అలాగే దైవాంశ గలవారి గురించి కథలు జానపదాలనే అనాలి. పురాణాల్లో దేవుడి కథను మార్చడం కష్టం కానీ వీళ్ల కథలను మనకు కావలసి వచ్చినట్టు మలచుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు – మాయా మచ్చీంద్ర, బాలసన్యాసమ్మ కథ, తిరుపతమ్మ కథ, మల్లమ్మకథ, వాసవీ కన్యకాపరమేశ్వరీ మహిమ, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, సిద్ది లింగేశ్వర మహిమ.. 'వేములవాడ భీమకవి' అనే సినిమా వుంది. బాలకృష్ణ భీమకవిగా వేశారు. అందులో రామారావు ఓ రాజు. భీమకవి వస్తే చూడ్డానికి నిరాకరిస్తాడు. అతను శాపం యిచ్చి వెళ్లిపోతాడు. దాంతో యితను రాజ్యభ్రష్టుడవుతాడు. కొన్నాళ్లకు భీమకవి వెళుతూంటే దార్లో యితను తగులుతాడు. 'నువ్వెవరు బాబూ?' అంటే 'భీమకవి చేత అన్యాయమై పోయినవాణ్ని' అంటాడు. అప్పుడు భీమకవికి జాలి పుట్టి 'నెల తిరక్కుండా పట్టం కట్టుకుంటావు ఫో' అంటాడు. ఇతనికి మళ్లీ రాజ్యం చేతికి వస్తుంది. ఈ సంఘటనకు మూలం జనపదంలో వున్న ఓ చాటువు. సినిమా తీసిన రామారావుగారు ఆ చాటువు ఆధారంగా రాజుగారి కథను ఓ జానపద కథగా అల్లుకు వచ్చారు. భీమకవి సినిమా ఆ మాత్రమైనా ఆడిందంటే దానికి కారణం – ఈ జానపదపు బిట్. 'లక్ష్మీ కటాక్షం' సినిమా మరీ జానపదం. మామూలు మసాలాలతో కథ నడిపించింది. చివరిలో లక్ష్మీదేవి చేత ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పించారు. డబ్బు అక్కరలేనిది ఎవరికి? సినిమా సూపర్ హిట్.
తర్వాత తర్వాత జానపదం అనకుండా ఓ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అందరూ మోడర్న్‌గా డ్రస్సు వేసుకుంటారు కానీ కథంతా జానపద ఫక్కీయే. భర్త నాస్తికుడవడం, భార్య పామునో, దేవినో నమ్ముకోవడం. మధ్యలో చేతబడి చేసే ఓ మాంత్రికుడు. భార్య భక్తి వల్లనే కష్టాలు గట్టెక్కుతాయి. చివర్లో భర్తగారు లెంపలేసుకోవడంతో కథ తెములుతుంది. ఈ తరహా కథలు టీవీ సీరియల్స్‌లో రాజ్యమేలుతున్నాయి. 'జగదేకవీరుని కథ' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా చూడండి. ఇంతటి వీరుడికీ పార్వతీదేవి అండగా నిలుస్తుంది. అప్పుడే అతగాడు కాలరెగరేస్తాడు.. పోనీ కిరీటం సర్దుకుంటాడు, జగదేకవీరుడవుతాడు. నలుగురిని పెళ్లాడతాడు. తెలుగు జానపదాలకు పార్వతీ పరమేశ్వరులు ఫేవరేట్స్. కొంప మునిగిపోతూంటే వాళ్లే క్లయిమాక్స్‌లో కాపాడతారు. అర్ధనారీశ్వరమూర్తి కాబట్టి కాళిదాసు చెప్పినట్టు వాక్కు, అర్థంలా కలిసి వుంటారు కాబట్టి ప్రేమికులను ఒకటి చేసే బాధ్యతను వారిపై పెట్టేశారు మన కథకులు. మన కథానాయకీ, నాయకులు ప్రేమమూర్తులు కాబట్టి వారిని ఆదుకునేది వాళ్లే!
ప్రేమికులకు అండ నిలిచేది వాళ్లయితే ప్రేమికులను అడ్డుకునేందుకు దేవలోకంలో ఆస్థాన విలన్ ఒకడున్నాడు! అదే – ఇంద్రుడు. పురాణాల ధర్మమాని అతని ఇమేజ్ పరమ ఘోరంగా వుంటుంది. అతను ఓ మదాంధుడు, పొగరుబోతు, అందమైన ఆడవాళ్లను వదలడు, ఋషులను తపోభంగం చేయనిదే వదలడు. ఋగ్వేద కాలంలో ఇంద్రుడు దేవాధిదేవుడు. అప్పట్లో శివుడు, విష్ణువు జాన్తానై. ఋక్కులు ఇంద్రుని కీర్తించినవే! తర్వాతి తర్వాతి కాలంలో ఇంద్రుడి ఇమేజి డామేజి అయిపోయింది. సినిమాల ప్రకారం చూస్తే అతను అందమైన ఆడవాళ్లను తన సభలో డాన్సు చేయమని నిర్బంధిస్తూ వుంటాడు. వాళ్లు మానవులతో ప్రేమలో పడితే శాపాలిచ్చేసి భూమికి తరిమేస్తూ వుంటాడు. భూమికి వచ్చినా వాళ్ల మానాన్న వాళ్లను వదలకుండా మారువేషాల్లో వచ్చి ఏడిపిస్తాడు. సినిమా రీలాంతం అయ్యేసరికి క్లయిమాక్స్‌లో శివుడు వచ్చి ఇంద్రుడికి చివాట్లు వేసి నాయికా నాయకులను కలుపుతాడు.
ఉదాహరణకు 'బాలరాజు' సినిమా కథ చెప్తాను వినండి – సినిమా మొదట్లో అంజలి హీరోయిన్. ఆమె దేవలోకంలో వుంటుంది. గురువుగారి కూతురు. ఆమె ఓ దిక్పాలకుడి కొడుకుతో ప్రేమలో పడింది. ఆమె తండ్రి మందలించాడు – స్వర్గంలో ప్రేమా, గీమా ఇంద్రుడు ఒప్పుకోడు, ఇంద్రసభలో డాన్సు చేయబోతే ఊరుకోడు' అని. ఆమె తండ్రిని ఎదిరించింది. అతనూ ఓ దిక్పాలకుణ్ని ఎదిరించాడు. 'ప్రేమంటే ఏమిటో తెలియనివాడిగా భూమిపై జన్మ ఎత్తు.' అని అతను శపించాడు. ఇంద్రసభలో అంజలి ఇంద్రుణ్ని దబాయించింది. 'నువ్వు గజ్జె కట్టి ఆడమంటే ఆడాలా? అంతగా కావాలంటే శచీదేవిని వచ్చి ఆడమను' అంది. 'నేను ప్రేమించినవాడి ఎదుట ఆడతాను కానీ నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడతానా?' అంది. ఇంద్రుడికి కోపం వచ్చింది. 'భూమిమీద పడిపో' అన్నాడు. నిక్షేపంలా పడతాను, ప్రేమ నిషిద్ధమైన ఈ లోకం కంటె ప్రేమకోసం తపించే ఆ లోకమే మెరుగు' అంది అంజలి. 'నీ ప్రేమ నిరర్ధకమవుతుందిలే, నీ ప్రియుడికి ప్రేమ అంటేనే తెలియకుండా పోతుంది.' అని శాపం యిచ్చాడు యింద్రుడు. అంజలిమీద దిక్పాలకులకు జాలి కలిగింది. ఆమె అమాయకురాలు తప్ప ఆమె చేసిన నేరం ఏమీ లేదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దేవేంద్రుడికి ఎదురు చెప్పలేరు కదా, ఊరుకున్నారు. అంజలి భూమి మీద ఓ పశువుల కాపరికిి దొరికింది. అతనికి పిల్లలు లేరు. కూతురిలా పెంచుకున్నాడు. ఆమె దొరికిన తర్వాత అతనికి సిరి యెత్తుకుంది. ఆమె అదృష్టవంతురాలని పేరు వచ్చాక అందరూ ఆమెను తమకిచ్చి పెళ్లి చేయమని అడగడం మొదలెట్టారు. ఈ బాధ భరించలేక, తన కూతుర్ని ఎవరికీ కట్టబెట్టడం యిష్టం లేక అతను ఓ ఒంటిస్తంభం మేడలో ఆమెను దాచి పెంచాడు. కాపలాగా యిద్దరు అమ్మాయిలు, ఒక పసుల కాపరి.
భూలోకంలో పడ్డాక ఆ పాత్ర అంజలి వేయలేదు. ఎస్.వరలక్ష్మి వేశారు. ఆమె ఒంటరి కన్యగా ఆ మేడలో వుంటూండగా ఓ రోజు ఓ వేణుగానం వింది. అది వాయిస్తున్నది స్వర్గంలో ఆమె ప్రియుడే. ఇప్పుడు భూమిపై నాగేశ్వరరావుగా పుట్టాడు. అతను పశువుల కాపరి. ప్రేమంటే తెలియని వెర్రి గొల్లడు. వెంట మరో మాలోకం – కస్తూరి శివరావు. ఈ వేణుగానం విని ఈ హీరోయిన్ మేడలోంచి బయటకు వచ్చేసింది. ఇతన్ని చూడగానే మోహంలో పడింది. ఇతని వెంటపడింది. అయితే యితనికి ప్రేమంటే తెలియదని శాపం వుంది కదా. 'నా వెంటెందుకు పడ్డావ్? ఛీ, ఛీ ఫో, ఫో' అని విదిలించుకుంటాడు. కానీ ఆమె వదిలిపెట్టదు. ఈమె దెయ్యం, కామినీ పిశాచం అని తీర్మానించాడు శివరావు. నాగేశ్వరరావు అదే నిజమనుకున్నాడు. నిజానికి వరలక్ష్మి ఇతను దాహం అంటే వరుణున్ని ప్రార్థించింది వర్షం పడింది. వీళ్లు ఓ సారి నిద్రపోతూండగా ఆమెను దొంగలు ఎత్తుకుపోయారు. ఆడి పాడి తప్పించుకుని పారిపోయింది. ఇతనికి అప్పుడు ఆమెపై అనురాగం కలిగింది. అయ్యో ఏమయిపోయిందో అనుకుని వెతకడం మొదలెట్టాడు. దారిఓ ఓ మునిని అడిగాడు. జవాబు చెప్పకపోతే అతన్ని అవమానించి పామై పోయాడు. అప్పుడు వరలక్ష్మికి ఓ దిక్పాలకుడు ఈ పామే నీ భర్తని చెప్పి శాపవిమోచనానికి తీర్థయాత్రలు చేయమన్నాడు. అలా తీర్థయాత్రలు చేశాక శాపవిమోచనమయ్యి పామురూపం పోయింది. ఇద్దరూ కలిసి కాపురం చేద్దామనుకున్నాక డబ్బు కావలసి వచ్చింది. వరలక్ష్మి నగ తీసుకుని పట్నంలోకి వెళితే ఆ శెట్టి మోసం చేసి దొంగ దొంగ అని అరిచాడు. జనాలు వచ్చి నాగేశ్వరరావును పొడిచారు. పాపం యితను చచ్చిపోయాడు.
అప్పుడు వరలక్ష్మి అతను దొంగ కాదని నిరూపించడానికి ప్రజల కోరికపై అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్ని ఇంద్రలోకానికి తీసుకుపోయాడు. అక్కడ ఆమె చెలికత్తెలు యీమెకు దండ యిచ్చి అది వేసుకుని వుంటే నీ భర్త సజీవుడుగా వుంటాడన్నారు. ఈమె భూలోకానికి వచ్చి అతనికి దండ తాకిస్తే అతను బతికాడు. ఇద్దరూ వెళ్లి గుడిలో పడుక్కున్నారు. ఇంద్రుడు మాయా వరలక్ష్మి వేషంలో వచ్చి ఎత్తుకుపోదామనుకున్నాడు. అసలైనామె దండ పడేస్తుంది. నాగేశ్వరరావు మూర్ఛపడ్డాడు.ఇక్కట్లు యిలా యిబ్బడి ముబ్బడి అయిపోయిన తరుణంలో శివుడు ప్రత్యక్షమై ఇంద్రుణ్ని మందలించాడు. కథ కంచికి. దీనివల్ల తేలేదేమిటంటే ప్రేమ అన్నా భక్తే! ఆ ప్రేమబలంతో దేవుళ్లను కూడా జయించవచ్చు అని తీర్మానించారు సినీపూజారులు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్.
ఇప్పుడు భక్తిప్రధానమైన సినిమాలకు మచ్చుగా 'సువర్ణసుందరి' సినిమా గురించి చెప్పుకుందాం. 'నవగ్రహ పూజామహిమ', 'వెంకటేశ్వర వ్రత మహిమ' వంటి డైరక్టు భక్తిప్రధానమైన సినిమాలను కాకుండా దీన్ని ఎంచుకోవడానికి కారణమేమిటంటే దీనిలో భక్తి ఒకటే కాదు, అనేక రసాలను యిమిడ్చారు. కథను రకరకాల మలుపులు తిప్పి, పీటముడి పడిపోయిన తర్వాత భక్తిరసంతో దాన్ని విప్పారు. ప్రజలకు విపరీతంగా నచ్చేసింది. తెలుగు, తమిళాల్లోనే కాదు, హిందీలో కూడా వీర ఆడేసింది. ముళ్లపూడి మాటల్లో చెప్పాలంటే బాక్సాఫీసు సూత్రాలకు పెద్ద బాలశిక్ష వంటిది ఈ సినిమా. ప్రేక్షకులకు కిక్ యిచ్చిన యీ కాక్‌టెయిల్‌ను డైరక్టరు వేదాంతం రాఘవయ్యగారు మళ్లీ రిపీట్ చేయలేకపోయారు. 'సువర్ణసుందరి' వంటి హిట్ యిస్తానంటూ దీని తర్వాత తీసిన 'స్వర్ణమంజరి'లోగానీ, ఆ తర్వాత చాన్నాళ్లకు తీసిన రహస్యంలో గానీ ఇంతటి విజయాన్ని చవిచూడలేదు. కారణం ఏమిటంటే వాటిల్లో భక్తిరసం లేదు. 'స్వర్ణమంజరి'లో హీరో నిస్సహాయుడవడు. ఎన్టీరామారావు కదా, చివరిలో కూడా గంటలమీదకి ఎక్కి యుద్ధం చేసేస్తుంటాడు. అలాగే 'రహస్యం'లో ఓ మాంత్రికుడి రహస్యమే సినిమాకి ఆయువుపట్టు. దేవుడు నరుడితో డైరక్టు డీలింగు పెట్టుకోలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)