తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య , తమ తండ్రి రాజకీయాల్లోకి వచ్చేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల రజనీకాంత్ అధిక రక్తపోటుకు గురై హైదరాబాద్‌లో ఆస్పత్రి పాలయ్యారు. అనంతరం ఆయన కోలుకుని మూడు రోజుల క్రితం డిశ్చార్జి అయ్యారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కూతుళ్లు అడ్డు చెబుతున్నట్టు సమాచారం. ఏదో ఒకపార్టీలో చేరడం వేరు, సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించడం వేరని తండ్రితో తమ అభిప్రాయాలను కూతుళ్లు పంచుకున్నట్టు తెలుస్తోంది.
సొంత పార్టీ అంటే అంత సులభం కాదని కూతుళ్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. సొంత పార్టీపై ఈ నెల 31న ప్రకటిస్తానని, కొత్త ఏడాది జనవరిలో విధివిధానాలు వెల్లడిస్తానని ఇటీవల రజనీ ట్విటర్ వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే.
సొంత పార్టీ స్థాపన, రాజకీయ భవిష్యత్‌పై రజనీకాంత్ ఎక్కువ ఆలోచిస్తూ, తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, అందువల్లే అనారోగ్యంబారిన పడ్డారని తండ్రి గురించి కూతుళ్లు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయాలు మనకొద్దని, ఇక ఆ ఆలోచనలు, పనులు మానుకోవాలని రజనీకాంత్‌కు కూతుళ్లిద్దరూ మొర పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి కూతుళ్ల అభ్యర్థనపై రజనీ ఏ విధంగా స్పందిస్తారనేది ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది.