రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలతో పదవిని కోల్పోయిన మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ గా కొత్త ఈసీ జస్టిస్ కనకరాజ్ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పదవి కోల్పోయాకా చంద్రబాబు నాయుడి అనుచరగణం, వివిధ పార్టీల్లోని చంద్రబాబు ఏజెంట్లంతా పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటి సంఖ్య పదికి పైనే ఉన్నట్టుంది!
కమ్మ బలగం, చంద్రబాబు వర్గం.. ఏపార్టీల్లో ఉన్నా.. నిమ్మగడ్డ పదవి తమకు చాలా కీలకంగా భావించినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో అనేక మంది పిటిషన్లు వేశారు. అయితే పిటిషన్లలో పేర్లు మాత్రమే మారాయట.. నిమ్మగడ్డ ఏ పిటిషన్ ను అయితే దాఖలు చేశారో, ఆ పిటిషన్ లోని పేరాలనే అన్ని పిటిషన్లలోనూ పేర్కొన్నారట!
ఈ విషయాన్ని కూడా కనకరాజ్ తన పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మీద తమకు తోచిన అభియోగాలను మోపి, వాటినే కాపీ పేస్టు కొట్టి.. పేర్లను మార్చి పిటిషన్లు దాఖలు చేసిన వైనాన్ని కౌంటర్ పిటిషన్లో ప్రస్తావించారట కనకరాజ్. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం పదవి నుంచి తొలగించలేదు అనే విషయాన్ని కొత్త ఈసీ ప్రస్తావించారట. ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారని, ఆయనను ఎవరూ తొలగించలేదనే విషయాన్ని కనకరాజ్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.
నిమ్మగడ్డ తన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన అభియోగాలు కూడా అబద్ధాలని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారట. అసలు ఇప్పుడు నిమ్మగడ్డ ఈసీ కానే కాదని, ఆయన మాజీ ఈసీ అని, పిటిషన్ ను మాత్రం ఈసీ హోదాలో దాఖలు చేశారని.. ఈ పిటిషన్ మొదటికే మోసం అని కొత్త ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారట. ఇక ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇతర రాజకీయ నేతలకు కూడా పిటిషన్లు వేసే అవసరం, అర్హత లేదని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నట్టుగా సమాచారం.