తెలంగాణలో గులాబీ దళం దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు రోజుకొక ఎమ్మెల్యే వంతున గులాబీ కండువా పక్కనపడేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మరొకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా నిందించడానికి పెద్దగా కారణాలు కనిపించడం లేదు.
ఎలాంటి విమర్శలు చేసినా సరే అవి హాస్యాస్పదం అవుతున్నాయి తప్ప.. రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలలో విముఖత పుట్టించేలా ఉండడం లేదు. రేవంత్ పరిపాలనలో తప్పులు చూడడానికి పాపం గులాబీ దళ నాయకులు నానా పాట్లు పడుతున్నారు.
ఏ పాయింటు మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించినా సరే.. రోజుల వ్యవధిలోనే వారి విమర్శలకు కాలం చెల్లుతోంది. ప్రభుత్వం పలానా హామీ నెరవేర్చలేదని నిందలు వేస్తే.. అవి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లెలోగా, దానికి సంబంధించి సర్కారు నిర్దిష్టమైన హామీతో ముందుకు వస్తోంది.. లేదా, దానిని అమలు చేసేస్తోంది. పాపం గులాబీ దళ నాయకులు మళ్ళీ కొత్త విమర్శలు వెతుక్కోవాల్సి వస్తోంది.
రైతు రుణ మాఫీ గురించి భారాస నాయకులు చాలా చాలా గొడవ చేశారు. ఆగష్టు 15లోగా చేసి తీరుతానని రేవంత్ చెప్పాక, ఆ విమర్శకు విలువ లేకుండా పోయింది. వాళ్లందరి నోర్లు మూయించేలా రేవంత్ రెడ్డి నెల ముందుగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు. లక్ష లోపుగా ఉన్న రైతు రుణాలన్నీ కూడా ఈ నెలాఖరులోగా మాఫీ కానున్నాయి. 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన గడువు ప్రకారం ఆగస్టు 15లోగా పూర్తిగా తీర్చేసేలాగా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఇక విమర్శించడానికి గులాబీ దళాలకు పాయింట్ ఏమీ మిగల్లేదు. తొలుత రేషన్ కార్డు నిబంధన గురించి పాట పాడారు కానీ.. అది కంపల్సరీ కాదని ప్రభుత్వం చెప్పిన తరువాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని గోలగోల చేస్తున్నారు. గులాబీ దళాలు లేవనెత్తుతున్న సమస్యలు నిజమైన ప్రజా సమస్యలు కాకపోవడంతో వారి వాదనలకు మన్నన దక్కడం లేదు.
సరైన పాయింటే లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత ఎక్కువగా విమర్శిస్తున్న కొద్ది బారాస నాయకులు అంతగా నవ్వులపాలు అవుతున్నారు. తమ పార్టీ బలహీన పడుతూ ఉన్నదని ఫ్రస్టేషన్ లో వారు ఏదేదో మాట్లాడుతున్నారని ప్రజలు జాలి పడుతున్నారు.