Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రుద్రమదేవి

సినిమా రివ్యూ: రుద్రమదేవి

రివ్యూ: రుద్రమదేవి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: గుణా టీమ్‌ వర్క్స్‌
తారాగణం: అనుష్క, అల్లు అర్జున్‌, రాణా దగ్గుబాటి, ప్రకాష్‌రాజ్‌, కృష్ణంరాజు, సుమన్‌, ఆదిత్య మీనన్‌, నిత్యామీనన్‌, కేథరీన్‌, హంసానందిని, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్‌
సంగీతం: ఇళయరాజా
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌
కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 9, 2015

'రుద్రమదేవి' కథని తెరకెక్కించాలనే కలతో గుణశేఖర్‌ చాలా త్యాగం చేసాడు. ఆమె కథ గురించి, కాకతీయ సామ్రాజ్యం గురించి మనకి తెలియని చాలా విషయాల గురించి ఎన్నో ఏళ్ల పాటు శోధించాడు. భారీ పెట్టుబడి అవసరమైన ఈ సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోతే తానే తన కలని వెండితెరపై ఆవిష్కరించడానికి నడుం కట్టాడు. నిర్మాణంలో ఆటుపోట్లని అధిగమించి, ఆర్థిక ఇబ్బందులని అన్నిటినీ దాటుకుని, సాంకేతిక పరమైన ఆలస్యాలని తట్టుకుని ఎట్టకేలకు గుణశేఖర్‌ కన్న స్వప్నం మన ముందుకొచ్చింది. మరి అంత కష్టానికీ తగ్గ విధంగా రుద్రమదేవి తెరకెక్కిందా? ఇలాంటి సినిమా కోసం ఇంత కష్టపడ్డంలో తప్పులేదనేట్టుగా మెప్పించిందా? 

ఎన్నో ఏళ్లు కన్న కలల్ని, కొన్నేళ్లు పడ్డ కష్టాలని తేలికగా ఒక్క మాటలో 'బాగోలేదు' అనడానికి మనసు రాదు. కాబట్టి అలరించని కల, ఇష్టపడలేని కష్టం అనేసుకుందాం! నిక్కచ్చిగా చెప్పేందుకు మనస్కరించడం లేదు కానీ నిజమదే. రుద్రమదేవి సినిమా కోసం పడిన కష్టంలో అబద్ధం లేదు, ఈ చిత్రం కోసం చేసిన శ్రమలో రాజీ లేదు. కాకపోతే దానిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో మాత్రం గుణశేఖర్‌ విఫలమయ్యాడు. రుద్రమదేవి అనగానే గుర్తుకొచ్చే ఆమె ధీరోదాత్తత, బుద్ధి కుశలత గురించిన ప్రస్తావనలే తప్ప ఆమె వీరత్వాన్ని ఎలివేట్‌ చేసే అంశాలపై దృష్టి పెట్టలేదు. ఆడపిల్ల అయితే రాజ్యాధికారం ఇవ్వరని, శత్రువులు పేట్రేగిపోతారని భయపడి రుద్రమదేవిని మగవాడిగా పరిచయం చేసి అలానే పెంచుతారు. ఈ అంశాన్ని చూచాయగా చెప్పి వదిలేస్తే పోయే దానికి ఇదే పాయింట్‌పై మొత్తం సినిమాని నడిపించారు. ఆమె జన్మ రహస్యం బయటపడ్డమే ఈ చిత్రంలోని 'టర్నింగ్‌ పాయింట్‌'. ఒక్కసారి ఆ విషయం బహిర్గతమయ్యాక ఇక సినిమా పతాక సన్నివేశాల దిశగా వెళ్లిపోతుంది. 

మదపుటేనుగుని లొంగదీయడం, ఓసారి గుంపుగా వచ్చిన సైనికులని మట్టుబెట్టడం, పన్నులు రద్దు చేయడం, చెరువులు కట్టించడం, ఏడు కోటల నిర్మాణానికి ఆదేశించడం.. మినహా రుద్రమదేవి 'పాలనా దక్షత' గురించిన గొప్ప విషయాల గురించి ఎక్కువ ఫోకస్‌ లేదు. ఎంత సేపు ఆమె తాను స్త్రీననే విషయాన్ని లోలోపలే దాచుకుని రాజ్యం కోసం కవచాల భారాన్ని మోస్తోందని, ప్రేమించిన వాడిని సైతం దూరం పెడుతూ తన ప్రజల కోసమే ఆలోచిస్తోందని చెప్పడమే ఈ చిత్రం ప్రధానోద్దేశం అన్నట్టుగా రూపొందింది. రుద్రమదేవి చరిత్రని తెలుసుకుందామని, ఆమె వీరగాధలు వీక్షిద్దామని వచ్చిన వారికి గుణశేఖర్‌ చూపించిన చిత్రంలో వాటికున్న ప్రాధాన్యం చూసి నిరాశ తప్పదు. అసలు ఆ 'జెండర్‌ ఐడెంటిటీ' గురించిన అంశాన్ని ఎందుకని అంతగా హైలైట్‌ చేసారనేది అర్థం కాదు. పోనీ చివర్లో అయినా రుద్రమ వీరోచిత విన్యాసాలు చూసే అవకాశం కల్పించారా అంటే అదీ లేదు. 

రుద్రమదేవి (అనుష్క) కంటే గోనగన్నారెడ్డి (అల్లు అర్జున్‌) పాత్ర ఆకర్షణీయంగా ఉందంటే, గోనగన్నారెడ్డి తెరపై కనిపించినప్పుడు మాత్రమే చూసే వారికి కాస్తయినా ఆసక్తి కలిగిందంటే... ఇక 'రుద్రమదేవి' గాధని తెరకెక్కించడంలో దర్శకుడు ఎలా సక్సెస్‌ అయినట్టు? గోన గన్నారెడ్డి పాత్రకైనా ఆ సంభాషణలు, అల్లు అర్జున్‌ 'డోంట్‌ కేర్‌' ఆటిట్యూడ్‌ వల్ల ఆ ఆకర్షణ వచ్చింది కానీ ఆ పాత్రకి కూడా సరైన క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లేదు. ఆ మాటకొస్తే అసలు విషయాలని పక్కనపెట్టి అవసరం లేని వాటి మీదే టైమ్‌ వేస్ట్‌ చేసారనిపిస్తుంది. దాంతో రుద్రమదేవి చూస్తున్నంతసేపు వినోదం కంటే విసుగే డామినేట్‌ చేస్తుంటుంది. సగటు సినిమాల మధ్య చాలా ప్రత్యేకమైన, అరుదైన ఇలాంటి చిత్రం ప్రేక్షకులని చరిత్ర పాఠాలతో, అద్భుతమైన భావోద్వేగాలతో కట్టి పడేయాలి. దాదాపుగా సగం సినిమాలో ఏం జరుగుతుందో కూడా పట్టనంత నిస్సారంగా, నీరసంగా సాగిపోయే ఈ చిత్రంలో అలరించిన అంశాలు చాలా అరుదు. అలరించిన ఆ కొన్నిటిలో అన్నీ గోనగన్నారెడ్డి ఖాతాలోకే పోతాయి. 

బాహుబలి చిత్రం స్థాయి వనరులు లేవు కనుక ఆ స్థాయి విజువల్స్‌ ఆశించడం తప్పు కానీ.. టీవీ సీరియల్స్‌లో కూడా గ్రాఫిక్స్‌ చాలా కామన్‌ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ స్కేల్‌లో సినిమా తీసినప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనీస స్థాయిలో ఉంటాయని అనుకోవడం తప్పు కాదు. కానీ రుద్రమదేవి చిత్రంలోని గ్రాఫిక్స్‌లో చాలా భాగం ఎలిమెంటరీ లెవల్‌ అనిపిస్తాయి. ఒకటీ అరా షాట్స్‌ తప్పించి గ్రాఫిక్స్‌ పరంగా ఈ చిత్రం బాగా నిరాశ పరుస్తుంది. అమ్మోరు, అంజి టైమ్‌లోనే బెస్ట్‌ గ్రాఫిక్స్‌ చూసిన తెలుగు ప్రేక్షకులు ఇందులోని అవుట్‌పుట్‌కి ఖచ్చితంగా డిజప్పాయింట్‌ అవుతారు. గ్రాఫిక్స్‌ని ఓవర్‌లుక్‌ చేసినా కథాపరంగా అద్భుతమైన మెటీరియల్‌ ఉన్న చిత్రానికి రాసుకున్న కథనం అతి పెద్ద లోపంగా మారింది. ఇక డీటెయిలింగ్‌, కంటిన్యుటీ పరమైన ఇబ్బందులైతే కోకొల్లలు. 

అనుష్క తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. అల్లు అర్జున్‌ అయితే కనిపించిన కాసేపు సినిమాకి ఊపిరి పోసాడు. రాణా చేయగలిగింది చేసాడు. మిగిలిన పాత్రధారుల్లో ప్రకాష్‌రాజ్‌ ఒక్కడికే చెప్పుకోతగ్గ పాత్ర దక్కింది. తన టాలెంట్‌తో ఆ పాత్రని అతను రక్తి కట్టించాడు. సాంకేతికంగా కూడా రుద్రమదేవి ఏమంత గొప్పగా లేదు. ఇళయరాజా లాంటి దిగ్గజ సంగీత దర్శకుడి నుంచి ఆశించే సంగీతం కాదిది. అవసరానికి మించి పాటలు పెట్టారు. నేపథ్య సంగీతం కూడా ఎప్పుడో పాత సినిమాలని తలపిస్తుంది. ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించినా కానీ ఎడిటింగ్‌ లోపాలు మరీ గ్లేరింగ్‌గా కనిపిస్తాయి. 

ఏదైతే ఆశించి వెళతారో దానిని అందించడంలో, చరిత్రని అద్భుతంగా ఆవిష్కరించడంలో రుద్రమదేవి విఫలమైంది. ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తి, గోనగన్నారెడ్డి పాత్ర ఇచ్చిన 'సమ్‌'తృప్తి ఇక రుద్రమదేవికి బాక్సాఫీస్‌ దగ్గర వెన్నుదన్నుగా నిలబడాలి. 

బోటమ్‌ లైన్‌: ఎటెంప్ట్‌ గొప్పదే.. కానీ!!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?