాంతీయ పార్టీల పట్ల విముఖతతోనే ఉన్నారు. అసలు భారతీయ భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతంలోనే- ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తుంచివేయాలనే దృక్పథం ఉంది. ఏకధ్రువ పార్టీగా బిజెపి మాత్రమే చలామణీలో ఉండాలని, కేంద్రంలో బలహీనమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మనుగడలో ఉండాలని.. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తమలో ఐక్యమై పోవాలనేది నరేంద్ర మోడీ ఆలోచన.
పవిత్రమైన రాజ్యాంగ దినోత్సవం నాడు.. భారత ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి తిని తోసిరాజనేలాగా నరేంద్ర మోడీ మాటలు ఉన్నాయి. కాకపోతే చాలా అందమైన మాటలతో, లౌక్యంగా తన అంతరంగాన్ని బయట పెట్టారు.
దేశంలో కుటుంబ పార్టీల ప్రాబల్యం పోవాలని నరేంద్ర మోడీ అంటున్నారు. కుటుంబ పార్టీల వలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని నరేంద్ర మోడీ ప్రవచించారు. ఇదంతా నిజమే కావచ్చు. పైనుంచి పరిశీలించినప్పుడు.. నరేంద్ర మోడీ వాదన చాలా సబబుగా, సహేతుకంగా కనిపిస్తుంది. అయితే బిట్వీన్ ది లైన్స్ చూసినప్పుడు ప్రాంతీయ పార్టీలను అణిచేయాలనే కోరిక ఇందులో మనకు అర్థమవుతుంది.
దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కుటుంబ పార్టీలుగానే నడుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ, బీహార్లో నితీష్ కుమార్ లను మినహాయిస్తే.. మిగతా మిగతా వాటిలో చాలా వరకు కుటుంబ పార్టీలే. యూపీలో ములాయం సింగ్ యాదవ్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకలో కుమారస్వామి కుటుంబాలు అనేకం ఇందుకు ఉదాహరణలుగా కన్పిస్తాయి.
కుటుంబ పార్టీలే ఉండకూడదని మోడీ ప్రకటించడం అంటే.. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అంతరించి పోవాలనే వాంఛ ఆ మాటల్లో కనిపిస్తుంది. కుటుంబ పార్టీ కావడం వలన అది ప్రజాస్వామిక స్ఫూర్తి తో పనిచేయదని అనలేము.
మోడీ ఈ విషయాన్ని జాగ్రత్తగా మాట్లాడుతూ అది తప్పు కాదు అంటూనే, ఒక కుటుంబం నుంచి సమర్థులు రావచ్చునని అంటూనే.. ఒక పార్టీ ఎక్కువ కాలం ఒక కుటుంబం చేతిలో ఉండకూడదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయాల పట్ల ఆయన అభిప్రాయం అది కావచ్చు. కానీ ఒకే కుటుంబం చేతిలో ఉన్నంత మాత్రాన వాళ్ళందరినీ ప్రజాకంటకులుగా పరిగణించాలని రూలేం లేదు. సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ ప్రజలకు నిరంతరాయంగా ఒరగపెడుతున్నదనే రుజువులు కూడా లేవు.
కుటుంబ పార్టీలను నిందించే ముందు మోడీ ఒకసారి ఒరిస్సా ఉదాహరణను పరిశీలించాలి. అక్కడ పార్టీ ఏర్పడినదే వ్యక్తి పేరు మీద. బిజూ జనతాదళ్ పార్టీ నాయకుడిగా బిజూ పట్నాయక్ కుమారుడు నవీన్ పట్నాయక్ ఎంతటి ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నాడో అందరూ గమనిస్తూనే ఉన్నారు.
ఒకరిద్దరు వ్యక్తులు పెడదారి పట్టిన అంతమాత్రాన కుటుంబాల ప్రాబల్యం అధికంగా ఉండే పార్టీలే తగవని మాట్లాడడం మంచిది కాదు.