కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చిందా?

రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఇవ్వడం తన చేతుల్లో లేదని, పదవులు కావల్సినవారు అధిష్టానంతో మాట్లాడుకోవాలని తేల్చి చెప్పేశాడు.

కాంగ్రెసు పార్టీ అధిష్టానం తన విధానం మార్చుకుందా? ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఇస్తోందా? వారిని వారి ఆలోచనల ప్రకారం పనిచేసేందుకు అనుమతి ఇచ్చిందా? ముఖ్యమంత్రి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా? ఆ వెసులుబాటు కల్పించిందా? ఇన్ని ప్రశ్నలు ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే…పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పిన ఒక్క మాట కారణంగా ఈ ప్రశ్నలన్నీ పుట్టుకొని వచ్చాయి.

మీనాక్షి నటరాజన్ చెప్పిందని అంటున్న ఆ మాట పార్టీ మౌలిక విధానంలోనే మార్పు తెచ్చిందని అనుకోవాలి. మీనాక్షి నటరాజన్ చెప్పిందంటున్న విషయంపై పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయట. ఇంతకూ ఆమె ఏం చెప్పిందట? కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఎదురుచూస్తోంది దేనికోసం? అంటే కేబినెట్ విస్తరణ కోసం. కేబినెట్లో ఇంకా ఆరు పదవులు భర్తీ చేయాల్సివున్న సంగతి తెలిసిందే కదా.

ఈ నెల మొదటి వారంలో ఉగాది సమయంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఆరు పదవులు ఖాళీగా ఉండగా నాలుగు మంత్రి పదవులు భర్తీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రచారం జరగడమే కాదు మంత్రివర్గ విస్తరణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి పదవులు ఇవ్వాలో కూడా డిసైడ్ చేశారు. ఆ నాలుగు పదవుల కోసం లెక్కలేనంతమంది పోటీ పడ్డారు. ఒక్కో సామాజికవర్గానికి ఒక్కో పదవి ఇవ్వాలనుకుంటే చివరకు సామాజికవర్గాల సమతుల్యత కుదరలేదు. ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కులాలు, జిల్లాలు, బలాలు ఇలా ఎవరికివారు లెక్కలు వేసుకొని కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరూ లేరు. ఈసారి ఈ జిల్లాల నేతలకు ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావించారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచించారు. కాని కోమటిరెడ్టి రాజగోపాల రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని కొందరు వ్యతిరేకించారు. వినోద్‌కు పదవి ఇవ్వొద్దని మాదిగ సామాజికవర్గం వారు అడ్డుపడ్డారు. లంబాడి సామాజికవర్గం వారు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారు. ఇదంతా అందరికీ తెలిసిన కథే.

మొత్తం మీద ఇంత గందరగోళాన్ని తట్టుకోలేని హైకమాండ్ చివరకు కేబినెట్ విస్తరణను నిరవధికంగా వాయిదా వేసింది. రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఇవ్వడం తన చేతుల్లో లేదని, పదవులు కావల్సినవారు అధిష్టానంతో మాట్లాడుకోవాలని తేల్చి చెప్పేశాడు. ఎవరూ పార్టీ లైన్ దాటి వ్యవహరించవద్దని హెచ్చరించాడు. అప్పటినుంచి అందరూ గమ్మున ఉండిపోయారు. అయితే తాజాగా మీనాక్షి నటరాజన్ పేల్చిన బాంబు ఏమిటంటే…మంత్రివర్గ విస్తరణ అనేది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. దానిపై ఆయనే నిర్ణయం తీసుకోవాలి. మరి అధిష్టానం విధానం ఎప్పుడు మార్చుకున్నదో తెలియదు.