“అహనా పెళ్ళంట” సినిమాలో ఒక సీనుంటుంది. లక్ష్మీపతి పాత్రలో ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరకి కొందరు వచ్చి గుడి కట్టడానికి విరాళం అడుగుతారు. చాలా గొప్ప పని చేస్తున్నారు కనుక పాతిక వేలిస్తాను తీసుకళ్లండి అని చెప్తాడు.
అది విని అక్కడే ఉన్న అరగుండు గోవిందం పాత్రలో ఉన్న బ్రహ్మానందం అవాక్కయి చూస్తాడు. ఎందుకంటే లక్ష్మీపతి ట్రాక్ రికార్డ్ తెలిసినవాడు తానే కనుక. పిల్లికి కూడ బిచ్చమెయ్యని పరమ పిసినారి, సొంతానికి సంపాదించుకునే యావ తప్ప ఇంకేమీ పట్టని దగుల్బాజీ క్యారక్టర్ అని అరగుండు గోవిందానికి తెలుసు.
తీరా పాతికవేలకి చెక్కు రాసి సంతకం పెట్టకుండా ఇస్తాడు లక్ష్మీపతి. సంతకం పెట్టమని వచ్చినవాళ్లు అడిగితే, “నేను గుప్త దానాలే చేస్తాను. దానం చేస్తూ నా పేరు రాయడం నాకిష్టం లేదు” అని లోపలికెళ్లిపోతాడు. ఇదెక్కడి గోల అన్నట్టుగా చందాకి వచ్చినవాళ్లు చూస్తుంటే వాళ్లకి లక్ష్మీపతి అసలు క్యారక్టర్ చెప్పి కళ్లు తెరిపించే పని చేస్తాడు.
ఆ సీన్ ని ఇప్పుడు రాజకీయానికి లింకు చేసుకుంటే లక్ష్మీపతి ప్లేసులో చంద్రబాబు, చందా కోసం వచ్చినవాళ్ల స్థానంలో ఆంధ్ర ప్రజలు, గోవిందం ప్లేసులో యెల్లో మీడియావాళ్లు ముద్దుగా పిలుచుకునే బ్లూ మీడియా వాళ్లు ఉంటారు.
చంద్రబాబు వాగ్దానాలు చేస్తాడు. అంతిస్తా, ఇంతిస్తా అంటాడు. కానీ ఎప్పటికీ ఇవ్వడు. ఇది అతని ట్రాక్ రికార్డ్.
మాట మీద నిలబడనప్పుడు వాగ్దానాలు ఎన్నైనా చెసేయొచ్చు. నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడే ఆచితూచి ప్రామిస్సులు చెయ్యాలి.
తెదేపా-జనసేన మేనిఫెస్టోలోని డొల్లతనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తరచి చూస్తే.
మచ్చుకి ఒక్కటి చెప్పుకుందాం.
ఒక విలేకరి నారా లోకేష్ ని ఒక ప్రశ్న అడిగాడు-
“సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతోంది అని అన్నారు కదా. మరి మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ప్రకటించారు. ఎలా ఇద్దామనుకుంటున్నారు?” అని.
దీనికి చిన్నబాబు సమాధానం ఏంటంటే, “మేము సంపద సృష్టించి ఇస్తాం. పెట్టుబడులు పెట్టించి 20 లక్షల ఉద్యోగాలు కలిపిస్తాం. అలా వచ్చిన డబ్బుతో పథకాలిస్తాం” అని చెప్పాడు.
20 లక్షల ఉద్యోగాలా? ఇంతకీ బాబుగారి పాలనలో 2014-19 మధ్య ఎన్ని ఉద్యోగాలు కలిపించారో లెక్క తీస్తే 32,000 అని తేలింది. అలాంటి ట్రాక్ రికార్డుతో ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు?
బహుశా ప్రతి ఇంట్లోనూ రానున్న ఐదేళ్లల్లో వచ్చే ప్రతి ఐటీ ఉద్యోగాన్ని బాబుగారి ఖాతాలో వేసుకునే ఆలోచన ఉందా? ఆ ఐటీ పితామహుడి వల్లనే తమకి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, హైదరాబాదులోనూ జాబులొచ్చాయని చెప్పించి అదంతా బాబుగారి ఉద్యోగ కల్పనగా చూపించుకుందామనుకుంటున్నారా?
అంటే బాబుగారి పాలనకి సరిహద్దులుండవనుకోవాలి. ఇప్పటికే అమెరికాలో ఉన్న తెలుగు ఐటీ ఉద్యోగులంతా తనవల్లే ఉద్యోగాలొచ్చి అమెరికా వెళ్లారని బాబుగారే చెప్పుకున్నారు. కనుక ఏదైనా చెప్పుకోవడానికి సిగ్గుపడరు.
ఇక పవన్ కళ్యాణ్ వ్యవహారం చూడండి.
ప్రతి ట్రాన్సాక్షన్ మీద పోలవరం సెస్ విధించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తారట. అసలు పోలవరం కేంద్ర నిధులతో కడతామని చెప్పారు కదా. కనుక కేంద్రాన్ని అడుగుతాను అనకుండా కొత్తగా ఈ పోలవరం సెస్ ఏంటి? పైగా బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఈ “సెస్ బ్యాండ్” ఏంటి?
ఈ మేనిఫెస్టో వ్యవహారంలో అవకతవకలే కాదు, అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా మేనిఫెస్టోలో అసలా పార్టీ ప్రాతినిథ్యమే కనిపించడంలేదు. చంద్రబాబు, పవన్ ఫోటోలు వేసుకున్నప్పుడు మోదీ ఫోటోనో, కనీసం పూరందేశ్వరి ఫోటోనో కనిపించాలి కదా. అదేం లేదు.
ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌కు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ బిగ్‌షాక్ ఇచ్చారు.
కనీసం మేనిఫెస్టో ప్రతిని పట్టుకోడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఇష్టపడలేదు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా బాబు, పవన్‌తో పాటు బీజేపీ జాతీయ నాయకుడికి ప్రతిని ఇవ్వగా, తీసుకునేందుకు ఆయన తిరస్కరించడం గమనార్హం. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో అమలు బాధ్యత కేవలం టీడీపీ, జనసేన పార్టీలదే అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆచరణకు సాధ్యం కాని హామీలున్న మేనిఫెస్టోలో భాగస్వామ్యం కావడం ఇష్టం లేకే, బీజేపీ దూరంగా వుందనే చర్చకు తెరలేచింది. మేనిఫెస్టోకు కేవలం సంఘీభావం మాత్రమే బీజేపీ జాతీయ నాయకత్వం తెలిపింది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మేనిఫెస్టో విడుదలకు దూరంగా ఉండడం గమనార్హం.
ఇంతకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్టు చంద్రబాబు అధికారం కోసం అలివి కాని హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజానీకం కూడా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరింత బలాన్ని ఇస్తోంది. పొత్తులో వుంటూ, మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పడం, అలాగే విడుదల సందర్భంగా కనీసం ప్రతిని పట్టుకోడానికి కూడా ఇష్టపడకపోవడం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు. మేనిఫెస్టో ఎపిసోడ్ ముమ్మాటికీ టీడీపీ, జనసేనకు భారీ షాక్ అని చెప్పక తప్పదు.
డబుల్ ఇంజన్ సర్కార్ అని మోదీ తొలి ప్రసంగంలో చెప్పినా ఎక్కడా కూడా ఈ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఇస్తున్నట్టు ప్రకటించలేదు. ఆఖరికి పోలవరం కూడా మీరే కట్టుకోండి అన్న ధోరణిలో మొహం చాటేసినట్టుగా ఉంది. అందుకే “పోలవరం సెస్” అంటున్నాడా పవన్? ఇదెక్కడి కూటమో ఏమిటో?
ఇంత జరుగుతుంటే కూటమికి ఓటేయాలనుకునే ఓటర్లు బీజేపీ అభ్యర్థులకి ఎలా వెయ్యాలి? ఏ మనసుతో వేయగలరు? తమకి తెదేపా మీదో, జనసేన మీదో అభిమానమున్న ఓటర్లు కూటమిలో ఉంది కదా అని బీజేపీకి ఓటేయాలంటే మనసు వస్తుందా?
ఇంతకీ బీజేపీ ఈ మేనిఫెస్టోలో భాగం కాకపోవడానికి కారణమేమయ్యుండొచ్చు?
గతంలో చంద్రబాబు, మోదీల ఫొటోలతో 2014లో ఒక మేనిఫెస్టో వచ్చింది. ఆ మేనిఫెస్టోలో దేనినీ అమలు చేయలేదని, కనుక చంద్రబాబు “చెప్పాడంటే చెయ్యడంతే” అని మోదీకి అర్థమైపోయింది. మళ్లీ ఇప్పుడు అదే బాబుతో మేనిఫెస్టోలో భాగం కావడానికి మోదీకి ధైర్యం చాలలేదు. అందుకే దూరంగా ఉన్నాడు. తన పార్టీని దూరంగా పెట్టాడు.
దీనిపై జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, “చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను”, అని ట్విటర్లో పోస్ట్ చేయడం జరిగింది.
ఏతావాతా చెప్పేదేంటంటే చంద్రబాబు చెప్పాడంటే చెయ్యడంతే. చెయ్యడు అనేది ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు, ప్రస్తుత మేనిఫెస్టో కూడా అదే సంకేతమిస్తోంది.
పోనీ మేనిఫెస్టోని పక్కన పెట్టి, అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలు చూద్దాం. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రకటన టైమ్ లో 13 జిల్లాలకు సెపరేట్ గా ఒక్కో పేజ్ విడుదల చేశారు అసెంబ్లీ లో. శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 10, విశాఖలో 13, తూర్పు గోదావరిలో 14, పశ్చిమలో 14, కృష్ణలో 14, గుంటూరులో 11 ప్రభుత్వ ఖర్చుతో పెట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రకటించారు. అందులో ఏవీ కాలేదని అందరికీ తెలుసు.
“ప్రజలు ఓడించారు కాబట్టి కాలేదు. లేకపోతే అయ్యేవే. ఎవరికైనా ఐదేళ్లల్లో చెప్పినవన్నీ చెయ్యడం సాధ్యం కాదు. విజనరీ లెక్కలు వేరే ఉంటాయి”, అని చెప్తారు. మరి అదే లెక్క జగన్ మోహన్ రెడ్డికి కూడా ఉండొచ్చుగా!
అబ్బే చంద్రబాబుకైతే ఒక నీతి, జగన్ కి మరో నీతి! ఏది ఏమైనా, మేనిఫెస్టోలో చెప్పిన వాటిల్లో జగన్ ఎన్ని చేసాడు? గతంలో తన మేనిఫెస్టోలో చెప్పినవి చంద్రబాబు ఎన్ని చేసాడో లెక్క తీస్తే “చెప్పాడంటే చేస్తాడంతే” అనే నినాదానికి జగన్ మోహన్ రెడ్డి, “చెప్పాడంటే చెయ్యడంతే” అనే మాటకి చంద్రబాబు సరిగ్గా సరిపోతారు.
– హరగోపాల్ సూరపనేని