జీవితంలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం వుంది. నవ్వుతూ బతకాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని దివంగత దర్శకుడు జంధ్యాల అన్నారు. తెలుగు రాజకీయాల్లో కేఏ పాల్ అతిపెద్ద కమెడియన్ అయ్యారు. మన కర్మ కాలి కమెడియన్ అంటే నెగెటివ్ కోణంలో మాట్లాడుకుంటున్నాం. కానీ నవ్వించడం అంటే నవ్వులాట కాదు. అదో పెద్ద ఆర్ట్. జంధ్యాల, ఈవీవీ తర్వాత ఆ స్థాయిలో నవ్వించే దర్శకులు మనకు లేరు.
ఆరోగ్యానికి హాస్యం పరమ ఔషధం. ప్రస్తుత సమాజంలో రాజకీయాలు కలుషితమయ్యాయి. రోజురోజుకూ దిగజారుతూ అంట రానివిగా మారాయి. దూషణల్లో బూతులు శ్రుతిమించాయి. వ్యంగ్యం కొరవడింది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ పొలిటికల్ కమెడియన్‌గా అవతరించారు.
‘నా పిలుపునందుకొని 141 మంది దేశాధినేతలు రష్యాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇటీవలే 26 మంది జాతీయ నేతలు నా హోటల్‌కు వచ్చారు. అమిత్‌షా ఇప్పటికి పదిసార్లు అధికారికంగా నన్ను కలిశారు. అనధికారికంగా ఎన్నోసార్లు కలిశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రూ.10 కోట్లు అడిగితే ఆశ్చర్యపోయాను. 10 వేల కోట్లు అడుగుతారేమో అనుకున్నాను. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రజాశాంతి పార్టీనే ప్రత్యామ్నాయం. నాకు అవకాశమిస్తే ఒక్కో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల చొప్పున పెట్టుబడులు తీసుకొస్తానని, లక్ష మందికి ఉపాధి కల్పిస్తానని అంటున్నారు’ అని మాట్లాడే వ్యక్తులు ఎక్కడుండాలి? …మానసిక వైద్యశాలలో ఉండాలి. అబ్బే అలా జరగడం లేదు. ఇలాంటి వాళ్లంతా పలు చానళ్ల స్టూడియోల్లో ప్రత్యక్షమవుతున్నారు.
అంతెందుకు, ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంక్ వీడియోల చిత్రీకరణ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మానసిక రుగ్మతతోనే ఇలాంటివన్నీ నడిరోడ్డుపై చేస్తున్నాడని, ఇలా పలు రకాల వ్యక్తిగత విమర్శలతో ప్రముఖ చానల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. ఆ తర్వాతే ఆ వర్తమాన హీరోని స్టూడియోకి పిలిపించుకుని తిట్టి, తిట్టించుకుని, ఫిర్యాదు చేసి నానా రభస సృష్టించారు. మెంటలోడు అని తామె చెప్పి, అలాంటి వ్యక్తిని స్టూడియోకి పిలిపించుకుని షో నడపడం వెనుక రేటింగ్ కోణం తప్ప, సమాజ శ్రేయస్సు ఉందా?
అలాగే కరాటే కల్యాణి చేతిలో దెబ్బలు తిన్న మరో యూట్యూబర్‌ను ‘మహా’ బ్యూటీ యాంకరమ్మ చర్చకు పిలిచారు. దాడి నేపథ్యంలో అతనితో మాట్లాడుతూ….నీ మానసిక స్థితి ఏంటో తెలుసా? అంటూ ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. యూట్యూబర్లు, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రాంక్ వీడియోలను ఎంత మంది చూశారో, చూస్తున్నారో తెలియదు కానీ, వివిధ చానళ్లు రేటింగ్స్ కోసం వేసే సర్కస్ ఫీట్లు… వాటికి ఏ మాత్రం తగ్గవనే విమర్శ మాత్రం బలంగా వుంది.
ఓ మీడియాధిపతి పాల్‌ను ఇంటర్వ్యూ చేయడం వెనుక ఉద్దేశాన్ని పసిగట్టలేని అమాయక స్థితిలో జనం లేరు. కాకపోతే ఇప్పటికే పాల్ కమెడియన్‌గా స్థిరపడ్డారు. కాసేపు నవ్వుకోవాలంటే పాల్ మాటలు వినాలని వీక్షకులు కోరుకుంటారని గ్రహించి, ఆయనతో తరచూ డిబేట్స్ నిర్వహిస్తున్నారనేది నిజం.
ఈ పరంపరలోనే పాల్‌తో వీకెండ్ జర్నలిస్ట్, మీడియాధిపతి ఇంటర్వ్యూ సరదాగా సాగింది. ఆయన ప్రశ్నలకు పాల్ తుంటర సమాధానాలు ఇచ్చారు. పాల్‌ను పైకి లేపేవాళ్లంతా గ్రహించాల్సిన విషయం ఏంటంటే… చివరికి తాము కూడా పాల్‌లా తయారవుతామని.
సొదుం రమణ