ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యనేత అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేశ్ తాజా ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేశ్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, మరోసారి అఖిలేశ్ యాదవ్‌కు అవకాశం లభించొచ్చనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్టే రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యేలు అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
ఇటీవల రైతులను కేంద్ర మంత్రి కుమారుడి వాహనం తొక్కించడం, దళిత యువతు లపై హత్యాచారాలు, తదితర ప్రజా వ్యతిరేక ఘటనలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో అధికార మార్పిడి తప్పదనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ పాలనపై వ్యతిరేకత అంతిమంగా అఖిలేశ్ యాదవ్‌కు కలిసి వస్తుందని, మళ్లీ ఆయనే సీఎం అవుతారని అనుకుంటున్న తరుణంలో సంచలన ప్రకటన రావడం గమనార్హం. మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న విషయాన్ని చెప్పారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మధ్య పొత్తు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆజమ్‌ఘర్ నుంచి ఎంపీగా అఖిలేశ్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.