Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అసుర

సినిమా రివ్యూ: అసుర

రివ్యూ: అసుర 
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కుషాల్‌ సినిమా, అరన్‌ మీడియా వర్క్స్‌
తారాగణం: నారా రోహిత్‌, రవివర్మ, ప్రియా బెనర్జీ, మధు, సత్య తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
ఛాయాగ్రహణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
నిర్మాతలు: శ్యామ్‌ దేవభక్తుని, కృష్ణ విజయ్‌
రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్‌
విడుదల తేదీ: జూన్‌ 5, 2015

‘బాణం’ దగ్గర్నుంచి సినిమాల ఎంపికలో నారా రోహిత్‌ బాణీ భిన్నంగా అనిపిస్తుంది. తన ప్రతి సినిమాలోను వైవిధ్యం అందించేందుకు అతను పడే తపన కనిపిస్తుంది. కాకపోతే తన అభిరుచికి ప్రశంసలు దక్కుతున్నా కానీ తన చిత్రాలకి ఆర్థిక పరంగా విజయాలు దక్కడం లేదు. కేవలం కమర్షియల్‌ విలువలు లేకపోవడం ఒక్కటే రోహిత్‌ సినిమాలకి సమస్య కావడం లేదు. తను ఎంచుకునే కథల్లో ఉండే బలం కథనంలో కొరవడడం వల్లే రోహిత్‌ నటించిన చిత్రాలు వాణిజ్య పరంగా సక్సెస్‌ అవలేకపోతున్నాయి. రోహిత్‌ ఎంచుకునే కథలకి ఎలాంటి ఎక్స్‌ట్రా టచప్స్‌ అవసరం లేదు. ఆ కథనే రసవత్తరంగా చెప్పినట్టయితే ఆ బడ్జెట్‌కి వర్కవుట్‌ అయిపోతుంది. మంచి కథని కదలనివ్వని కథనంతో చెప్పడంలోనే రోహిత్‌ చిత్రాల దర్శకులు విఫలమవుతున్నారు. ‘అసుర’ దర్శకుడు కృష్ణ విజయ్‌ కూడా ఒక ఆసక్తికరమైన కథా వస్తువుని ఎంచుకున్నాడు కానీ దానిని ఆసక్తికరమైన సినిమాగా మలచలేకపోయాడు. 

ఉరిశిక్ష పడ్డ ఖైదీ (రవివర్మ) జైలు నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటాడు. అతడిని ఉంచిన జైలు అధికారి (రోహిత్‌) ఆ శిక్ష అమలు అయి తీరేలా చేసేందుకు కృషి చేస్తుంటాడు. ఇదే ‘అసుర’ కథ. ‘తప్పు చేసినవాడికి శిక్ష తప్పనిసరి’ అని భావించే హీరో చిన్న తప్పులని కూడా క్షమించడు. ఇక ఉరిశిక్ష తప్పించుకోవాలని చూసేవాడిని ఎందుకు వదిలేస్తాడు? హీరో నుంచి విలన్‌ ఎలా తప్పించుకుంటాడా అనేది ఆసక్తికరమైన క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌. కథాపరంగా ఇంట్రెస్ట్‌ కలిగించడానికి ఇందులో సరిపడా సరుకు ఉంది. 

అయితే ఈ గేమ్‌ ఆసక్తికరంగా సాగితేనే ఇతరత్రా వినోదాలు ఏమీ లేని ఈ కథ రక్తి కడుతుంది. క్యారెక్టర్స్‌ని డెవలప్‌ చేసే విషయంలోనే పొరపాటు జరిగింది. విలన్‌ని పరిచయం చేసినపుడు అతను కరడుకట్టిన నేరస్తుడు అన్నట్టు చెప్తారు. చాలా తెలివైనవాడని, ఎంతటి దారుణానికైనా తెగిస్తాడని బిల్డప్‌ ఇస్తారు. కానీ అతను ఎక్కడా ఆ ‘నటోరియస్‌’ బుద్ధులు చూపించిన దాఖలాలు ఉండవు. అతను కనిపించినప్పుడల్లా అంతటోడు, ఇంతటోడు అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో విపరీతమైన బిల్డప్‌ ఇచ్చే సాంగ్‌ కూడా పెట్టారు కానీ అందుకు తగ్గ కర్కశత్వం కానరాదు. ‘నేను బ్రతుకుతాను.. చావను’ అంటూ డైలాగులు చెప్తాడే తప్ప దానికోసం యాక్టివ్‌గా ప్రయత్నం చేసేది మాత్రం ఉండదు. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకుంటానని చెప్తుంటాడే తప్ప ఎలా తప్పించుకోవాలనే దానిపై అతనికి కనీస ఐడియా కూడా ఉండదు. తను తప్పించుకోవడానికి ఒక మార్గం దొరికితే కనీసం అతనితో అయినా ఎస్కేప్‌ ప్లాన్‌ ఇదీ అంటూ చెప్పడు. ‘బయటకి వెళ్లి ఏదైనా చెయ్యి, నన్ను బయటకి తీసుకువెళ్లడానికి ప్లాన్‌ రెడీ అయితే గాలిపటాలు ఎగరేయ్‌’ అనడంలోనే అతనెంత వీక్‌ విలన్‌ అనేది బయట పడిపోతుంది. 

ఇక డిపార్ట్‌మెంట్‌లో ‘రాక్షసుడు’ అని పిలుచుకునే హీరోలోను అలాంటి రాక్షస లక్షణాలేం కనిపించవు. కేవలం మాటల్లో తప్ప చేతల్లో ‘అసుర’ గుణాలేం ఉండవు. విలన్‌ తెలివైనవాడైతే హీరో ఎలివేట్‌ అవుతాడు. ఎప్పుడైతే విలన్‌ని పాసివ్‌గా మార్చేసారో హీరోయిజం చూపించే ఛాన్స్‌ లేకుండా పోయింది. కథ మొత్తం ఒకే ఒక్క క్లయిమాక్స్‌ ట్విస్ట్‌పై బేస్‌ అయింది. ఆ ట్విస్టుని కూడా ఆడియన్స్‌ని కావాలని మోసం చేసిన సీన్‌పై బేస్‌ చేసుకున్నారే తప్ప కనీసం దానినైనా కన్విన్సింగ్‌గా తీయలేదు. కథాపరంగా విషయం ఉన్నా కానీ బిగి సడలని కథనం రాసుకోవడంలోనే విఫలం కావడంతో ‘అసుర’ ఒక మంచి ప్రయత్నమే అయింది తప్ప ఒక మంచి సినిమా కాలేకపోయింది.

ఈ జోనర్‌ సినిమాల్లో అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించాలి. నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందనే ఆసక్తి అలా అలా పెరుగుతూ పోయి చివరి దశకి వచ్చే సరికి పతాక స్థాయికి చేరిపోవాలి. అలా ఉత్కంఠ కలిగించడమే ఇలాంటి సినిమాలకి కమర్షియల్‌ ఎలిమెంట్‌ అవుతుంది. అదే ఇటువంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ అవడానికి ఫౌండేషన్‌ వేస్తుంది. డెస్పరేట్‌గా ఉన్న క్రిమినల్స్‌ ఎవరూ ఈ సినిమాలో చూపించినట్టుగా పేలవంగా ఆలోచించరు. అసలు ఎవరూ కూడా హీరోని ఛాలెంజ్‌ చేసే విధంగా ఒక్క పని కూడా చేయరు. ఈ కథకి, జైల్‌ బ్యాక్‌డ్రాప్‌కి, ఎస్కేప్‌ కాన్సెప్ట్‌కి ఆసక్తికరమైన మలుపులతో కూడిన కథనం తోడై ఉంటే, ఆద్యంతం ఉత్కంఠ పూరిత వాతావరణం సృష్టిస్తూ, ఊపిరాడనివ్వని విధంగా హీరో, విలన్‌ మధ్య తెలివైన గేమ్‌ నడిచి ఉంటే.. ‘అసుర’ ఇంకో రూపందాల్చి ఉండేది. చేయడానికి ఎంతో స్కోప్‌ ఉన్నా కేవలం అనుకున్న స్టోరీ లైన్‌కి అనుగుణంగా తోచిన సీన్లు అల్లుకుంటూ వెళ్లిపోయినట్టు ఉండడం వల్ల గుడ్‌ మూవీ అనిపించుకోవాల్సినది కాస్తా... ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చులే అనే స్థాయిలో ఆగిపోయింది.

రోహిత్‌ బాగానే చేసాడు కానీ టైప్‌ కాస్ట్‌ అవుతున్నాడు. తన క్యారెక్టర్ల ఎంపికలో సీరియస్‌ టోన్‌ తగ్గించుకుని నటుడిగా మరో కోణం చూపించే ప్రయత్నం చేయాలి. ప్రియా బెనర్జీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. రవి వర్మ పాత్రని సరిగా తీర్చి దిద్దకపోవడం వల్ల అతనికి టాలెంట్‌ చూపించే అవకాశమే దక్కలేదు. పాటల అవసరం లేకపోయినా ఇరికించడం వల్ల ఫ్లోకి అడ్డుపడ్డాయి. నేపథ్య సంగీతంపై వెంకటేష్‌ ‘ఘర్షణ’ ప్రభావం బాగా ఉంది. తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ టెక్నికల్‌గా అవుట్‌పుట్‌ బాగుంది. సినిమా నిడివి రెండు గంటలే ఉండడం అడ్వాంటేజే కానీ ఆ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో, ఉన్నంతలో కదలనివ్వకుండా కూర్చోబెట్టడంలో దర్శకుడి అనుభవ రాహిత్యం కనిపించింది. ముందుగా చెప్పినట్టు క్యారెక్టర్స్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కేర్‌ తీసుకుని టైట్‌ స్క్రీన్‌ప్లే రాసుకుని ఉన్నట్టయితే ఫలితం ఉండేది. ఎప్పుడూ అవే కామెడీ సినిమాలు చూసి విసిగిపోయి ఆ రొటీన్‌ సొద నుంచి కాస్త ఉపశమనం కావాలని అనుకునే వారికి ఇందులోని వైవిధ్యం ఒకింత తృప్తినివ్వవచ్చు. కాకపోతే ఒక మంచి సినిమా చూసిన సంతృప్తిని మాత్రం అసుర కలిగించలేకపోయింది. లిమిటెడ్‌ అప్పీల్‌ ఉన్న ఈ చిత్రం విజయతీరాలకి చేరుకోగలదో లేదో చూడాలి. 

బోటమ్‌ లైన్‌: రొటీన్‌కి భిన్నం.. కానీ కథనం బలహీనం!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?