గత కొన్నేళ్లలో దేశంలో సంచలనం రేపిన ఉప ఎన్నిక తమిళనాడులోని ఆర్కే నగర్. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఆ ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేకించి తమిళనాడు పార్టీలు డబ్బు విషయంలో అమీతుమీగా తలపడటంతోనే ఆ ఉప ఎన్నిక సంచలనంగా నిలిచింది.
నాటి తమిళనాడు రాజకీయంలో క్రియాశీలకం అయ్యే ప్రయత్నం చేసిన దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికను రసవత్తరంగా మార్చాడు. అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకేలను ఎదుర్కొంటూ.. రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు శశికళ బంధువు అయిన దినకరన్ ఆర్కే నగర్ లో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాడనే ప్రచారం జరిగింది.
అంతే కాదు.. దినకరన్ అటు ఇరు పార్టీలనూ దెబ్బతీసి ఎమ్మెల్యేగా నెగ్గే అవకాశాలున్నాయనే వార్తలూ వచ్చాయి. దినకరన్ ముందు డబ్బులో అన్నాడీఎంకే, డీఎంకేలు పోటీ పడలేకపోతున్నాయనే టాక్ నడిచింది. ఎన్నో డక్కామొక్కీలు తిన్న అన్నాడీఎంకే, డీఎంకే ముఖ్య నేతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడనే విశ్లేషణలు వినిపించాయి.
దినకరన్ దెబ్బకు అన్నీ పార్టీలూ కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసే పరిస్థితి వచ్చింది. అలాగే ప్రధానంగా దినకరన్ అక్కడి అధికార పార్టీ అన్నాడీఎంకేకు ప్రాణాంతకంగా తయారయ్యాడు ఆ పరిస్థితుల్లో. దీంతో ఉప ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గరపడిన తరుణంలో.. ఆ ఉప ఎన్నిక రద్దు అయ్యింది. రేపోమాపో పోలింగ్ అనే పరిస్థితుల్లో.. ధనవ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికల విషయంలో నిబంధనలను పార్టీలు అతిక్రమిస్తున్నాయనే మిషతో నాడు ఎన్నికల కమిషన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది.
అయితే ఎవరు ఖర్చు పెట్టారో ఎన్నికల కమిషన్ చెప్పలేదు, ఎవరినీ మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించలేదు. జస్ట్ రేపోమాపో పోలింగ్ అనంగా ఎన్నికల ప్రక్రియను రద్దు చేసిందంతే. కట్ చేస్తే.. మునుగోడు బైపోల్ ఆర్కే నగర్ లెక్కలను మించి పోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు దినకరన్ భారీగా ఖర్చు పెట్టాడనే వార్తలు వస్తే.. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా లేకుండా వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందనే మాట వినిపిస్తోంది.
మరి ఎన్నికల కమిషన్ ఈ పరిణామాలను చూస్తోందా! లేక ప్రేక్షక పాత్ర వహిస్తోందా! అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అన్ని పార్టీలూ కలిపి మునుగోడులో కనీసం మూడు వందల కోట్ల రూపాయల పైనే ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. క్షేత్ర స్థాయి నుంచినే ఈ విశ్లేషణలు వస్తున్నాయి. మరి రద్దు చేస్తే ఆర్కే నగర్ తరహాలో మునుగోడు ఏమీ తీసిపోదని టాక్!