టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఊహించని నేత నుంచి వ్యతిరేకత ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి అనూహ్యంగా రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడం సహజంగానే ఆ పార్టీలోని సీనియర్లకు మింగుడు పడడం లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూ వుంటాయి.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోవైపు మనుగోడు ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతను రేవంత్‌రెడ్డి చూసుకుంటారని రాజగోపాల్‌రెడ్డి అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కుట్ర జరుగుతోందని వెంకటరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి వైఖరిపై మర్రి శశిధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. కొంచెం పెద్దరికంతో శశిధర్‌రెడ్డి వ్యవహరిస్తుంటారు. అలాంటి నాయకుడు అకస్మాత్తుగా రేవంత్‌పై విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌రెడ్డే కారణమని ఘాటు ఆరోపణ చేశారు. గాంధీభవన్‌కు సమాంతరంగా మరో వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు.
టీపీసీసీ అధ్యక్ష పదవిని డబ్బు పెట్టి కొనుక్కున్నారనే ఆరోపణలతో ఏకీభవిస్తున్నట్టు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌పై దాసోజు శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శల్లో నిజం ఉందన్నారు. టీపీసీసీ వ్యవహారశైలితో విసిగిపోయానన్నారు. తమను హోంగార్డులతో పోల్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏజెంట్‌గా పని చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్లను అవమానించేలా ప్రవర్తిస్తున్న రేవంత్‌ను అధిష్టానం ఎందుకు మందలించలేదని మర్రి ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగాలేదన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో రోజురోజుకూ అంతర్గత కలహాలు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. రేవంత్‌రెడ్డి కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోతోంద న్నది నిజం. చివరికి సొంత పార్టీలో కుమ్ములాటలతోనే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉండరనే ప్రచారానికి తెరలేచింది.