ఏ ప్రభుత్వమైనా తెలిసి తెలిసి వ్యతిరేకత తెచ్చుకోదు. కానీ ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధం. విద్యాశాఖ ఉన్నతాధికారుల అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలు అంతిమంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తీరని రాజకీయ నష్టాన్ని కలిగిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఉపాధ్యాయ లోకం గరంగరంగా ఉంది. గోరుచుట్టుపై రోకటి పోటు అనే చందంగా అసలే వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయుల పాలిట జగన్ గోరుముద్ద రోకటి పోటులా తయారైంది.
జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో ఐదు కోడిగుడ్లు, మూడు చిక్కీలు అంద జేస్తున్నారు. వీటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారాన్ని సంబంధిత యాప్‌ల ద్వారా తెలియజేస్తూ వుండాలి. అయితే ఇటీవల కాలంలో పాఠశాలలకు సరైన సమయంలో ఏజెన్సీదారులు తగినన్ని కోడిగుడ్లు, చిక్కీలు అందజేయలేదు. దీంతో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ సమాచారాన్ని యాప్‌ల ద్వారా పంపలేదు.
సమాచారాన్ని పంపక పోవడానికి కారణాలేవో తెలుసుకోకుండానే రాయలసీమ జోన్ పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు (కడప ప్రధాన కార్యాలయం) రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 50 మంది ఎంఈవోలు, 1950 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు పంపారు.
ఆర్‌జేడీ వైఖరిని నిరసిస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. వానను సైతం లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ధర్నా నిర్వహించారు. సరఫరా ఏజన్సీల తప్పిదాలకు తమన బలి చేయడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ప్రభుత్వం బోధనేతర విషయాలకు ఉపాధ్యాయులను పరిమితం చేయడం ద్వారా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
హెచ్ఎంలు బోధన పర్యవేక్షణకు దూరమవుతున్నారని, సరైన సమయానికి స్కూల్‌కు సరుకులు సరఫరా చేయని ఏజెన్సీలతో ఇబ్బంది పడుతున్నామని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిళ్లకు గురి అవుతున్నారని ఎస్టీయూ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.