సీఎంల‌తో పీఎం వీడియా కాన్ఫ‌రెన్స్..ఏం తేల్చిన‌ట్టు?

వాస్త‌వానికి మే 3వ తేదీ వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగ‌నుంది. ముందుగా చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం మే 3 వ‌ర‌కూ నిర్బంధం కొన‌సాగ‌నుంది. కానీ ఈ సారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కాస్త ముందుగానే మొద‌లుపెట్టారు,…

వాస్త‌వానికి మే 3వ తేదీ వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగ‌నుంది. ముందుగా చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం మే 3 వ‌ర‌కూ నిర్బంధం కొన‌సాగ‌నుంది. కానీ ఈ సారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కాస్త ముందుగానే మొద‌లుపెట్టారు, మే 3 త‌ర్వాత ఏమిటి? అనే అంశం గురించి రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో జాయింట్ వీడియో కాన్ఫ‌రెన్స్ ను నిర్వ‌హించారు. 

ఇంత‌కీ ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఏం తేల్చిన‌ట్టు? అంటే.. ఇంకా అధికారికంగా అయితే ఏం ప్ర‌క‌టించ‌లేదు. అయితే లాక్ డౌన్ విష‌యంలో త‌మ ఇబ్బందుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లాయి. అయితే ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు లాక్ డౌన్ ను డిమాండ్ చేసేశాయి! తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ తో స‌హా మొత్తం ఐదు రాష్ట్రాలు మే 3 త‌ర్వాత త‌లుపులు తెరిచే ప్ర‌స‌క్తి లేద‌ని స్ఫ‌ష్టం చేశాయి. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మే 7 వ‌ర‌కూ అంటే, మిగ‌తా వాళ్లు మే 3 త‌ర్వాత క‌నీసం మ‌రో రెండు వారాల లాక్ డౌన్ కు రెడీ అని ప్ర‌క‌టించారు.

అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ లాక్ డౌన్ త‌మ వ‌ల్ల కాద‌న్న‌ట్టుగా స్పందిస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఈశాన్య రాష్ట్రాలు లాక్ డౌన్ నుంచి మిన‌హాయించ‌మ‌ని కోరుతున్నాయి. ఇంకా లాక్ డౌన్ పెడితే త‌మ రాష్ట్రాలు దివాళా తీయాల్సిందే అని అక్క‌డి సీఎంలు అంటున్నారు. అంతేగాక ఆ రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌మోదైన కేసులు ఒక‌టీ అరే! 

ఐదు రాష్ట్రాల వాళ్లు లాక్ డౌన్ పెంచాల‌ని అంటే, మరో ఐదు రాష్ట్రాల వాళ్లు లాక్ డౌన్ నుంచి మిన‌హాయించ‌మ‌ని కోరుతున్నాయి. వీరంతా బాహాటంగా ఈ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దాదాపుగా ప్ర‌ధానికి కూడా వీరు అదే వెర్ష‌నే చెప్పి ఉండొచ్చు.

కేర‌ళ సీఎం పిన‌రాయి విజ‌య‌న్ అయితే మోడీతో వీడియో కాన్ఫ‌రెన్స్ కు హాజ‌రే కాలేద‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో ఏమీ చెప్ప‌డ‌ని స్ప‌ష్టం అవుతోంది, తాము కూడా మోడీకి చెప్పాల్సింది ఏమీ లేద‌న్న‌ట్టుగా విజ‌య‌న్ ఈ  స‌మావేశంలో పాల్గొన‌లేద‌ని తెలుస్తోంది. కేర‌ళ‌లో కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని, న‌మోదైన కేసుల్లో మెజారిటీ మందిని డిశ్చార్జి చేసిన‌ట్టుగా ఆ ప్ర‌భుత్వం చెబుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా విజ‌య‌న్ ఈ స‌మావేశాన్నే ప‌ట్టించుకోన‌ట్టున్నారు.

స్థూలంగా ఈ స‌మావేశంలో మోడీ ధైర్య‌వ‌చ‌నాల‌తో, జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే సూచ‌న‌ల‌తో ముగించార‌ట‌. క‌రోనాను ఇప్ప‌టి వర‌కూ బాగా ఎదుర్కొన్న‌ట్టుగా, వేల మంది ప్రాణాల‌ను కాపాడిన‌ట్టుగా, ఇక ముందు కూడా క‌రోనా ప్ర‌భావం ఉంటుంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మోడీ సూచించిన‌ట్టుగా స‌మాచారం. ఇక రెడ్ జోన్ల‌లో లాక్ డౌన్ ను పాటిస్తూ, గ్రీన్ జోన్ల‌లో మిన‌హాయింపుల గురించి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని వివిధ రాష్ట్రాల సీఎంలు మోడీకి సూచించిన‌ట్టుగా స‌మాచారం. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.