Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌

సినిమా రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌

రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: గురు ఫిలింస్‌, మల్టీ డైమెన్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
తారాగణం: నితిన్‌, యామీ గౌతమ్‌, అశుతోష్‌ రాణా, నాజర్‌, రవి ప్రకాష్‌, రాజేష్‌, హర్షవర్ధన్‌, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
సంగీతం: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌
నేపథ్య సంగీతం: సందీప్‌ చౌతా
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: సత్య పొన్‌మార్‌
సమర్పణ: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌
నిర్మాణం: గురు ఫిలింస్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ప్రేమ్‌సాయి
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 17, 2015

డెలివర్‌ కావడానికే మూడేళ్లకి పైగా సమయం తీసుకున్న ఈ 'కొరియర్‌'లో దురదృష్టవశాత్తూ ఆకర్షణీయమైన 'మేటర్‌' కూడా లేదు. నూట నాలుగు నిమిషాల నిడివి వున్న ఈ సినిమాని ఆద్యంతం బిగి సడలని థ్రిల్లింగ్‌ అంశాలతో నడిపించడం పోయి, ఉన్న ఆ కాస్త సమయాన్నే ఎలా గడపాలో తెలీనట్టు చాలా టైమ్‌ వృధా చేశారు. గంటా నలభై అయిదు నిమిషాల సేపు నడిచే సినిమాలో గంటన్నర సమయం వేస్ట్‌ అయిందంటేనే స్క్రీన్‌ప్లే ఎంత టైట్‌గా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 

ఫీటల్‌ స్టెమ్‌ సెల్స్‌ బేస్‌ చేసుకుని కొందరు దురాశాపరులైన మెడికల్‌ సైంటిస్టులు, డాక్టర్లు చేసే దుర్మార్గమనే ఆసక్తికర అంశాన్ని అయితే తీసుకున్నారు కానీ దానిని ఆకట్టుకునే సినిమాగా మలచలేకపోయారు. కొరియర్‌ బాయ్‌ చేతికి అసలు కొరియర్‌ అందే సమయానికే పుణ్య కాలం గడిచిపోతుంది. ఈలోగా ఏమాత్రం ఆకట్టుకోని ఒక లవ్‌స్టోరీతో, అవసరమే లేని సోకాల్డ్‌ కామెడీ సీన్స్‌తో టైమ్‌ వేస్ట్‌ అయింది. ఈ కథని రెండు గంటల లోపు నిడివిలో పూర్తి చేయాలని దర్శకుడు కరెక్ట్‌గా జడ్జ్‌ చేశాడు. అయితే ఆ టైమ్‌లో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వాలనేది విస్మరించాడు. 

కథ ఫస్ట్‌ ప్లాట్‌ పాయింట్‌ చేరుకునే సరికే ఇంటర్వెల్‌ వచ్చేస్తుంది. కనీసం ఆ తర్వాత అయినా సీరియస్‌నెస్‌ కనిపించదు. ప్రీ క్లయిమాక్స్‌కి ముందు కానీ కొరియర్‌ కళ్యాణ్‌ చేతికి రాదు. బైక్‌ ఛేజ్‌, యాక్షన్‌ సీన్స్‌తో చివరి పదిహేను నిమిషాల పాటు కాస్త ఉత్కంఠ కలిగిస్తుంది. సినిమా స్టార్ట్‌ టు ఎండ్‌ కాకపోయినా కనీ సం మొదటి అరగంట గడిచిన దగ్గర్నుంచి అయినా ఇదే మూడ్‌లో నడిచి వుంటే ఈ చిత్రం ఆసక్తి కలిగించి వుండేదేమో. ఏమాత్రం ఆకట్టుకోని ప్రేమకథపై టైమ్‌ వేస్ట్‌ చేయడంతో పాటు వరుసగా మూడు పాటలు పెట్టి ఫస్ట్‌ హాఫ్‌లో తీవ్రంగా విసిగించారు. 

సెకండ్‌ హాఫ్‌లో అయినా టోటల్‌గా కథ మీద ఫోకస్‌ పెట్టకుండా అవసరమే లేని కామెడీని ఇరికించి నస పెట్టారు. ఒక మంచి థ్రిల్లర్‌ కావడానికి అవసరమైన స్టఫ్‌ ఉన్నా కానీ ఇది బోరింగ్‌ బిజినెస్‌గా మారిందంటే దానికి దర్శకుడినే తప్పుపట్టాలి. అవసరమైన దానికి తక్కువ సమయాన్ని కేటాయించి, కథకి అసలు సంబంధం లేని అంశాలతోనే కాలయాపన చేయడం వల్ల రొటీన్‌కి భిన్నమైన ప్రయత్నమే అయినప్పటికీ 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' బాగా విసిగించింది. ద్వితీయార్థంలో కొరియర్‌ చుట్టూ నడిచే కాసింత డ్రామా మాత్రమే ఇందులో చెప్పుకోతగ్గ పాజిటివ్‌ పాయింట్‌. 

నితిన్‌ ఈజ్‌తో కూడిన నటనతో తన పాత్రని బాగానే పోషించాడు. తను రెగ్యులర్‌గా చేసే రొమాంటిక్‌ సినిమాలకి భిన్నమైన కథని ఎంచుకోవడం వరకు బాగానే వుంది. అయితే కథానుసారం కొన్ని త్యాగాలకి కూడా తాను సిద్ధ పడాల్సింది. పాటల్లేకుండా, కామెడీ పేరుతో సేఫ్‌ రూట్‌ వెతుక్కోకుండా స్టోరీకి స్టిక్‌ ఆన్‌ అయి వుంటే ఇది తనకో డిఫరెంట్‌ మూవీ అయి ఉండేది. యామీ గౌతమ్‌ చేయడానికంటూ ఏమీ లేదు. తనే కాదు ఈ చిత్రంలోని కీలక పాత్రధారులైన అశుతోష్‌రాణా, నాజర్‌ ఎవరికీ కూడా చెప్పుకోతగ్గ సన్నివేశాలు లేవు. బ్యాడ్‌ స్క్రీన్‌ప్లే కారణంగా ఆర్టిస్టులు మొత్తం చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వచ్చింది.

జోనర్‌ జస్టిఫికేషన్‌ చేయకుండా ఈ కథకి సూట్‌ కాని ట్రీట్‌మెంట్‌ని ఎంచుకోవడం వల్ల ప్రేమ్‌సాయి ఎటెంప్ట్‌ దండగైపోయింది. కొత్త ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ వాటిని జనరంజకంగా ప్రెజెంట్‌ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కార్తీక్‌, అనూప్‌ స్వరపరిచిన పాటల్లో చాలా వరకు అసలు అవసరమే లేదనిపించింది. ఆడియో పరంగా బాగానే ఉన్నా కానీ అన్ని పాటలకి స్కోప్‌ ఉన్న సినిమా కాదిది. సందీప్‌ చౌతా నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. సిట్యువేషన్‌తో సింక్‌ లేని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అసలే నాన్‌ సింక్‌లో వెళుతున్న సినిమాని మరింత నీరసపరిచింది. ఛాయాగ్రహణం ఫర్వాలేదు. నిర్మాణంలో జాప్యం జరిగినా క్వాలిటీ పరంగా రాజీ పడినట్టు అనిపించలేదు. 

రైటింగ్‌ టేబుల్‌ వద్దే దారి తప్పిన కొరియర్‌బాయ్‌ని కాపాడ్డానికి ఏ విధమైన ఎక్స్‌ట్రా ఆకర్షణలు జత కలవకపోవడంతో ఏ పాయింట్‌లోను రక్తి కట్టలేదు. పట్టుమని వంద నిమిషాలు లేని సినిమాతో కూడా బోర్‌ కొట్టించవచ్చని ప్రూవ్‌ చేసిన ఈ చిత్రం విడుదలకి ముందు కనబరిచిన ప్రామిస్‌లో కనీసం పదో వంతు కూడా నిలబెట్టుకోలేదు. తెలుగు ప్రేక్షకులకి వెరైటీ ఎక్స్‌పీరియన్స్‌ అందించే సదవకాశం ఉండి కూడా ప్రేమ్‌సాయి దానిని వినియోగించుకోలేదు.

బోటమ్‌ లైన్‌: డిఫెక్టివ్‌ ప్రోడక్ట్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?