హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముహూర్తం ఉంటుంది. కచ్చితంగా ఆ ముహూర్తానికి పెళ్లి కావల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయమే. సంప్రదాయాలను పాటించేవారు ముహూర్తం విషయంలో పట్టుదలగా ఉంటారు. సరే…పెళ్లికి వెళ్లేవారిలో కొందరు ముహూర్తం సమయానికి వెళతారు. కొందరు ముహూర్తం అయిపోయాక వెళ్లి వధూవరులకు అక్షింతలు వేసి భోజనం చేసి వస్తారు.
అయితే ఒక యువకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరుతున్నాడు. తన పెళ్లికి ముహూర్తం గిహూర్తం జాన్తానై అంటున్నాడు. మరి ఆ యువకుడు ముహూర్తాలు నమ్మని నాస్తికుడా? అంటే అదేమీ కాదు. స్టేజీ మ్యారేజీ చేసుకుంటున్నాడా? అంటే అదేం కాదు. మరి అతని కోరిక ఏమిటంటారా? ‘సీఎం రేవంతన్న వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆయన వచ్చినప్పుడే పెళ్లికి ముహూర్తం’ అంటున్నాడు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మేకల తండాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడికి ఈమధ్య నిశ్చితార్థం అయింది. కాంగ్రెసు పార్టీ కార్యకర్త అయిన గణేశ్ రేవంత్ రెడ్డికి వీరాభిమాని. రేవంత్‌రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. సీఎంకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందించాడు.
ఆ వినతి పత్రంపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేశాడు. ఎమ్మెల్యే దాన్ని సీఎం ఆఫీస్‌కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా? అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
cinemalu choosi follow ayipothunnaru… edo cinemalo kcr ravali ani ilaane