ఉగాది పచ్చడి, కల్కి, పవన్.. ఇండియా వెదుకులాట

ఉగాది పచ్చడి, పవన్ కల్యాణ్, ప్రభాస్, గోవా, ఆవకాయ లాంటి పదాలు మాత్రం ఈ ఏడాది కూడా రిపీట్ అయ్యాయి.

ఇప్పుడు ఏం కావాలన్నా గూగుల్ లో వెదకడం కామన్ అయిపోయింది. మరి 2024లో ఎక్కువమంది భారతీయులు గూగుల్ లో ఏం వెదికారు. ఏఏ రంగాల్లో ఏఏ అంశాల కోసం సెర్చ్ చేశారో గూగుల్ వెల్లడించింది.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాపిక్ ఐపీఎల్. దీని తర్వాత టీ20, బీజేపీ, 2024 ఎలక్షన్ రిజల్ట్స్, ఒలింపిక్స్ పదాలున్నాయి. ఈ ఓవరాల్ లిస్ట్ లో స్వర్గీయ రతన్ టాటా పేరు ఏడో స్థానంలో నిలిచింది.

ఇక సెగ్మెంట్స్ వారీగా చూసుకుంటే.. మూవీస్ విభాగంలో ఎక్కువమంది వెదికిన సినిమా పేరు స్త్రీ-2. రెండో స్థానంలో కల్కి, మూడో స్థానంలో 12th ఫెయిల్ ఉన్నాయి. టాప్-10 లిస్ట్ లో సలార్, గోట్, హనుమాన్ సినిమాలకూ స్థానం దక్కింది.

భారత్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన షోల వివరాలు చూస్తే.. మొదటి స్థానంలో హీరామండి, రెండో స్థానంలో మీర్జాపూర్, మూడో స్థానంలో లాస్ట్ ఆఫ్ అజ్ నిలిచాయి. బిగ్ బాస్ 17, బిగ్ బాస్ 18 కోసం కూడా ఎక్కువమంది వెదికారు.

ఎక్కువమంది వెదికిన సెలబ్రిటీల విషయానికొస్తే.. వినీష్ పోగాట్, నితీష్ కుమార్, చిరాక్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా, పవన్ కల్యాణ్ తొలి 5 స్థానాల్లో నిలిచారు. టాప్-10 లిస్ట్ లో పూనమ్ పాండే, రాధిక మర్చెంట్ కూడా ఉన్నారు.

ఇక గూగుల్ లో బాగా పాపులరైన నియర్ మీ ట్యాగ్ కింద కూడా చాలా సెర్చ్ నడిచింది. అఖి నియర్ మీ, ఓనమ్ సధ్య నియర్ మి, రామ్ మందిర్ నియర్ మి, స్పోర్ట్స్ బార్ నియర్ మి అంటూ ఎక్కువమంది భారతీయులు సెర్చ్ చేశారు.

క్రీడలకు సంబంధించి ఎక్కువమంది ఇండియన్స్.. ఐపీఎల్, టీ20, ఒలింపిక్స్, ప్రో కబడ్డీ లీగ్స్ గురించి వెదకగా.. ట్రావెల్ కు సంబంధించి అజర్ బైజాన్, బాలీ, మనాలీ, కజికిస్థాన్, జైపూర్ గురించి ఎక్కువగా ఆరా తీశారు. లిస్ట్ లో కశ్మీర్, అయోధ్య, సౌత్ గోవా కూడా ఉన్నాయి.

ఇక వంటల విషయానికొస్తే, ఎక్కువ మంది భారతీయులు పోర్న్ స్టార్ మార్టినీ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. వోడ్కాకు ప్యాషన్ ఫ్రూట్ (తెలుగులో కృష్ణ ఫలం అంటారు) మిక్స్ చేసి తయారు చేస్తారు దీన్ని. రెండో స్థానంలో ఆవకాయ ఎలా తయారు చేయాలో ఎక్కువమంది వెదికారు. ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో కూడా వెదకడం విశేషం. దీనికి నాలుగో స్థానం దక్కింది.

గతేడాది ఎక్కువమంది వెదికిన చంద్రయాన్, ఛాట్ జీపీటీ, కియరా అద్వానీ, వియత్నాం లాంటి పదాలకు ఈ ఏడాది అస్సలు చోటు దక్కలేదు. ఉగాది పచ్చడి, పవన్ కల్యాణ్, ప్రభాస్, గోవా, ఆవకాయ లాంటి పదాలు మాత్రం ఈ ఏడాది కూడా రిపీట్ అయ్యాయి.

4 Replies to “ఉగాది పచ్చడి, కల్కి, పవన్.. ఇండియా వెదుకులాట”

Comments are closed.