సినిమా రివ్యూ: నాన్నకు ప్రేమతో

రివ్యూ: నాన్నకు ప్రేమతో రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తారాగణం: ఎన్టీఆర్‌, జగపతిబాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, తాగుబోతు రమేష్‌, ఆశిష్‌ విద్యార్థి…

రివ్యూ: నాన్నకు ప్రేమతో
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: ఎన్టీఆర్‌, జగపతిబాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, తాగుబోతు రమేష్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: విజయ్‌ కె. చక్రవర్తి
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్‌
విడుదల తేదీ: జనవరి 13, 2016

సుకుమార్‌ కథలు చెప్పుకోవడానికి సింపుల్‌గానే అనిపిస్తాయి. కానీ తన మేథస్సుతో ఒక మామూలు కథకి అబ్బురపరిచే కథనం జోడిస్తాడు. అతని లెక్క సరిగా కుదిరినప్పుడు దాని ఎఫెక్ట్‌ కూడా అంతే అద్భుతంగా అనిపిస్తే, లెక్క తప్పినప్పుడు మాత్రం అర్థంకాని గందరగోళం నెలకొంటుంది. 'నాన్నకు ప్రేమతో' కథని ఒకటే లైన్‌లో చెప్పుకుంటే చాలా పాత కథలా ఉంటుంది. తండ్రిని (రాజేంద్రప్రసాద్‌) మోసం చేసిన వాడిపై (జగపతిబాబు) పగ తీర్చుకునే కొడుకు (ఎన్టీఆర్‌). 'నాన్నకు ప్రేమతో' ప్లాట్‌ ఇదే. ఆ తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉండగా కొడుక్కి తన బాధ గురించి చెప్తాడు? అతడిని మోసం చేసిన వాడు ఎలాంటి వాడు, ఏ స్థాయిలో ఉన్నాడు? పగ తీర్చుకోవడానికి వెళ్లిన కొడుకు ఎంత తెలివైనవాడు, పగ తీర్చుకోవడం కోసం తానేం చేస్తాడు? ఈ అంశాల చుట్టూ సుకుమార్‌ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. 

టైటిల్స్‌ వేయడం దగ్గర్నుంచే ఎప్పటిలానే తన ప్రత్యేకత చూపించడం స్టార్ట్‌ చేస్తాడు సుకుమార్‌. చెయిన్‌ రియాక్షన్‌ నేపథ్యంలోని టైటిల్‌ కార్డ్స్‌ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా వినోదాత్మకంగాను అనిపిస్తాయి. ఆ చెయిన్‌ రియాక్షన్‌ ఎందుకు చూపించాడనే దానికి చివర్లో కానీ ఆన్సర్‌ దొరకదు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే మొత్తం అలాంటి చెయిన్‌ రియాక్షన్‌ మీదే నడుస్తుంటుంది. ప్రతి సన్నివేశం మరో సన్నివేశానికి ముడి పడి ఉంటుంది. ఇప్పుడు ఎండ్‌ అయ్యే సీన్‌ నెక్స్‌ట్‌ సీన్‌ని డ్రైవ్‌ చేసే టూల్‌లా పనిచేస్తుంది. తెరపై చూస్తుంటే దాని గొప్పతనం పూర్తిగా తెలియకపోవచ్చు కానీ సుకుమార్‌ చాలా లోతుగా ఆలోచించి కథనం రాసుకున్నాడనేది ఆయా సన్నివేశాలని విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. 

'ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్‌ ఇంకెక్కడో జరిగే మూమెంట్‌ని డిసైడ్‌ చేస్తుంది. ఎవ్రీథింగ్‌ ఈజ్‌ ఇంటర్‌లింక్డ్‌' అంటూ హీరో క్యారెక్టర్‌ చాలా క్యాజువల్‌గా చెప్పే డైలాగ్‌కి తగ్గట్టే ఇందులోని సీన్స్‌ అన్నీ ఇంటర్‌లింక్‌ అయి ఉంటాయి. ఏదో హాఫ్‌ వేలో మొదలైనట్టు అనిపించే కథలో ఆరంభ సన్నివేశాలని కూడా అసలు కథలోకి ఇంటర్‌లింక్‌ చేసారు. పెద్దగా రిజిష్టర్‌ కాని/చేయని సన్నివేశాలకి కూడా స్క్రీన్‌ప్లే పరంగా ఇంపార్టెన్స్‌ ఉందని కాస్త లేట్‌గా తెలియజేస్తుంటారు. ఎందుకింత నానుస్తున్నారు అనిపించిన సన్నివేశాలకి కూడా మంచి పే ఆఫ్‌ ఇచ్చి ముగించడం చూస్తే ప్రతి సీన్‌కి వెనుక చాలా మేథోమధనం జరిగిందనే సంగతి స్పష్టమవుతుంది. ఉదాహరణకి ఎన్టీఆర్‌కి పాయిజన్‌ ఇచ్చే సీన్‌కి పే ఆఫ్‌గా రాజీవ్‌ కనకాల తన పిల్లాడి కోసం పాలు అడిగిన సందర్భంలో తన తండ్రి గొప్పతనం తెలుసుకోవడం, ఎన్టీఆర్‌ తన తండ్రిని దెబ్బ తీయడానికి ప్లాన్‌ చేసిన 'లీడ్‌'లో 'డి' తన డ్రీమ్‌ అని రకుల్‌ తెలుసుకునే పే ఆఫ్‌తో  ఆమె తన తల్లిని చేరుకోవడం వంటివి సుకుమార్‌ సెన్సిబులిటీస్‌కి అద్దం పడతాయి. 

అయితే హీరో తెలివితేటలు చూపించడానికని ప్రతి విషయంలోను దానిని హైలైట్‌ చేయడం, రొమాన్స్‌ ట్రాక్‌ మొత్తం ఫేక్‌ ఎమోషన్స్‌ చుట్టూ అల్లి, మళ్లీ దానినే కాసేపటికి నిజమైన ప్రేమ అన్నట్టు చూపించడం ఒకింత విసిగిస్తుంది. జగపతిబాబు, ఎన్టీఆర్‌ కాన్‌ఫ్రంటేషన్‌ సీన్‌తోనే సినిమా ఎక్సయిటింగ్‌గా మారుతుంది. అంతవరకు జరిగిన వాటిలో హీరో తెలివితేటల కంటే అతి తెలివి, దర్శకుడి కన్వీనియన్స్‌ డామినేట్‌ చేస్తాయి. ఇద్దరు తెలివైనవాళ్లు తలపడితే ఎలాగుంటుంది, ఎమోషన్స్‌ని విడిచిపెట్టి శత్రువుని డీల్‌ చేయడం ఒక గేమ్‌లా భావిస్తే ఆ పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుంది అన్నదానికి ఇంటర్వెల్‌ సీన్‌లో ఇచ్చిన శాంపిల్‌తో మున్ముందు జరగబోయే గేమ్‌పై ఆసక్తి మరింత పెరుగుతుంది. కానీ అందుకు తగ్గ రేంజ్‌లో సెకండ్‌ హాఫ్‌లోని మైండ్‌ గేమ్స్‌ లేవనే చెప్పాలి. ఎన్టీఆర్‌ ఏమి ప్లాన్‌ చేస్తున్నాడనేది తెలుసుకోవడం కోసం అతని ఆఫీస్‌లో మైక్రోచిప్‌ ప్లాంట్‌ చేయడం, అతని ప్లాన్స్‌ విని దానికి అనుగుణంగా నడుచుకోవడం, దానికి ఎన్టీఆర్‌ క్లయిమాక్స్‌లో రిటార్ట్‌ ఇవ్వడం 'ఇంటర్వెల్‌ సీన్‌'లోని కాన్‌ఫ్రంటేషన్‌కి తగ్గ కంటిన్యూషన్‌ సీన్లు కావనిపిస్తాయి. అన్నట్టు హీరో విషయాలు అన్నీ ఎప్పటికప్పుడు విని తెలుసుకోవడమనే పాయింట్‌ తమిళ చిత్రం 'థని ఒరువన్‌'నుంచి కాపీ చేసారు. ఆ కథకి చాలా కీలకమైన పాయింట్‌ ఇందులో వాడేసారు కనుక ఇక దాని రీమేక్‌లో ఎలాంటి మార్పులు చేసుకుంటారో మరి. 

ఎన్టీఆర్‌, జగపతిబాబు కాన్వర్‌జేషన్స్‌, వాళ్లిద్దరూ కలిసి కనిపించే సీన్స్‌లో ఉన్న ఇంటెన్సిటీ మిగతా సన్నివేశాల్లో లేకపోవడం మాత్రం పెద్ద డిజట్వాంటేజ్‌. తండ్రీ కొడుకుల సన్నివేశాల్లో ఎమోషన్స్‌ ఏమంత పండలేదు. రాజేంద్రప్రసాద్‌ గతం కాని, వర్తమానంలోని అతని నిస్సహాయ స్థితి కానీ అంతగా కదిలించవు. 'నాన్నకు ప్రేమతో' అన్నప్పుడు ఈ విషయాల మీద ఫోకస్‌ ఎక్కువ పెట్టి ఉండాల్సింది. రాజీవ్‌ కనకాలకి తండ్రి గొప్పతనం అర్థమయ్యే ఆ చిన్న మూమెంట్‌ తప్ప ఎమోషనల్‌గా కదిలించే సన్నివేశాలంటూ ఏమీ లేవు. బటర్‌ఫ్లయ్‌ ఎఫెక్ట్‌, చెయిన్‌ రియాక్షన్‌, ఎప్పటి ఎమోషన్‌ అప్పుడే తీర్చేసుకోవాలంటూ చెప్పే థియరీలాంటివి కమర్షియల్‌ స్క్రీన్‌ప్లేలో ఇమడవు. ఎడ్యుకేటెడ్‌ సెక్షన్‌కి సుకుమార్‌ స్కీమ్‌లు కొన్ని బాగా నచ్చుతాయేమో కానీ సినిమాని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావించే మాస్‌ ప్రేక్షకులు ఇలాంటి అంశాలతో కనెక్ట్‌ కాలేరు. '1 నేనొక్కడినే'లో ఉన్నట్టుగా నాన్‌ లీనియర్‌, లేయర్డ్‌ స్క్రీన్‌ప్లే లేకుండా, కన్‌ఫ్యూజ్‌ చేయని విధంగా లీనియర్‌ స్క్రీన్‌ప్లే అయితే రాసుకున్నాడు కానీ మరోసారి తన ఆలోచనలని తన సినిమా కమర్షియల్‌ రేంజ్‌కి అడ్డు పడకుండా చూసుకోవడంలో సుకుమార్‌ పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయాడు. సుకుమార్‌ కనబరిచే తెలివితేటలు, రొటీన్‌ సన్నివేశాలని కొత్తగా చూపించే తన మేథస్సు ఒక వర్గం ప్రేక్షకులని మెప్పిస్తుంది కానీ సినిమా ఫలితాన్ని శాసించే మెజారిటీ ప్రేక్షకులు ఇన్ని తెలివితేటల్ని హర్షించలేరు. ఎన్టీఆర్‌ని ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా చూపించడంలో మాత్రం సుకుమార్‌ పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. కేవలం ఆహార్యంలోనే కాదు, ఎన్టీఆర్‌ నటనలో కూడా చాలా డిఫరెన్స్‌ కనిపిస్తుంది. అతను ఇంత అండర్‌ ప్లే చేసిన క్యారెక్టరే లేదింతవరకు. 

ఎన్టీఆర్‌ తన పాత్రకి పూర్తి న్యాయం చేయడంతో పాటు దర్శకుడిని బ్లైండ్‌గా నమ్మేసాడు. అతను ఏం అడిగితే దానికి రిజల్ట్‌ లేదా రియాక్షన్స్‌ గురించి ఆలోచించకుండా 'ఫాలో' అయిపోయాడు. ఎక్కడా ఒక్క నోట్‌ కూడా పైకి వెళ్లని పర్‌ఫార్మెన్స్‌తో సరికొత్త ఎన్టీఆర్‌ కనిపిస్తాడు. కొత్త లుక్‌తో, కొత్త స్టయిలింగ్‌తో ఎన్టీఆర్‌లో ఇంతవరకు మనకి తెలియని సైడ్‌ చూపిస్తాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాగానే చేసింది. తన పాత్ర తెలివైనదో లేక అమాయకురాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌ ఉన్నా కానీ రకుల్‌ తన వంతుగా చేయాల్సింది చేసింది. సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది. 'లెజెండ్‌'లో పక్కా మాస్‌ విలన్‌గా కనిపించిన జగపతిబాబు ఇందులో క్లాస్‌ విలనీ చాలా బాగా పండించాడు. అతనికి రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఎన్టీఆర్‌, జగపతిబాబు కనిపించే సీన్లు వీళ్లిద్దరిపై మరిన్ని సీన్స్‌ ఉంటే బాగుంటుందనే స్థాయిలో మెప్పిస్తాయి. రాజేంద్రప్రసాద్‌ పాత్ర చుట్టూ కథ నడుస్తుంది కానీ ఆయనకి ఎక్కువ సీన్స్‌ లేవు. రాజీవ్‌ కనకాల ఎప్పటిలానే వంక పెట్టలేని నటనతో ఆకట్టుకున్నాడు. 

పాటలు వినడానికి బాగున్నా, చిత్రీకరణ కూడా బాగా కుదిరినా కానీ పలు సందర్భాల్లో కథాగమనానికి అడ్డు పడ్డాయి. రొమాన్స్‌ ట్రాక్‌లో డెప్త్‌, ఎమోషన్‌ లేకపోవడం వల్లేనేమో సందర్భోచితంగా వచ్చిన పాటలు కూడా స్పీడ్‌ బ్రేకర్స్‌లా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో చాలా బాగుంది. కానీ ఓవరాల్‌గా కన్సిస్టెన్సీ మిస్‌ అయింది. విజయ్‌ చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ఎస్సెట్‌. నిడివి బాగా ఎక్కువైన ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌ లెంగ్త్‌ మరీ ఎక్కువైంది. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. విజువల్‌గా బ్రహ్మాండంగా ఉంది. సోకాల్డ్‌ టైమ్‌పాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాకుండా సినిమాల్లో ఇంటిల్లిజెన్స్‌ ఉండడం ఇష్టపడే వాళ్లకి 'నాన్నకు ప్రేమతో'లో కొన్ని అంశాలు నచ్చేస్తాయి. సినిమా అంటే మెదడుకి మేత పెట్టడం కాదు… అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే వినోదం ఉండాలనే వారు పెదవి విరుస్తారు. తెలివితేటలతో ఆకట్టుకున్నా భావోద్వేగాల పరంగా సుకుమార్‌ కదిలించలేకపోయాడు. ఫెస్టివల్‌ మూడ్‌కి కంప్లీట్‌ కాంట్రాస్ట్‌గా ఉన్న కంటెంట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ని ఎంతవరకు నెగ్గుకువస్తుందో చూడాలి. అసలే ఈ పండక్కి దీనికి మూడు సినిమాలతో పోటీ కూడా ఉంది.

బోటమ్‌ లైన్‌: సుక్కు మార్కుతో!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri