కిడ్నాప్ డ్రామాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఘట్కేసర్ బీఫార్మసీ విద్యార్థిని (19) జీవితం విషాదంతో ముగిసింది. కట్టు కథతో మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టించిన యువతిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ ఛీత్కారాన్ని భరించలేక, జీవితంపై విరక్తితో షుగర్ టాబ్లెట్స్ మింగి బుధవారం ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లింది.
ఈ నెల 10న సాయంత్రం 6.30కు బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన వార్త మీడియా ద్వారా వెలుగు చూసింది. ఓ ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి, ఘట్కేసర్ వైపు తీసుకెళ్తున్నాడంటూ బీఫార్మసీ యువతి డయల్-100కు ఫోన్ చేసింది. దిశ ఘటన పోలీసులను విమర్శలపాలు చేసిన నేపథ్యంలో , మరోసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని పోలీస్ యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి నుంచి ఫోన్ రాగానే కీసర, ఘట్కేసర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎట్టకేలకు పోలీసులు రెండు గంటల తర్వాత యువతి ఆచూకీని గుర్తించారు. తనపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి గురయ్యానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు బాధితురాలి చెప్పిన దానికి పొంతన లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో యువతిని గట్టిగా నిలదీయగా అసలు విషయాన్ని చెప్పింది.
తాను కట్టు కథ చెప్పినట్టు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇంట్లో తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని, ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉందని ఆ యువతి చెప్పింది. లాక్డౌన్ సమయంలో తన నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసి, దురుసుగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్‌ను కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో, అతనిపై అత్యాచార ఆరోపణలు చేసినట్టు చెప్పుకొచ్చింది. ఈ మేరకు అతని ఫొటోను ఇచ్చినట్లు చెప్పింది.
మొదట సామూహిక అత్యాచార ఆరోపణలు నమ్మిన మీడియా యువతి ఇచ్చిన ఫొటోల ఆధారంగా ఇష్టానుసారం కథనాలు నడిపాయి. వివిధ ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అత్యాచార ఘటన ఓ డ్రామా అని తెలియడంతో అందరూ ఖంగుతిన్నారు. దీంతో యువతిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. ఇక సమాజంలో తలెత్తుకుని తిరగలేనని భావించిన సదరు యువతి చివరికి బలవన్మరణానికి పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.