కొత్త సంవత్సరం మొదలవుతున్నప్పుడు.. కొత్త రిజల్యూషన్స్ తయారు చేసుకోవడం.. రాబోయే ఏడాది మొత్తం ఈ రిజల్యూషన్స్ ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని అనుకోవడం చాలా సాధారణమైన విషయం. మనలో చాలా మంది ఇలా చేస్తుంటారు. కానీ ఇలాంటి రిజల్యూషన్స్ అన్నీ ప్రహసన ప్రాయంగా ముగుస్తుంటాయి.
ఈ రిజల్యూషన్స్ ఎలాంటివంటే.. సిగరెట్ మానేయడం లాంటివి! అలవాటున్న ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో కొన్ని పదుల సార్లు సిగరరెట్ మానేస్తూనే ఉంటారు!! అలాగే స్టూడెంట్స్ తీరు కూడా. ఎగ్జామ్స్ సీజన్ దగ్గర పడినప్పుడు.. ‘వచ్చే ఏడాది నుంచి ఇలా కాదు.. అకడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఏరోజు పాఠాలు ఆరోజు చదివేసుకోవాలి.. చివర్లో టెన్షన్ పడకూడదు’ అని తీర్మానించుకుంటూ ఉంటారు. ఈ తరహా తీర్మానాలన్నీ స్మశాన వైరాగ్యం లాంటివి. ఆ క్షణంలో పుట్టే తీర్మానం.. కొన్ని క్షణాలు లేదా నిమిషాల పాటు చాలా బలంగా పెరిగి.. ఆ తర్వాత అంతర్ధానమైపోతుంది.
కానీ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న క్షణాల్లో చాలా మంది ఇలాంటి రిజల్యూషన్స్ తయారుచేసుకుంటూనే ఉంటారు. వాటిలో కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, టూర్లు, రిక్రియేషన్ తదితర వ్యవహారాలెన్నో ఉంటాయి. వీటికి సంబంధించిన రిజల్యూషన్స్ అన్నీ దాదాపుగా ఆర్థిక వ్యవహారంతోనూ ముడిపడి ఉంటాయి.
ఆర్థిక లావాదేవీల నిర్వహణ గురించి సలహా చెప్పేంత పాటవం, పరిణతి నాకు లేదు. కానీ.. నేను చెప్పదలచుకున్నది ఆర్థిక నిర్వహణ గురించే అయినప్పటికీ.. వర్తమాన ప్రపంచంలో సామాజిక మూలాలు కలిగినటువంటిది. మీ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించినది. అందువల్ల చెప్పడానికి సాహసిస్తాను.
మా నాన్న చాలా తరచుగా ఒక మాట చెబుతూ ఉండేవాడు. ‘యేట్లో పారేసినా సరే ఎంచి పారెయ్యాలి..’ అని! అంటే, పెట్టే ప్రతి ఖర్చుకీ అకౌంటబిలిటీ ఉండాలనేది ఆయన ఉద్దేశం.
వర్తమాన ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళుతోంది. ఆర్థికంగా మధ్యతరగతి వర్గం తగ్గుతోంది. మాయమౌతోంది అని కూడా చెప్పవచ్చు. ‘పేదవర్గం’ స్థిరంగా ఉంది. ‘సంపన్నవర్గం’ స్థిరంగా ఉంది.. అంతో ఇంతో పెరుగుతోంది. మధ్యతరగతి సన్నగిల్లి, ఎగువమధ్యతరగతిగా రూపుమార్చుకుంటోంది. వీరందరి వద్ద డబ్బు ఆడుతోంది! ఇలాంటి వర్తమానంలో ఈ సిద్ధాంతాన్ని సాంఘిక, వ్యక్తిత్వ కోణాల్లోంచి అర్థం చేసుకోవడం అవసరం.
ఒక ఉదాహరణగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాలను తీసుకుందాం. నేటి యువతరాన్ని ఊరించే ఉద్యోగాలు ఇవి. ప్రతి సంవత్సరమూ ఇంజినీరింగ్ ఎడ్మిషన్ల సమయంలో ఈ వేలంవెర్రి జాతరను గమనిస్తే అర్థమవుతుంది. అందరికీ సీఎస్ మాత్రమే కావాలి. కొన్ని బ్రాంచిలు (ప్రస్తావించి కించపరచడం అనవసరం) ఎవ్వరికీ అక్కర్లేదు. సీఎస్ తర్వాత.. చాలా బ్రాంచీలు దేవులాడి, ఏదీ దొరక్కపోతే ఆ కొన్ని బ్రాంచీల్లో చేరుతున్న విద్యార్థులు కొల్లలు. చేరిన నాటినుంచీ వారిలో అసంతృప్తే! ఆ మరుసటి సంవత్సరం కూడా ఎంట్రెన్సు పరీక్షలు రాసి సీఎస్ కోసం ప్రయత్నించాలనే కోరిక.
అప్పుడు కూడా విఫలమైతే.. ఏదో నామ్ కే వాస్తే గా ‘బీటెక్’ అనిపించుకుంటే చాలునని, చదువుతున్న కోర్సుకు సమాంతరంగా విడిగా ఏవైనా ఐటీ కోర్సులు చేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగం దక్కుతుందని ఆశ. ఇంతటి వేలంవెర్రికి కారణం ఏమిటి? ఆ ఉద్యోగాల్లో అత్యధిక వేతనాలు వెల్లువలా వచ్చి పడుతుండడమే. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు కొన్ని బ్రాంచిలను మూసివేయాలని నిర్ణయించుకుంటున్నాయంటే పరిస్థితి ఎలా మారుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అందరూ సీఎస్– బీటెక్ లుగా తయారైతే ఎలా ఉంటుందో ఊహకు అందని సంగతి. మూడుపూటలా బిర్యానీ మాత్రమే తింటూ జీవిస్తే, శరీరం ఏమవుతుందో.. సమాజం కూడా అలా తయారుకావొచ్చు.
ఒకప్పట్లో– మరీ దూరమేం కాదు– సుమారు ముప్పయ్యేళ్ల కిందట డిగ్రీలు పూర్తిచేసిన వారికి వెయ్యి రూపాయలకంటె తక్కువ వేతనంతో ఆఫర్ వస్తే.. ఎగబడి చేరిపోయే వాళ్లు. ఆ తర్వాత నెమ్మదిగా వేతనాలపరంగా ఎదుగుతూ పోయేవారు. ఇప్పుడు యాభైవేల ప్రారంభ వేతనంతో ఆఫర్ వస్తే.. కుర్రకారు.. జాయిన్ అవకుండా.. బెటర్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. తను 80వేల నెలసరి వేతనం సంపాదిస్తూ, అంతే వేతనం పొందుతున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించిన అమ్మాయిలను నేను చూశాను. తల్లిదండ్రులిద్దరూ బాగా సంపాదిస్తున్న ఉద్యోగులుగా, వారిని తామే చూసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ ఏర్పడని స్థితిలో ఉన్న అమ్మాయి ఆమె! ‘నెలకు సుమారు లక్షన్నర రూపాయలు మేం ఇద్దరం బతకడానికి ఎలా సరిపోతుంది?’ అనేది ఆమె వాదన!
ఇప్పుడందరికీ ‘పెద్ద జీతాలు’ వస్తున్నాయనే వాదనను మరో రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడందరికీ ‘జీవితాలు పెద్దవి’ అవుతున్నాయి. యువతరం ఖర్చులు పెరుగుతున్నాయి. హైదరాబాదు వంటి నగరాల్లో జీవన ప్రమాణాలు బాగా పెరుగుతున్నాయి. అచ్చంగా అన్నీ విలాసాలే అని చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి. విలాసాలు అంటే ‘అవసరం’ అనే నిర్వచనం కిందికి రానివి మాత్రమే కదా! కానీ ‘అవసరం’ కేటగిరీ కోసమే అనూహ్యమైన ఖర్చులు పెట్టడం యువతరానికి ఒక అలవాటుగా మారుతోంది.
ఉదాహరణకు ‘ఒక పూట భోజనం’ అనుకుందాం! హైదరాబాదు నగరంలో అయిదు రూపాయల నుంచి, ఎనిమిదివేల రూపాయలవరకు రకరకాల ధరలకు దొరుకుతుంది. ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత తరచుగా చేస్తున్నారు? అనేది ముఖ్యం. అలాగని అందరూ దుబారా మనుషులే అనడానికి వీల్లేదు. పెద్దజీతాలు సంపాదిస్తున్న వారు వితరణశీలురుగా సమాజానికి ‘రీ పే’ చేస్తుండడం కూడా మనం గమనిస్తున్నాం. పెద్దజీతాల ప్రపంచం పెరిగేకొద్దీ.. సానుకూల ఫలితాలు ఇవి.
సంపాదిస్తున్న వాళ్లు అతిశయమైన ఖర్చులు పెట్టకూడదనేది ఈ వ్యాసం ఉద్దేశం కాదు. పెట్టే ఖర్చుల మీద నియంత్రణ ఉండాలనేది కూడా ఉపదేశం కాదు. పిసినారి తనాన్ని బోధించడం లక్ష్యం కాదు. కానీ పెట్టే ప్రతిరూపాయి ఖర్చుకు సంబంధించి ‘లెక్క’ మాత్రం ఉండాలి. అప్పుడప్పడూ ఆ లెక్క మీద ‘స్వీయ సమీక్ష’ ఉండాలి. అది వ్యక్తిత్వంలో భాగం కావాలి.
ముందే చెప్పుకున్నట్టు.. చిన్న వయసులో పెద్ద జీవితాలకు అలవాటు పడుతున్న వర్గం ఆధునిక సమాజంలో పెరుగుతోంది. ‘యేట్లో పారేసినా ఎంచి పారెయ్యాలనే’ సిద్ధాంతం వీరికి చాలా ముఖ్యం. మీరు ప్రతి రోజూ స్టార్ రేటెడ్ రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లి భోజనాలు చేయండి, పర్లేదు. ప్రతి వారాంతంలోనూ రెండు రాత్రులూ పబ్ లకు వెళ్లి రిలాక్స్ కండి. వారం మొత్తం అనుభవించిన ఒత్తిడినుంచి అదొక్కటే మీకు రిలీఫ్ ఇస్తున్నదని భావిస్తే.. తప్పకుండా అలాగే చేయండి.. దేనికీ వెనుకాడవద్దు. కానీ.. పెట్టిన ప్రతిరూపాయి ఖర్చును ‘రికార్డు’ చేయండి. ఒక చిన్న పుస్తకంలో రాయండి.
మన నెలవారీ సంపాదనల్లో ఎంత శాతం భవిష్యత్తు అవసరాలు, అనూహ్య అవసరాలకోసం పొదుపుల్లోకి మళ్లించాలో, ఎంత శాతానికి మించకుండా ఇంటి అద్దెలు ఉండాలో, ఎంత శాతం ఏయే వ్యవహారాలకు ఖర్చు చేయవచ్చునో సూచించే, సిద్ధాంతీకరించే ఫైనాన్షియల్ ప్లానింగ్ నిపుణులు అనేకమంది ఉంటారు. వారిలో మీకు రుచించిన ఏ సూచనలనైనా తీసుకోండి. ఈ వ్యాసంలోని సిద్ధాంతం ఫైనాన్షియల్ ప్లానింగ్ లాగా కనిపించే లైఫ్ స్కిల్ కు సంబంధించినది.
పెడుతున్న ఖర్చులను ఒక పుస్తకంలో నోట్ చేసిన తర్వాత.. అప్పుడప్పుడూ వాటిని సమీక్షించుకోండి. కనీసం నెలకు ఒకసారి సమీక్షించుకోవడం చాలా మంచిది. ఒక నెలలో సంపాదన ఎంత అనేది ఎటూ మీకు నిర్దిష్టంగా తెలుసు కాబట్టి.. ఒక నెలలో ఖర్చు ఎంత అనేది ‘హెడ్స్’ వారీగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ నెలలో మీరు తిండి మీద, సిగరెట్ల మీద, చాయ్ సమోసాల మీద, లిక్కరు/పబ్ ల మీద, సంఘసేవ మీద.. ఇలా వివిధ వర్గాల కింద ఎంతెంత ఖర్చు పెట్టారో మీకు తెలియాలి. కొన్ని గణాంకాలను జీర్ణం చేసుకోవడానికి మీకు గుండె దిటవు అవసరం అవుతుంది. మీ గుండె గుభేల్ అంటుంది.
ఎలాగంటే.. ప్రతిరోజూ చాయ్ కు ముందూ వెనుకా.. భోజనం తరువాత.. బాత్రూంకు ముందూ వెనుకా.. మిత్రులతో భేటీకీ అనువుగా.. ఇలా వివిధ సందర్భాలను సృష్టించుకుని తడవకొక సిగరెట్ తాగేస్తూ ఉంటే మనకేం నొప్పి తెలియదు. రోజుకు రెండు మూడొందలు జేబునుంచి ధారకట్టినా మనకు అర్థం కాదు. కానీ నెల గడిచిన తర్వాత.. రాసుకున్న చిట్టా ముందు పెట్టుకుని సమీక్షించుకుంటే.. యాభైవేల సంపాదనలో ఆరేడు వేల రూపాయలు సిగరెట్లకే తగలడిపోయాయంటే.. అప్పుడు భయం కలుగుతుంది.
మిమ్మల్ని ఎవ్వరూ సంస్కరించాల్సిన అవసరం లేదు. నియంత్రణ నేర్పే అవసరం లేదు. ఏ ఖర్చుల్ని నియంత్రించుకోవాలో.. వేటి విషయంలో ఇంకా ఉదారంగా ఉండవచ్చునో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆర్థిక ప్రణాళికల సిద్ధాంతాలు చాలా మందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఎందుకంటే.. అవి ఏ ఇద్దరికీ సమానంగా వర్తించవు. సార్వజనీనమైనవి అనుకోలేము. కానీ.. ‘యేట్లో పారేసినా ఎంచి పారెయ్యలానే’ సిద్ధాంతం వేరు. ఇది మీ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతం. మీ జీవితానికి అనువైన, ప్రత్యేకించిన ఆర్థిక ప్రణాళికల సిద్ధాంతాన్ని ‘టైలర్ మేడ్’లాగా మీరే తయారుచేసుకోగలిగే శక్తిని మీకు అది అందిస్తుంది. హేపీ న్యూ ఇయర్.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
చాలా బాగా రాశారు. ప్రెసెంట్ జనరేషన్ కి ఎస్పెషల్ గ కొత్తగా ఎర్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు పాటిస్తే చాలా ఉపయోగం.
Good information 👍