Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మాయ

సినిమా రివ్యూ: మాయ

రివ్యూ: మాయ
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: షిరిడి సాయి కంబైన్స్‌
తారాగణం: అవంతిక, హర్షవర్ధన్‌ రాణే, సుష్మ రాజ్‌, నాగబాబు, ఝాన్సీ, వేణు, నందిని రాయ్‌ తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి
నిర్మాతలు: డా॥ ఎం.వి.కె. రెడ్డి, మధుర శ్రీధర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: నీలకంఠ
విడుదల తేదీ: ఆగస్ట్‌ 1, 2014

షో, మిస్సమ్మలాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నీలకంఠ ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమాలు తీయలేదు, ఆ స్థాయిలో ప్రశంసలు అందుకోలేదు. ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్‌ (సిక్స్‌త్‌ సెన్స్‌) కాన్సెప్ట్‌తో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన నీలకంఠ ఈసారి అయినా ఆనాటి ప్రతిభని తిరిగి ప్రదర్శించాడా లేక మరోసారి నిరాశ పరిచాడా?

కథేంటి?

మేఘనకి (అవంతిక) జరగబోయేది ముందే తెలిసిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు తన తల్లి చనిపోతుందనే సంగతి ఆమెకి ముందే తెలుస్తుంది కానీ దానిని ఆపలేకపోతుంది. ఆ తర్వాత చాలా ఏళ్లకి మళ్లీ ఆమెకి జరగబోయే విషయాలు తెలుస్తుంటాయి. ఈ క్రమంలో తాను ప్రేమించిన ఫ్యాషన్‌ డిజైనర్‌ సిద్ధార్థ్‌ (హర్ష) తన వుడ్‌బీ, మేఘన స్నేహితురాలు అయిన పూజని (సుష్మ) చంపుతాడని మేఘనకి విజన్‌లో కనిపిస్తుంది. దానిని ఆపడానికి ఆమె ఏం చేస్తుంది? అసలు సిద్ధార్థ్‌కి పూజని చంపాల్సిన అవసరం ఏంటి?

కళాకారుల పనితీరు:

హర్షవర్ధన్‌ రాణెకి అభినయానికి అవకాశమున్న పాత్ర లభించింది. సస్పెన్స్‌తో కూడిన తన పాత్రని అతను బాగానే రక్తి కట్టించాడు. కథ మొత్తం అవంతికపై నడుస్తుంది. కాస్త అనుభవం ఉన్న వారితో ఈ క్యారెక్టర్‌ చేయించి ఉండాల్సింది. కీలక సన్నివేశాల్లో బ్లాంక్‌ ఫేస్‌తో అవంతిక ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌గా మారింది. సుష్మా రాజ్‌ బబ్లీ క్యారెక్టర్‌లో రాణించడానికి అవసరానికి మించి నటించి ఇరిటేట్‌ చేస్తుంది. నాగబాబు ఉన్నంతలో బాగానే చేసాడు. ముగ్గురు హీరోయిన్లలో నందిని రాయ్‌ కాస్త బెటర్‌ అనిపిస్తుంది. కానీ ఆమెకి దక్కిన స్క్రీన్‌ టైమ్‌ మరీ తక్కువ. యాంకర్‌ రaాన్సీ సైకియాట్రిస్ట్‌ క్యారెక్టర్‌లో చాలా ఓవరాక్షన్‌ చేసింది. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి పాటల అవసరం లేదు. అయిదు పాటలున్నాయి కానీ ఒక్కటీ ఆకట్టుకోదు. శేఖర్‌ చంద్ర నేపథ్య సంగీత ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంభాషణల్లో పస లేదు. నీలకంఠ ఈ చిత్రాన్ని సరిగా హ్యాండిల్‌ చేయలేదు. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్‌గా పేరున్న ఆయన ఈ చిత్రానికి కట్టి పడేసే కథనం రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమాలో చాలా బోరింగ్‌ సీన్స్‌ ఉన్నాయి. పొటెన్షియల్‌ ఉన్న సబ్జెక్ట్‌ అయినా కానీ దానిని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం బాలేదు. అయితే ఫెయిల్యూర్స్‌లో ఉన్నా కానీ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్నందుకు ఆయనని అభినందించాలి. 

విశ్లేషణ:

‘ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్‌’ (ఈఎస్‌పి).. జరగబోయేది ముందే తెలిస్తే.. వినడానికి ఆసక్తి రేకెత్తించే ఈ పాయింట్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేపే ‘ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌’ థ్రిల్లర్‌ తెరకెక్కించవచ్చు. నీలకంఠ డైరెక్షన్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టయితే అలాగే తీసి ఉండేవాడేమో. స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డుని, ఆ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుని అందుకున్న ఆయన ఈ మధ్య కాలంలో నాసి రకం చిత్రాలు తీస్తున్నారు. వాటి కంటే ‘మాయ’ కాస్త బెటర్‌ అయినా కానీ అది కాన్సెప్ట్‌ వల్ల బెటర్‌గా అనిపిస్తుందే తప్ప సినిమాగా మాత్రం ఫెయిలైంది. 

కాన్సెప్ట్‌ కాంటెంపరరీగా ఉన్నా కానీ దానిని తొంభైల కాలం నాటి సినిమాలా తీర్చిదిద్దారు. సినిమా మొత్తమ్మీద కాస్త బాగున్న పార్ట్‌ ఏదైనా ఉంటే అది క్లయిమాక్స్‌ మాత్రమే. మిగతాదంతా ఎలా ఉన్నా కానీ చివర్లో ఇచ్చే సర్‌ప్రైజ్‌తో ఇది ‘మాయ’ చేసేస్తుందని అనుకున్నారో ఏమిటో... మిగిలినవాటిపై అసలు శ్రద్ధ పెట్టినట్టు అనిపించదు. ఇక ఆ క్లయిమాక్స్‌ మొత్తాన్ని ఒక ‘లూప్‌ హోల్‌’ మీద డిపెండ్‌ అయి రాసుకున్నారు. హీరోయిన్‌కి జరగబోయేది ముందే తెలుస్తుంది తప్ప ఎప్పుడో జరిగినవి కూడా తనకి కనిపిస్తుంటాయని ఎక్కడా చెప్పలేదు. రaాన్సీ క్యారెక్టర్‌తో ‘నువ్వు అక్కడ ఉండగా జరిగేవి మాత్రమే నీకు కనిపిస్తుంటాయి’ అని నొక్కి నొక్కి చెప్పినప్పుడు హీరో గతానికి చెందిన ఒక సంఘటన హీరోయిన్‌కి ఎందుకు కనిపిస్తుంది? కన్వీనియంట్‌గా దానికి సంబంధించిన డీటెయిల్స్‌ గురించి మాట్లాడకుండా స్కిప్‌ చేసారు.

అదొక్కటే కాదు... ఆల్రెడీ క్లోజ్‌ అయిన కేస్‌ని మళ్లీ రీ ఓపెన్‌ చేసిన పోలీస్‌ ‘ఆమెని మర్డర్‌ చేయడం ఒక్కటే మార్గం’ అని కూడా అంటాడు. అసలు ఆ కేసుని మళ్లీ ఎందుకు రీ ఓపెన్‌ చేస్తారు, వెనుక జరిగిందేంటి.. ఆమెపై పోలీసులకి కానీ, హర్షవర్ధన్‌కి కానీ డౌట్‌ ఎందుకు వచ్చింది లాంటి విషయాల్ని తెలియజేయడానికి కూడా దర్శకుడు ఇష్టపడలేదు. ఇదంతా కేవలం క్లయిమాక్స్‌ సీన్‌తో ‘సర్‌ప్రైజ్‌’ చేయడానికి చేసిన ఎటెంప్ట్‌ అనుకోవాలే తప్ప లాజిక్‌ గురించి ఆలోచించకూడదేమో. 

థ్రిల్‌ ఇచ్చే సీన్స్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేసి ఉన్నా, ఈ.ఎస్‌.పి గురించి మరి కాస్త డీటెయిల్స్‌లోకి వెళ్లినా, పాటలు లేకుండా టైట్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించి ఉన్నా, అవంతిక బదులుగా నటన తెలిసిన వారిని లీడ్‌ రోల్‌లో పెట్టుకున్నా... ఈ చిత్రం కనీసం టార్గెట్‌ ఆడియన్స్‌ని అయినా శాటిస్‌ఫై చేసి ఉండేది. 

బోటమ్‌ లైన్‌: బోరింగ్‌ థ్రిల్లర్‌.

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?