Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పూజ

సినిమా రివ్యూ: పూజ

రివ్యూ: పూజ
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
తారాగణం: విశాల్‌, శృతిహాసన్‌, ముఖేష్‌ తివారీ, సత్యరాజ్‌, రాధిక, సూరి, జయప్రకాష్‌, సితార, కౌసల్య, అభినయ తదితరులు
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
కూర్పు: వి.టి. విజయన్‌, టి.ఎస్‌. జై
ఛాయాగ్రహణం: ప్రియన్‌
నిర్మాత: విశాల్‌
కథ, కథనం, దర్శకత్వం: హరి
విడుదల తేదీ: అక్టోబర్‌ 22, 2014

సామి (లక్ష్మీనరసింహా), సింగం (యముడు), సింగం 2 (సింగం)... తదితర చిత్రాలతో మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న హరి మరోసారి ఫార్ములా సినిమాతో మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. గతంలో హరి డైరెక్షన్‌లో ‘తామిరభరణి’ (భరణి) చేసిన విశాల్‌ ఈసారి తనే నిర్మాతగా ‘పూజ’ చేసాడు. కమర్షియల్‌ డైరెక్టర్‌ ఆడియన్స్‌ నాడి పడితే హిట్‌ కొట్టడం కష్టమేం కాదు కానీ అదే అతను గాడి తప్పితే ప్రేక్షకుడి మాడు పగలడం ఖాయం. పూజ అందుకు ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోవడం తథ్యం. 

కథేంటి?

తన తల్లి (రాధిక) తనని అపార్ధం చేసుకోవడంతో ఇల్లు విడిచి వచ్చిన వాసు (విశాల్‌) వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఒక సందర్భంలో డిఎస్‌పిని (సత్యరాజ్‌) చంపడానికి సింగన్న (ముఖేష్‌ తివారి) వేసిన ప్లాన్‌ని వాసు భగ్నం చేసి డిఎస్‌పి ప్రాణం కాపాడతాడు. సింగన్న మనుషులు వాసు కోసం వెతుకుతూ ఉండగా... వాసు బాబాయ్‌కి సింగన్న చేతిలో అవమానం జరుగుతుంది. తన తల్లి నుంచి పిలుపు రావడంతో వాసు వెళ్లి సింగన్నని చావగొడతాడు. తాను వెతుకుతున్నది కూడా వాసు కోసమే అని తెలిసిన తర్వాత సింగన్న ఎలాగైనా వాసుని చంపాలని చూస్తాడు. ఇక ఇద్దరి మధ్య జరిగే పోరాటమే ‘పూజ’.  

కళాకారుల పనితీరు:

‘పందెంకోడి’ కథని తలపించే ఈ చిత్రంలో విశాల్‌ యాక్షన్‌ సీన్స్‌లో రాణించాడు. విశాల్‌ ఇంతకుముందే చాలా చిత్రాల్లో ఇలాంటి క్యారెక్టర్స్‌ చేసాడు. రొటీన్‌ అయిపోతున్నాడనే పేరుని పోగొట్టుకోవడానికి ఇలాంటి వేషాలు కట్టిపెట్టిన విశాల్‌ మళ్లీ ఇప్పుడెందుకు ఈ రూట్లోకి వచ్చాడనేది తనకే తెలియాలి. శృతిహాసన్‌ స్టాండర్డ్‌ కమర్షియల్‌ సినిమా హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసింది. నటించాల్సిన అవసరమే లేని పాత్రలో శృతి హ్యాపీగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఉనికి చాటుకుంది. 

సత్యరాజ్‌ పాత్రకి బిల్డప్‌ ఎక్కువ ఇచ్చారు కానీ ఏమాత్రం ఎఫెక్టివ్‌గా లేదు. రాధిక పాత్రని పూర్తిగా వృధా చేసారు. ముఖేష్‌ తివారి విలన్‌ పాత్రలో బాగున్నాడు కానీ అతడి క్యారెక్టర్‌ని కూడా సరిగా తీర్చి దిద్దలేదు. హీరో స్నేహితుడి పాత్రలో సూరి చేసిన కామెడీ అత్యంత శాంతమూర్తులకి కూడా కోపాన్ని రుచి చూపిస్తుంది. తెర నిండా ఆర్టిస్టులతో నింపేసారు. చిన్న చిన్న పాత్రలకి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు కానీ వారు చేయడానికంటూ ఏమీ లేకుండా పోయింది. 

సాంకేతిక వర్గం పనితీరు:    

ఈ సినిమాలో వీలయినన్ని ఇంటర్వెల్స్‌ ఇవ్వకపోతే చివరి వరకు తట్టుకోవడం ప్రేక్షకుల వల్ల కాదని అనుకున్నాడో ఏమో యువన్‌ శంకర్‌ రాజా తన పాటల్లో ఏదీ బాగోకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటర్‌ కూడా యువన్‌ శంకర్‌లా పెద్ద మనసు చేసుకుని ప్రేక్షకుల క్షేమం గురించి ఆలోచించి ఉండాల్సింది. విశాల్‌ మాత్రం హరిని నమ్మి బాగా ఖర్చు పెట్టేసాడు. 

డైరెక్టర్‌ హరి ఎలాంటి రొటీన్‌ పాయింట్‌ తీసుకున్నా కానీ పరుగులు పెట్టే కథనంతో మాస్‌ని ఉర్రూతలూగిస్తాడు. అలాంటిది ఈ చిత్రం విషయంలో ఏం చేయాలనేది తనకీ పాలుపోనట్టు ఉంది. ఏదొకటి చేసి మాస్‌ని మెప్పించడానికి నానా తంటాలు పడ్డాడు కానీ ఈసారి తనకి తెలిసిన కమర్షియల్‌ కనికట్టు చేయలేక ఖంగుతిన్నాడు. 

హైలైట్స్‌:

  • ఒకట్రెండు యాక్షన్‌ సీన్స్‌
  • శృతి గ్లామర్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లే
  • కామెడీ
  • డైరెక్షన్‌

విశ్లేషణ:

పాత్రల పరిచయానికే పుణ్య కాలం కాస్తా గడిచిపోతుందేమో అన్నట్టుగా... సినిమా స్టార్ట్‌ అయిన నుంచీ ఒక అరగంట పాటు కొత్త పాత్రలు పరిచయం అవుతూనే ఉంటాయి. వరుసపెట్టి అన్ని క్యారెక్టర్లు ఎలాంటి పర్పస్‌ లేకుండా ఇంట్రడ్యూస్‌ అవుతూ ఉంటేనే సినిమాలో మేటర్‌ ఉండదనే సంగతి తేలిపోతుంది. మొదటి నలభై అయిదు నిముషాల్లో సంబంధం లేని సన్నివేశాలతో, తలబాదుకునే కామెడీతో రంపపు కోతకి గురి చేస్తాడు హరి. 

హీరో నేపథ్యం, తల్లీకొడుకుల మధ్య సంఘర్షణ వగైరా అంశాలు కాస్తో కూస్తో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు ఒక పది నిముషాల పాటు పూజ ట్రాక్‌ ఎక్కేసినట్టు... హరి ఫామ్‌లోకి వచ్చేసినట్టు భ్రమ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్‌ దగ్గరే ముగిసిపోయిన సినిమాని మరో గంటన్నర పాటు సాగదీస్తే ఎలాగుంటుందో పూజ లైవ్‌ డెమో ఇస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌నే అటు తిప్పి, ఇటు తిప్పి... మళ్లీ మళ్లీ అదే రిపీట్‌ చేస్తూ టార్చర్‌కి గురి చేస్తాడు హరి. 

ఏ పూజ చేస్తే ఈ పూజ ఆగుతుందో... అప్పటికే నీరసంతో కూలబడిపోయిన జీవులు ‘హరీ’మనే లోపు హరి తన పూజ ఆపుతాడో లేదో తెలియక ఆ శ్రీహరిని తలుచుకుంటూ ప్రాణాలుగ్గబట్టుకు కూర్చోవాల్సి వస్తుంది. కథనాన్ని పరుగులు పెట్టిస్తాడనే పేరున్న హరి ఈసారి థియేటర్లోంచి ప్రేక్షకులని పరుగులు పెట్టించి... తాను కూడా వెరైటీ చేయగలనని చాటుకున్నాడు. 

తను తీస్తున్న సినిమాలో విషయం లేదని ముందే గ్రహించాడో ఏమో... ఎలాగైనా ఆసక్తి కలిగించడానికి హరి చేయని ప్రయత్నమంటూ లేదు. కొత్త పాత్రలని కథలోకి ప్రవేశపెట్టి... కొత్త లొకేషన్లకి షిఫ్ట్‌ చేసి... అదీ చాలదన్నట్టు హీరో తల్లి పాత్రని కూడా అకారణంగా చంపేసి... విఫలయత్నం చేసాడు. అదేదో కథ రాసుకునే టైమ్‌లోనే కష్టపడి ఉంటే అతనిన్ని రకాలుగా ప్రయాస పడాల్సిన పని తప్పేది. సినిమాలో ఏమున్నా లేకపోయినా అరడజను ఫైట్లుంటే శాటిస్‌ఫై అయిపోతామనే వారికి తప్ప ఈ నసని తట్టుకుని పాస్‌ మార్కులేసే పెద్ద మనసు ఎవరికీ ఉండదు. మొన్నీమధ్యే తమిళ రంగానికి చెందిన కమర్షియల్‌ డైరెక్టర్‌ లింగుసామి ‘సికిందర్‌’తో టార్చర్‌ పెడితే... తానేం తక్కువ తినలేదని హరి ‘పూజ’తో ప్రూవ్‌ చేసుకున్నాడు. 

బోటమ్‌ లైన్‌: ఈ ‘పూజ’ చే(చూ)స్తే దేవుడు కనిపిస్తాడు!!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?