ఆంధ్రా కరెంటు అక్కర్లేదంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. గతంలో పోలవరం ముంపు మండలాల విషయంలో నానా రాద్ధాంతం చేసి, చివరికి ‘అంతా అయిపోయింది.. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం..’ అని తేల్చేశారు ఇదే కేసీఆర్. కరెంటు విషయంలోనూ అదే తంతు. ‘ఆంధ్రా సర్కార్ మెడలు వంచి అయినాసరే మా వాటా మేం తీసుకుంటాం..’ అని చెప్పిన కేసీఆరే, ఇప్పుడు ఆంధ్రా కరెంటు వద్దంటున్నారు.
కేసీఆర్ ఏం చెబితే అదే కరెక్ట్. దేన్నయినా తప్పు అని ఆయన భావిస్తే.. అది తప్పు అని అంతా డప్పు కొట్టాల్సిందే. కాదు అదే రైటు.. అని ఆయన చెబితే, ‘రైట్ రైట్’ అనాల్సిందే. దేనికి దానికి ఆయన ఖచ్చితంగా కారణాలు చెప్పేస్తారు గనుక, ఇక వాదించడానికేమీ వుండదు. ‘అప్పుడు అది తప్పయినప్పుడు.. ఇప్పుడు అది ఒప్పు ఎలా అవుతుంది చెప్పు.?’ అని కేసీఆర్‌ని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారంతా తెలంగాణ ద్రోహులైపోతారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తూ మన్మోహన్ సర్కార్ పెట్టిన పితలాటకాల్లో ప్రధానమైనది కరెంటు పంపకం. ఆస్తుల్ని, అప్పుల్నీ జనాభా ప్రతిపాదికన పంచి, కరెంటును మాత్రం వాడకం ప్రాతిపదికన పంచడంతో ఆంధ్రప్రదేశ్‌కీ ఇబ్బందులు తప్పలేదు. తమ రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ని ఉత్పత్తి చేసుకుంటున్నా, తెలంగాణకు ఎక్కువభాగం సమర్పించుకోవాల్సి వచ్చేది. అలా చేస్తున్నా, ‘మా వాటా మాకు దక్కడంలేదు మొర్రో..’ అంటూ తెలంగాణ సర్కార్ వాపోతుండడంతో.. ఏపీ అన్ని సందర్భాల్లోనూ దోషిగా నిలబడాల్సిన దుస్థితి దాపురించింది. ఇక కరెంటు విషయంలో ఏపీకి దోషిగా నిలబడే అవకాశం వుండకపోవచ్చు. ఆ వెసులుబాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించేశారు.
‘ఆంధ్రా కరెంటు ఖరీదైనది.. అందుకే అది మాకు వద్దు..’ అని కేసీఆర్ చెబుతున్నారు. అయితే అది కేవలం కృష్ణపట్నం విద్యుత్‌కి మాత్రమే పరిమితమైతే, మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన కరెంటు వాటాల్లో వివాదాలు కొనసాగుతాయి. మొత్తంగా ఆంధ్రా కరెంటు వద్దేవద్దని కేసీఆర్ చెప్పిందే నిజమైతే.. ఇరు రాష్ట్రాల మధ్యా కరెంటు వివాదాలు లేనట్టే.
మంచికో చెడుకో.. కొన్ని వివాదాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ ముగింపు పలుకుతున్నారు. నీటి వాటాల వివాదం విషయంలోనూ, ఇతరత్రా వివాదాలకు సంబంధించి కూడా కేసీఆర్ ఇలానే వ్యవహరిస్తే.. అసలు ఇరు రాష్ట్రాల మధ్యా వివాదాలెందుకు వుంటాయి.? ఇరు రాష్ట్రాల మధ్యా మనస్పర్థలకు తావెక్కడ వుంటుంది.? అయితే, కొండంత రాగం తీసి, తుస్సుమన్పించిన చందాన.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టడమెందుకు, చివరికి దణ్ణం పెట్టడమెందుకు.. అనే వాదనలూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.
ఏదిఏమైనా.. ఇరు రాష్ట్రాల మధ్యా వివాదాలు ఎలాగోలా సద్దుమణుగుతున్నందుకు.. అందరూ సంతోషించాల్సిందే.