తేనె కంటే తీయనైనది, వజ్రం కంటే దృఢమైంది ప్రేమ అంటే అతిశయోక్తి కాదు. ప్రేమకు మించిన మత్తు మరొకటి లేదు. ప్రేమ భావన అందమైన ఊహాజగత్తులో విహరింపజేస్తుంది. ప్రేమ లేని జీవితం ఉన్నా లేకున్నా ఒకటే. అసలు మనిషంటేనే ప్రేమ. మనిషంటే మనసు. మనసంటే మమత. మమతానురాగాలకు ఎల్లలు లేవు. ఎక్కడో బ్రిటన్ యువరాణి డయానా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైతే…ఆమెతో ఏ సంబంధం లేకపోయినా లోకం కన్నీరుమున్నరైంది. దీనికి కారణం మనసు. భాషలు, ప్రాంతాలు, దేశాలకు అతీతమైందే ప్రేమ. అలాంటి ఓ చక్కటి ప్రేమ జంట గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. కథకాని ప్రేమ కథ. సినిమాను తలపించే వాళ్ల ప్రేమ కథ కరోనా లాక్‌డౌన్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. దీనికి చక్కటి శీర్షిక పాఠకులే పెట్టాలి.
హర్యానాలోని రోహ్‌తక్‌లోని సూర్యకాలనీ నివాసి నిరంజన్ కశ్యప్. మెక్సికో అందాల బొమ్మ డానా జొహేరి ఆలివెరోస్ క్రూయిజీ. ఎక్కడ హర్యానా, ఎక్కడ మెక్సికో. తూర్పు,పడమర దిక్కుల్లో ఉన్న వాళ్లద్దరిని ఇంటర్‘నెట్’ లవ్‌లో పడేసింది. ఇంటర్‌నెట్ పుణ్యమా అని ప్రపంచమే కుగ్రామం కావడంతో దూరాలు చెదిరిపోయాయి. అందులోనూ మనసులకు దూరాలేం ఉంటాయి? మాతృభాషే కాకుండా ఇతర భాషలు నేర్చుకోవాలనే వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.
ఇది మూడేళ్ల క్రితం మాట. ఇద్దరూ ‘లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్’ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో వాళ్లిద్దరికి పరిచయం ఏర్పడింది. పనిలో పనిగా లిపిలేని ప్రేమ భాష నేర్వడం స్టార్ట్ చేశారు. అందమంతా ఒక్కచోట కుప్ప పోసినంత సౌందర్యరాశి మెక్సికో యువతి డానా జొహేరి ఆలివెరోస్ క్రూయిజీ. మనోడి అందం అంతంత మాత్రమే. అయితే నిరంజన్ మనసు ఆమెకు ఎంతో అందంగా కనిపించింది. అందువల్లే దేశం, భాష, భౌతికపరమైన అందచందాలేవీ వాళ్లిద్దరి ప్రేమకు అవరోధాలు కాలేదు.
ఒకవైపు యాప్‌లో తాము అనుకున్న భాషలేవో నేర్చుకుంటేనే…మరోవైపు వాళ్లిద్దరూ పరస్పరం అర్థం చేసుకున్నారు. జీవితాన్ని కలిసి పంచుకునే ప్రేమ భాషను పరిపుష్టి చేసుకునేందుకు ముందుకు సాగారు. తన ప్రియుడిని నేరుగా కలవాలని ఆమె కలలు కనింది. ఆ రోజు నిరంజన్ బర్త్‌డే రూపంలో మెక్సికో యువతికి కలిసి వచ్చింది. 2017లో భారత గడ్డపై మెక్సికో యువతి అడుగు పెట్టింది.
భవిష్యత్‌లో తన మెట్టినిల్లైన భారత్‌లో అడుగు పెట్టడం జొహేరికి ఓ మధురానుభూతి మిగిల్చింది. ఇండియా గడ్డపై అడుగు పెట్టిన క్షణంలో తన్మయత్వానికి గురైంది. తనకే తెలియని అలౌకిక ఆనందానికి లోనైంది. నేరుగా హర్యానాలోని నిరంజన్ ఇంటికి వెళ్లింది. తన ‘ఫ్రెండ్’ అని కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. కానీ ఆ మెక్సికో అమ్మాయిని చూడగానే తన కుమారుడికి తగిన జోడి అని నిరంజన్ తల్లి భావించింది. తనకు ‘కోడలైతే బాగుండు’ అని నిరంజన్ తల్లి ఆశించారు. అయితే మనసులో మాట బయట పెట్టలేదు.
కానీ జోహేరితో తన అన్న సాన్నిహిత్యాన్ని దగ్గరగా చూసిన తమ్ముడికి ఎక్కడో అనుమానం. నిరంజన్ తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వేర్వేరు దేశాలు కావడంతో వాళ్లిద్దరి ప్రేమ బంధాన్ని ఊహించలేకపోయాడు. కొన్నిరోజుల తర్వాత ఆమె తిరిగి తన మాతృదేశానికి వెళ్లిపోయింది. నిరంజన్, జొహేరి మధ్య మానసికంగా బంధం మరింత బలపడింది. మళ్లీ ఏడాదికి ఆమె ఇండియా వచ్చింది. ఈ దఫా మాత్రం తమ ప్రేమ సంగతిని కుటుంబ సభ్యుల వద్ద వారు దాచలేకపోయారు.
జోహేరి చేతులను అమ్మ చేతుల్లో పెడుతూ ‘నీ కోడలు’ అమ్మా అని పరిచయం చేశాడు. తల్లి ముఖం వెయ్యి ఓల్టుల బల్బు వలే వెలిగిపోయింది. కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత ఆమె మెక్సికో వెళ్లిపోయింది. ఈ సారి మాత్రం ఇండియాకు రావడానికి రెండేళ్లు కుదర్లేదు. మనోడు మాత్రం ఒక్కసారి కూడా జోహేరి దేశానికి వెళ్లలేదు.
అయితే తన కూతురు ఇష్టపడ్డ యువకుడిని చూడాలని జొహేరీ తల్లి తహతహలాడింది. దీంతో తల్లీకూతుళ్లు ఇండియా వచ్చారు. నేరుగా నిరంజన్ ఇంట్లోనే దిగారు. జొహేరీతో తల్లి ఓ అక్కలా ఉండటం నిరంజన్ తల్లిని ఆశ్చర్యపరించింది. పాశ్చాత్యులు ఇట్లే ఉంటారని ఆమె సరిపెట్టుకున్నారు. పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. భారతీయులు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే ఓ పెద్ద తతంగం ఉంది. ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954’ కింద ముప్పై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 17న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కి తమ పెళ్లికి సంబంధించిన విజ్ఞప్తిని పంపారు. మార్చి 18కి గడువు ముగిసింది. కానీ అప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేస్తుండటం, మన దేశంలో కూడా ఆ చాయలు కనిపించడం మొదలైంది. దీంతో నిరంజన్ నివాసం ఉంటున్న రోహ్‌తక్‌లో లాక్‌డౌన్ ఆనవాళ్లు కనిపించాయి.
పెళ్లయిపోయాక, మెక్సికో వెళ్లేందుకు బుక్‌చేసుకున్న టికెట్లు కూడా వృథా అయ్యాయి. ఆ ప్రయాణమూ ఆగిపోయింది. అయితే పెళ్లి ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. నిరంజన్, జొహేరీ కలిసి జిల్లా మేజిస్ట్రేట్‌ని కలిశారు. అయితే మనదేశంలోని మెక్సికన్ ఎంబసీ వీళ్లిద్దరి పెళ్లికి అంగీకరిస్తే తప్ప…ముందుకు అడుగు వేసే పరిస్థితి లేదు. అన్ని ఫార్మాలిటీస్ ముగిసే సరికి దాదాపు 25 రోజులు పట్టింది. ఎట్టకేలకు ఈ నెల 13న మూడుముళ్ల బంధంతో తమ ప్రేమకు సుఖమైన ముగింపు పలికారు. ఆ రోజు రోహ్‌తక్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో రాత్రి ఎనిమిది గంటలకు నిరంజన్, జొహేరీ దండలు మార్చుకున్నారు.
మే 3 వరకు ఈ కొత్త జంటకు రోహ్‌తకే హనీమూన్ సెంటర్. కొత్త జంట స్వర్గపు అంచులు ముద్దాడడానికి లాక్‌డౌన్ కాలం ఎంతో అనువైందని చెప్పొచ్చు. చక్కటి ప్రేమ కథ విన్నారు కదా! మరి వీళ్లిద్దరి ప్రేమ కథనానికి చక్కటి శీర్షిక పెట్టి…దంపతులిద్దరినీ ఆశీర్వదించరూ….