ఏడుపు దుర్బలులు బలహీనుల ఆయుధం. ధీరోధాత్తులు ఎవరూ అలా విలపించరు. మరి తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవమేంటి. ఇది చూసిన వారికి ఎలా ఉంది. ఆయన అసలు ఎందుకిలా చేశారు. దీని మీద ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంది.
చంద్రబాబు మీడియా ముందు ఏడవడం చూస్తే అసహ్యంగా ఉంది అంటూ ఘాటుగానే స్పందించారు ఏపీ అధికార భాషా సంఘం ప్రెసిడెంట్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అసలు ఆయనను అసెంబ్లీలో ఏమన్నారు. ఆయన్ని కానీ కుటుంబాన్ని కానీ ఎవరూ ఏమీ అనలేదు అంటూ యార్లగడ్డ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన చంద్రబాబు ఏడుపుగొట్టు రాజకీయాలు చేయడమేంటి అని కూడా నిలదీశారు. చంద్రబాబు మాత్రం తాను ముఖ్యమంత్రిగా ఉన్న సభలో ఎన్టీయార్ కి కనీసం మైకు కూడా ఇవ్వకుండా కన్నీరు తెప్పించారంటూ పాతికేళ్ల క్రితం నాటి ఘటనను గుర్తు చేశారు. నాడు సభలో స్పీకర్ గా యనమల రామక్రిష్ణుడు ఉన్నారని, తనకు మైకు ఇవ్వకపోవడంతో అపుడు ఎన్టీయార్ కన్నీటి పర్యంతం అయ్యారని చెప్పారు.
ఇక తెలుగుదేశం పార్టీ కేవలం పదమూడు జిల్లాలకే పరిమితం అయిందని, అటువంటి పాటీలో లోకేష్ ని జాతీయ కార్యదర్శి అని పేర్కోనడం కంటే విడ్డూరం వేరేదీ లేదని యార్లగడ్డ అన్నారు. మొత్తానికి టీడీపీని, చంద్రబాబుని, లోకేష్ ని కూడా యార్లగడ్డ వదలకుండా గట్టిగానే కామెంట్స్ చేశారు. పైగా బాబు ఏడుపు అసహ్యంగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మంట పుట్టించేలాగానే ఉన్నాయి.