బీజేపీది కమలం గుర్తు. ఆ పార్టీ ఈ మధ్యనే ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాలను గెలుచుకుని ఫుల్ జోష్ మీద ఉంది. దేశానికే గుండె కాయ లాంటి యూపీని రెండవ సారి గెలిచి మంచి జోరు మీద ఉంది. అలాంటి బీజేపీ అధికార దీపం ఆర్పేయడం ఇప్పటికైతే అయ్యే పనేనా.
అయితే బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల జోలికి వస్తే ఆ పార్టీ అధికార దీపం ఆరిపోవడం ఖాయమని విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఘాటుగానే హెచ్చరిస్తోంది. దీపం పేరిట కేంద్రం ఒక పాలసీని పెట్టుకుని మరీ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని వారు మండిపడుతున్నారు.
తమకు వంద మంది దాకా ఎంపీల మద్దతు ఉందని కమిటీ ప్రతినిధులు చెప్పడం ఈ సందర్భంగా విశేషం. ఏపీలోని ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడా దండీగా ఉందని, వంద మందికి పైగా ఎంపీల సంతకాలతో త్వరలోనే ఢిల్లీ వెళ్ళి స్టీల్ ప్లాంట్ మీద పోరాడుతామని వారు అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఈ నెల 18తో 400 రోజులకు చేరుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా భారీ నిరసనతో పలు కార్యక్రమాలను చేపడతామని అంటున్నారు. ఈ నెల 28న విశాఖ బంద్ ని నిర్వహించిన మీదట జరిగే నిరసనలకు వేదికగా ఢిల్లీని చేసుకుంటామని చెబుతున్నారు.
ఏపీలో తమకు బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందని అంటున్నారు. మొత్తానికి స్టీల్ జోలికొస్తే బీజేపీ పవర్ ఆఫ్ అవుతుంది అని పరిరక్షణ కమిటీ ప్రతినిధులు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.