రివ్యూ: లెజెండ్
రేటింగ్: 3/5
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం
తారాగణం: బాలకృష్ణ, జగపతిబాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్ తదితరులు
మాటలు: ఎం. రత్నం
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: కె. వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
నిర్మాతలు: అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట
కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: మార్చి 28, 2014
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘సింహా’ 2010 వేసవిలో సంచలనం సృష్టించింది. బాలయ్యని ఆరేళ్ల పాటు వేధించిన పరాజయాల్ని ఆ చిత్రం మరిపించింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి క్రేజ్, ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. మరి ఈ వేసవిలో వచ్చిన ఈ లెజెండ్ నాలుగేళ్లుగా బాలకృష్ణకి అందకుండా పోతున్న విజయాన్ని అందిస్తుందా? మళ్లీ బోయపాటి మాస్ మాయాజాలం పని చేస్తుందా?
కథేంటి?
జితేంద్రకి (జగపతిబాబు) ఒక ఊరిలో అవమానం జరుగుతుంది. దాంతో ఆ ఊరి మీద, ఆ ఊరి పెద్ద (సుమన్) కుటుంబం మీద పగబడతాడు జితేంద్ర. పగలు, ప్రతీకారాలు అంటూ కత్తి పట్టి తిరుగుతున్న మనవడిని తమకి దూరంగా పంపించేస్తుంది అతని బామ్మ. తన కుటుంబానికి దూరంగా పెరిగిన కృష్ణ (బాలకృష్ణ) తను ప్రేమించిన అమ్మాయితో (సోనాల్) కలిసి ఇంటికొస్తాడు. రావడం రావడంతోనే అతనికి జితేంద్ర కొడుకుతో గొడవ అవుతుంది. ఇక అక్కడ్నుంచి కృష్ణ, జితేంద్ర మధ్య టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో అనూహ్యమైన మలుపు.
కళాకారుల పనితీరు!
రౌద్ర రస పోషణలో బాలకృష్ణకి మించిన నటుడెవరున్నారు? బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, తన పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌కి, డైలాగ్ డెలవరీకి తగ్గ పాత్రని బోయపాటి శ్రీను సృష్టించాడు. ద్వితీయార్థంలో ప్రవేశించే పాత్రలో బాలకృష్ణ చెలరేగిపోయాడు. ఫాన్స్ ఉర్రూతలూగే సన్నివేశాలు, మాస్ వెర్రెత్తిపోయే సంభాషణలు బాగానే పడ్డాయి. కథనం బలహీనమైన ప్రతిసారీ బాలయ్య దీనికి బలమయ్యాడు. అయితే వయసు పైబడ్డ ఛాయల్ని యంగ్ క్యారెక్టర్‌తో కవర్ చేయలేకపోయాడు. లెజెండ్ పాత్రకి తగిన వేషధారణ, ఆంగీకం అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. జగపతిబాబు గెటప్‌కి వంక పెట్టలేం. హీరోగా కూడా ఇంత మంచి గెటప్ జగపతిబాబు ఎప్పుడూ వేయలేదు. గెటప్ పరంగా ఫుల్ మార్క్స్. అలాగే నటన కూడా బాగుంది. కాకపోతే క్యారెక్టరైజేషన్ పరంగా జరిగిన పొరపాట్ల వల్ల ఒక్కోసారి జగపతిబాబు పాత్ర తేలిపోయింది. హీరోయిన్లు ఇద్దరూ పెద్దగా చేయడానికేమీ లేదు. రాధికా ఆప్టే తట్టుకోలేనంతగా విసిగిస్తుంది. మరదలిని ‘అమ్మా’ అని సంబోధిస్తూ బాలకృష్ణ కూడా ఈ ట్రాక్‌లో ఇరిటేట్ చేస్తుంటాడు. బ్రహ్మానందం తెరపై నుంచి వెళ్లిపోతే ఆనందంగా అనిపించిన అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి.
సాంకేతిక వర్గం పనితీరు:
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సోసోగా ఉంది. పాటల్లో చెప్పుకోతగ్గవి ఏమీ లేవు. టైటిల్ సాంగ్ చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతంతో మాత్రం అక్కడక్కడా దేవిశ్రీప్రసాద్ తన ఉనికి చాటుకున్నాడు. ఎడిటింగ్ పరంగా లోపాలు దొర్లాయి. హెవీగా సాగే సినిమా కాబట్టి ఎడిటర్ మరింత స్ట్రిక్ట్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బానే ఉంది. బోయపాటి శ్రీను ఇంతకుముందు తీసిన సినిమాల మాదిరిగానే ఇది కూడా తెరకెక్కింది. బోయపాటి ఇంతవరకు తీసిన ప్రతి సినిమాలోను హీరోకి రెండు షేడ్స్ ఉంటాయి. అలాగే లెజెండ్‌లో కూడా తన ఫార్ములానే ఫాలో అయ్యాడు. కొన్ని సందర్భాల్లో ‘హీరోచితంగా’, కొన్ని సార్లు ‘హాస్యాస్పదంగా’ అనిపించేలా బోయపాటి దర్శకత్వ తీరు సాగింది. బాలకృష్ణని ‘సింహా’లో చాలా పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి శ్రీను మరోసారి అలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.
హైలైట్స్:
– లెజెండ్‌గా బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్
– విలన్‌గా జగపతిబాబు గెటప్
– సెకండాఫ్‌లో కొన్ని సీన్స్
డ్రాబ్యాక్స్:
– ఫస్టాఫ్
– బ్రహ్మానందం కామెడీ ట్రాక్
– ప్రీ క్లయిమాక్స్ సీక్వెన్స్
విశ్లేషణ:
‘లెజెండ్’కి పెద్ద ప్లస్ బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్. స్టోరీ పరంగా కొత్తదనం ఏమీ లేదు. కథనంలో ఎలాంటి ఆసక్తికర అంశాలు కనిపించవు. కానీ బాలకృష్ణ బలానికి తగ్గట్టుగా ‘లెజెండ్’ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడు బోయపాటి శ్రీను. తనకి సూట్ అయ్యే క్యారెక్టర్‌లో బాలకృష్ణ ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి, వీక్ సబ్జెక్ట్‌కి కూడా బూస్ట్ ఇస్తాడు. లెజెండ్ కథాపరంగా బలహీనంగా ఉన్నా, కథనంలో అనేక లోపాలు దొర్లినా కానీ ద్వితీయార్థంలో బాలకృష్ణ కొమ్ము కాసాడు.
ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ విలన్ పాత్రలో జగపతిబాబు. నిజానికి బాలకృష్ణ, జగపతిబాబుల కాంబినేషన్‌ని వాడుకుని… ఇద్దరికీ పోటాపోటీ పాత్రలు రాసుకుని ఉంటే ‘లెజెండ్’ స్వరూపమే మారిపోయి ఉండేది. కానీ సగటు తెలుగు సినిమా పద్ధతులకి తగ్గట్టు హీరోని బాగా బలవంతుడ్ని చేసి, విలన్‌ని వీలయినంత వీక్ చేసి పారేసారు. దీని వల్ల ఎక్కడా ఉత్కంఠ అనేది లేకుండా పోయింది. కేవలం హీరో ఎలివేషన్ సీన్స్‌తోనే బండి లాగించాల్సి వచ్చింది. అదే జగపతిబాబు పాత్రని బలంగా తీర్చిదిద్దినట్టయితే, చివరి వరకు బాలయ్యతో సమానంగా తలపడినట్టయితే సబ్జెక్ట్ వేల్యూ పెరిగి ఉండేది.
బాలకృష్ణ నటించిన అనేక హిట్ చిత్రాల్లోని ఫార్ములాని తీసుకుని తనకి తెలిసిన ‘టూ షేడ్స్’ ఫార్ములాతో మిక్స్ చేసి ‘లెజెండ్’ స్టోరీ రెడీ చేసాడు బోయపాటి శ్రీను. సినిమాలో ఎక్కడా హై పాయింట్స్ లేవు. ఫలానా సీన్ అద్దిరిపోయింది అనిపించే సందర్భం రాదు. ఏదో అలా అలా సాగిపోతూ ఉంటుంది. బాలకృష్ణ ట్రేడ్‌మార్క్ డైలాగ్ డెలివరీ, ఫాన్స్ ఇన్‌స్టంట్‌గా రిలేట్ అయ్యే డైలాగ్స్ జత కలవడంతో ఫాన్స్‌కి ‘లెజెండ్’ ఎక్స్‌ట్రా కిక్ ఇస్తుంది. అయితే ఫాన్స్‌కి, ఇలాంటి సినిమాలు ఇష్టపడే మాస్ ఆడియన్స్‌కి మినహా మిగతా వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలైతే ఇందులో పూర్తిగా మిస్ అయ్యాయి. చాలా కాలంగా పెద్ద సినిమాలు రాని టైమ్‌లో రిలీజ్ అయిన లెజెండ్ ఆ ‘కరువు’ని ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. బాలకృష్ణ నటించిన లెజెండరీ బ్లాక్‌బస్టర్ సినిమాలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి వాటితో పోల్చి చూస్తే నిరాశ తప్పదు. బాలకృష్ణ రీసెంట్ ఫ్లాప్స్‌తో పోల్చి చూస్తే ‘మచ్ బెటర్’ మూవీ అనుకోవచ్చు.
బోటమ్ లైన్: అభిమానులకి గ్రేట్ లెజెండ్… మిగతా వాళ్లకి చోటా సెలబ్రిటీ!
– జి.కె.