Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బ్రూస్‌లీ

సినిమా రివ్యూ: బ్రూస్‌లీ

రివ్యూ: బ్రూస్‌లీ
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌
తారాగణం: రామ్‌ చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, క్రితి కర్బందా, అరుణ్‌ విజయ్‌, సంపత్‌ రాజ్‌, నదియా, బ్రహ్మానందం, పోసాని, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, అలీ, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, టిస్కా చోప్రా తదితరులు
కథ: కోన వెంకట్‌, గోపీ మోహన్‌
సంభాషణలు: కోన వెంకట్‌
సంగీతం: తమన్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
నిర్మాత: డి.వి.వి. దానయ్య
మూల కథ, కథనం, దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: అక్టోబర్‌ 16, 2015

చిరంజీవి చేసిన 'అతిథి పాత్ర'తో అప్పటికే అంచనాలు భారీగా ఉన్న 'బ్రూస్‌లీ'పై బజ్‌ మరింత పెరిగింది. మాస్‌ని మెప్పించే సినిమాలతో కమర్షియల్‌గా సేఫ్‌ బెట్‌ అనిపించేవి మాత్రమే చేస్తూ వస్తున్న చరణ్‌కి రొటీన్‌ అయిపోతున్నాడనే విమర్శలు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమేజ్‌ మేకోవర్‌ కోసం చూస్తున్న చరణ్‌ ఫ్యామిలీ కథలవైపు దృష్టి పెట్టాడు. 'గోవిందుడు అందరివాడేలే' అలాంటి డిఫెన్స్‌లో చేసిన సినిమానే. శ్రీను వైట్ల సినిమాలంటే ఎలాగో వినోదం, కుటుంబ నేపథ్యం ఉంటుంది కనుక చరణ్‌కి మేకోవర్‌ పరంగా ఇది రైట్‌ సినిమా అనిపించింది. అయితే 'ఢీ' నుంచి 'బాద్‌షా' వరకు దాదాపుగా అప్రతిహతంగా సాగిన శ్రీను వైట్ల హవాకి 'ఆగడు'తో బ్రేక్‌ పడింది. ఎప్పుడూ అదే టెంప్లేట్‌లో సినిమా తీస్తున్నాడనే విమర్శలు సక్సెస్‌ఫుల్‌ సినిమాలకి ప్రభావం చూపకపోయినా కానీ 'ఆగడు' ఫెయిల్యూర్‌తో శ్రీను వైట్ల కూడా డిఫెన్స్‌లో పడ్డాడు. 

అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరూ డిఫెన్స్‌లో ఉండి... రొటీన్‌ అనిపించుకోకూడదు అంటూ చేసిన ఈ ప్రయత్నం.. 'కొత్తగా' అనిపించడం మాట అటుంచి, వారిద్దరి సినిమాల్లో ఉండే బలాలు కూడా మిస్‌ అయి 'బోరింగ్‌'గా మిగిలింది. చరణ్‌ సినిమాల్లో ఉండే హీరో ఎలివేషన్లు కానీ, శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే కన్‌ఫ్యూజింగ్‌ కామెడీ కానీ లేక 'బ్రూస్‌లీ' ఒక పురాతన కాలం నాటి 'అక్కా తమ్ముళ్ల' సెంటిమెంట్‌ పునాదుల మీద రెండున్నర గంటల పాటు నిలబడ్డానికి ఆపసోపాలు పడింది. అక్కడికీ రామ్‌ చరణ్‌ శక్తి వంచన లేకుండా, ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డాడు. ప్రతి పాటలోను అద్భుతమైన డాన్సులతో స్క్రీన్‌ నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా మెరికలా కదిలాడు. ఇంతకుముందు ఎక్కువగా ట్రై చేయని కామెడీ కూడా అటెంప్ట్‌ చేసాడు. అతని స్టయిలింగ్‌నుంచి ప్రతి విషయంలోను పెట్టిన శ్రద్ధ బాగా కనిపించింది. కానీ చరణ్‌ ఎంత కష్టపడినా కానీ 'కథాబలం' లేదా 'వినోదం' ఏదోటి అతనికి దన్నుగా నిలబడాలి. దురదృష్టవశాత్తూ 'బ్రూస్‌లీ'లో ఆ రెండూ లేవు. 

లెక్కలేనంత మంది ఆర్టిస్టులతో, కళ్లు చెదిరే నిర్మాణ విలువలు, విజువల్స్‌తో బ్రూస్‌లీ కంటికింపుగా ఉన్నప్పటికీ రెండున్నర గంటల పాటు కదలకుండా కూర్చుని చూసే వినోదం లేకపోయింది. విచిత్రంగా శ్రీను వైట్లకి అతి పెద్ద బలమైన కామెడీ కూడా ఇందులో బ్యాక్‌సీట్‌ తీసుకుంది. తన 'టెంప్లేట్‌' ఛాయలు కనిపించరాదని అతను చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే ద్వితీయార్థంలో విలన్‌ అసలు రంగు బయటపెట్టడానికి చేసేదంతా అతని రెగ్యులర్‌ ఫార్ములానే అన్న సంగతి వారు బహుశా గుర్తించినట్టు లేరు. కామెడీతో ద్వితీయార్థాన్ని నడిపించడం శ్రీను వైట్ల స్టయిల్‌. కానీ ఇందులో చేసిన కామెడీ అతని 'విజయవంతమైన' సినిమాల్లోని కామెడీకి పేలవమైన అనుకరణలానే అనిపించింది తప్ప పేలలేదు. ఫస్ట్‌ హాఫ్‌లో మేటర్‌ తక్కువే అయినా కానీ అన్నీ మీటర్‌లో సాగిపోతూ ఉంటాయి. పాటలు, ఫైట్లు, తండ్రీ కొడుకుల మధ్య కామెడీ సన్నివేశాలు వగైరాతో ప్రథమార్ధం విపరీతంగా అలరించలేకపోయినా కానీ కాలక్షేపమైపోతుంది.

ద్వితీయార్ధానికి వచ్చేసరికి శ్రీను వైట్ల తన రెగ్యులర్‌ బాణీ నుంచి బయటపడాలని చూసాడు. కానీ చరణ్‌ 'డ్యూయల్‌ రోల్‌' అనే కన్‌ఫ్యూజన్‌ క్యారెక్టర్స్‌కి క్రియేట్‌ చేయడం, బ్రహ్మానందంతో ఆడించిన 'రియాలిటీ షో' తరహా డ్రామా మునుపటి శ్రీను వైట్ల సినిమాల్ని తలపుకి తెస్తాయి. అయితే ఈసారి క్యారెక్టర్లతో పాటుగా చూసే ప్రేక్షకులు కూడా 'మైండ్స్‌ ఆఫ్‌' చేసుకుని చూస్తే తప్ప ఎంజాయ్‌ చేయలేని విధంగా తయారైంది. ఇవివి సత్యనారాయణ సినిమాల్లో అంటే ఇలాంటి డబుల్‌ రోల్‌ కన్‌ఫ్యూజన్లు లాంటివి సెట్‌ అయిపోతాయి కానీ ఇలాంటి కమర్షియల్‌ సినిమాలో ఆ విధమైన 'ప్లే'కి ఎందుకు వెళ్లారనేది బోధపడదు. పూర్తిగా నీరసపడిపోయిన ద్వితీయార్ధానికి కాస్తో కూస్తో ఊరటనిచ్చేది చిరంజీవి చేసిన లాస్ట్‌ మినిట్‌ ఎంట్రీ. ఈ ఫైట్‌ని ఇరికించడం కోసం ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ని ఇంకా నాసి రకంగా తయారు చేసారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి తెరపై కనిపించడం, ఆయన మాగ్నిఫిసెంట్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఖచ్చితంగా అభిమానుల్ని అలరిస్తాయి కానీ ఈ ద్వితీయార్ధాన్ని 'భరించడానికి' కారణం అదొక్కటే అన్నట్టు అయింది. ఐరనీ ఏంటంటే.. ఒక సీన్‌లో కంటెంట్‌లేని సినిమాలో క్లయిమాక్స్‌లో హడావిడి ఎక్కువ ఉంటుందని ఒక సందర్భంలో జయప్రకాష్‌రెడ్డి సెటైరికల్‌గా అంటాడు. చివరకు బ్రూస్‌లీ చిత్రమే అలా తయారైంది!

హీరోనే కాదు చిరంజీవి ఫైట్‌ చేసినా 'వారెవ్వా' అన్నట్టు చూస్తుండిపోవడం మినహా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేయడానికేమీ లేదు. పాటల్లో మాత్రం తన గ్లామర్‌తో ఆకర్షణగా నిలిచింది. రావు రమేష్‌ తండ్రి పాత్రలో సహజంగా ఉన్నాడు. కానీ తండ్రీకొడుకుల మధ్య బిల్డ్‌ చేసిన డ్రామాకి తగ్గ పే ఆఫ్‌ ఇవ్వలేదు. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్‌ కూడా పాత సినిమాలని తలపిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండింగ్‌ సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. విలన్స్‌ ఇద్దరూ వీక్‌ అయిపోయారు. ఇంటర్వెల్‌ దగ్గరే విలన్స్‌ తేలిపోవడంతో ఇక మిగిలిన కథలో ఉత్కంఠకి తావులేదు. కనీసం సంపత్‌రాజ్‌ రియల్‌ ఐడెంటిటీ ఎక్స్‌పోజ్‌ చేసే విధానంతో అయినా వినోదం పండాలి, కానీ అదీ జరగలేదు. బ్రహ్మానందం ఎంటర్‌ అయినా ప్రయోజనం చేకూరలేదు. పోసాని, పృధ్వీ, వెన్నెల కిషోర్‌, అలీ.. ఇలా అందరూ సెకండ్‌ హాఫ్‌లోనే ఎంటర్‌ అయినా లాభం లేదు. ఏస్‌ రైటర్స్‌ కోన, గోపీ మోహన్‌ కూడా తమ మ్యాజిక్‌ చూపించలేదు. 

తమన్‌ పాటలు హుషారుగా ఉన్నాయి. వాటిని చరణ్‌ తన డాన్సులతో నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు. మనోజ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. వనరుల పరంగా ఎలాంటి లోటు లేదు. ఎడిటింగ్‌ మాత్రం బాగోలేదు. పాట నుంచి కట్‌ అయి యాక్షన్‌ సీన్‌కి, కామెడీ సీన్‌ నుంచి అబ్‌రప్ట్‌గా కట్‌ అయి మరో లొకేషన్‌కి షిఫ్ట్‌ అయిపోతూ.. అతుకుల బొంతలా అనిపిస్తుంది. శ్రీను వైట్ల ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు అతని సినిమాల్లో ఎంతటి వినోదం పండుతుందో తెలిసిందే. ఈ చిత్రంలో అతను గతంలో చేసిన మాదిరి అటెంప్ట్స్‌ అన్నీ చేసాడు కానీ కాన్ఫిడెంట్‌గా చేయకపోవడం వల్ల ఏదీ పండలేదు. 

ఈ చిత్రంలో చరణ్‌కి ఒక మేనరిజమ్‌ ఉంటుంది. ఎవరైనా ఏదైనా రాంగ్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తే 'ఎలాగెలాగ' అని వాళ్లు కరెక్ట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చే వరకు రిపీట్‌ చేస్తుంటాడు. శ్రీను వైట్ల కథ చెబుతున్నప్పుడు కూడా అదే పనిగా 'ఎలాగెలాగ' అంటూ పర్‌ఫెక్ట్‌గా స్క్రిప్ట్‌ రెడీ అయ్యే వరకు క్వశ్చన్‌ చేసుండాల్సింది. రొటీన్‌ సన్నివేశాలతో, అలరించలేని వినోదంతో 'బ్రూస్‌లీ' ఇక దసరా సెలవుల మీద, చిరంజీవి 'సౌజన్యం' మీద, చరణ్‌ స్టార్‌ పవర్‌ మీద డిపెండ్‌ అవ్వాల్సిందే. ఈ ఎక్స్‌టర్నల్‌ ఫ్యాక్టర్స్‌తో, ఇన్ని వీక్‌నెస్‌లతో బాక్సాఫీస్‌ దగ్గర ఈ ఫైటర్‌ ఎంత దూరం 'రన్‌' చేస్తాడనేది చూడాలిక. 

బోటమ్‌ లైన్‌: శ్రీను వైట్ల గూగ్లీ!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?