రామానాయుడుగారిపై నా వ్యాసానికి స్పందనగా ఒక పాఠకుడు నేను రాజేంద్రప్రసాద్‌గారి గురించి కూడా పేజీలకు పేజీలు రాశాననీ, నటుల గురించి పట్టించుకోలేదనీ అన్నారు. నేను కొందరు రచయితలను కించపరిచానంటూ కులం రంగు కూడా పులమబోయారు. నేను గతంలో డివియస్ రాజు గారి గురించి కూడా పేజీలకు పేజీలు రాశానన్న విషయం ఆయన దృష్టికి వచ్చి వుండదు. వేటూరి గురించి నేను అనరాని మాటలన్నానని అభాండం వేశారు. నేనెప్పుడూ అనలేదు. వృత్తిపరంగా ఆయన గురించి చెడ్డగా విననూ లేదు. నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. ఆయన సౌమ్యతా, మంచితనం కూడా తెలుసు. పాటకు లక్షలాది రూపాయలు తీసుకునే రోజుల్లో కూడా మా ''హాసం'' పత్రికకు ఆయన ''కొమ్మకొమ్మకో సన్నాయి'' శీర్షికకు వ్యాసాలు రాసిచ్చేవారు. మేం యిచ్చే పారితోషికం రూ.250 మాత్రమే, అయినా ఆయనకు అది రాయడం సరదా. పుస్తకరూపంలో వేసుకుంటామన్నప్పుడు డిటిపి మేటర్ అంతా సిడిలో యిచ్చాం. ఆంధ్రపత్రిక వీక్లీలో పని చేసే రోజుల్లో క్రింద పేరు లేకుండా ఆయన రాసిన ''అనూరాధ డైరీ'' శీర్షిక పేజీలను నేను సేకరించాను – అవి రమణగారు రాసినవేమోనన్న అనుమానంతో! బాపురమణలకు చూపిస్తే కొన్ని చదివి (రమణగారికి తను రాసినవి కూడా గుర్తుండేవి కావు) 'ఇది సుందరం రాసినది' (వేటూరిని వాళ్లు అలా పిలిచేవారు) అన్నారు. అప్పణ్నుంచి ఆయనకు అవి అందచేయాలని అనుకునేవాణ్ని. కొంతకాలం పాటు ఆయన ఎవరికీ కనబడకుండా పోయారు. బాపురమణలకు కూడా దొరకలేదు. ఆయన చేత ఏదైనా రాయించుకోవాలని తీవ్రంగా అన్వేషించగా మా పక్క ఎపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోనే వుంటున్నారని తెలిసింది. మా ఎపార్ట్మెంట్లోంచి తొంగి చూస్తే ఆయన ఫ్లాట్ కనబడుతుందన్నమాట. కానీ ఆయన్ని వారి బాల్కనీలో ఎప్పుడూ చూడలేదు. అప్పటికి (2002 నాటికి) టూ బెడ్రూమ్ ఫ్లాట్‌లో వుండేవారు. అనూరాధ డైరీ సేకరించి యిచ్చినందుకు పొంగిపోయారు. వెళ్లినపుడు 'మీరు' అంటూ చాలా మర్యాదగా మాట్లాడేవారు. తన మిత్రుడు ముళ్లపూడి రమణగారి సాహితీసర్వస్వాన్ని సంకలనం చేశానని వేటూరిగారికి నాపై అభిమానం. మాకు వ్యాసాలు ఎప్పుడూ ఆలస్యం చేసేవారు కారు. ప్రూఫ్‌లు చూసేవారు కూడా.
2005లో మేం ''హాసం'' పుస్తకాల ప్రచురణ ప్రారంభించినపుడు మొదటి పుస్తకంగా తనికెళ్ల భరణిగారి ''ఎందరో మహానుభావులు'' పుస్తకం వేశాం. దానికి వేటూరి ముందుమాట రాసిచ్చారు. ఆవిష్కరిస్తానని కూడా మాట యిచ్చారు. అయితే ఆవిష్కరణ సభ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే దానితో బాటు ''జంధ్యామారుతం 1, 2'' భాగాలు చిరంజీవి ఆవిష్కరిస్తున్నారు. వేరే ఎక్కడైనా అయితే జనాల్ని మేనేజ్ చేయడం కష్టమనుకున్నాం. ఆర్ట్ గ్యాలరీ అయితే మెట్లెక్కలేనన్నారు వేటూరి. చివరకు చిరంజీవిగారి చేతనే ''ఎందరో మహానుభావులు'' ఆవిష్కరించబడగా నా ''అచలపతి కథలు''ను భరణి ఆవిష్కరించారు. వేటూరి పాటలపై విశ్లేషణాత్మకంగా చక్రవర్తి అనే రచయిత రాసిన పుస్తకం కృతజ్ఞతల లిస్టులో నా పేరు కూడా వుంటుంది. వాస్తవాలు యిలా వుండగా నేను అనరాని మాటలన్నానని యీ పాఠకుడు ఎలా అన్నారో తెలియదు. వేటూరి పోయినప్పుడు ప్రభుత్వం డబ్బుతో ఆయనకు యిల్లు కట్టిస్తామని కొందరు నాయకులు చేసిన వాగ్దానాలను నేను వెక్కిరించాను. వేటూరి బతికుండగా ఎవర్నీ యాచించలేదని, దేబిరించలేదని, డబ్బు పోగొట్టుకున్నపుడు ఆయన కష్టాలు ఆయనే పడ్డారని, యిలాటి ఆఫర్లతో మరణానంతరం ఆయన పరువు తీయడం భావ్యం కాదని వాదించాను. ఆయనకు, శ్రీనాథుడికి చాలా పోలికలున్నాయి. కవిత్వంలోనే కాదు, జీవితంలో కూడా. శ్రీనాథుడి చివరి దశ బాధాకరం. కానీ వేటూరి మళ్లీ వెలుగులోకి వచ్చారు.
టాప్ రైటర్‌గా వుండగానే లోకం నుంచి నిష్క్రమించారు. ఆలాటాయన కుటుంబానికి టాక్స్‌పేయర్ డబ్బులతో యిల్లు అని చెప్పారు, ఆ తర్వాత దాన్ని విస్మరించారు! బాపుగారు పోగానే కూడా యిలాటి వాగ్దానాలే వెలువడ్డాయి. వాటిపై నేను ఎలా స్పందించానో జనాలకు గుర్తుండే వుంటుంది. ఆ దిశగా ఒక్క అడుగైనా పడిందా? బాపు విగ్రహం నరసాపురంలో వెలిసిందంటే దానికి కారణం తానా! ప్రభుత్వం కాదు. పుష్కరాల టైముకి రాజమండ్రిలో బాపురమణల విగ్రహాలు వెలుస్తాయని అంటూ వచ్చారు. ఇవాళ రాజమండ్రి మునిసిపాలిటీ సమావేశంలో పుష్కరాల పనులు అసంపూర్తిగా వున్నాయని, అవినీతి జరిగిందని నిందించుకుంటూ బాహాబాహీ యుద్ధం జరిగింది. ఈ గొడవల మధ్య విగ్రహాలు వెలుస్తాయని ఎలా నమ్మగలం? పత్రికల్లో మరీ విమర్శలు వస్తే రెడీగా వున్న విగ్రహాలు రెండు పట్టుకుని వచ్చి యిదిగో బాపురమణ అనవచ్చు. అదేమిటని తెల్లబోతే 'ఏం? నరసాపురం బాపు విగ్రహంలో మాత్రం పోలికలున్నాయా?' అని మనల్ని దబాయించవచ్చు. ఈ వాక్యాలు చదివి బాపుని నేను అనరాని మాటలన్నానంటే ఏం చెప్పాలి? వేటూరి పోయినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు తన పత్రికలో ''వేటూరి కమ్మ నిర్మాతలకు కావాలని బూతుపాటలు రాసి యిచ్చారని' ప్రతిపాదిస్తూ వ్యాసం రాశారు. అలాటి ఆలోచనను వేళాకోళం చేస్తూ నేను వ్యాసం రాశాను. పాత్రల బట్టి రాస్తారు తప్ప నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల, హాలు ఓనర్ల కులం బట్టి పాటలు రాయరని వ్యంగ్యంగా చెప్పాను.
ఇక ఆత్రేయ గురించి – ఆత్రేయ నిర్మాతలను ఏడిపించారన్న సంగతి, బొత్తిగా అన్‌ప్రొఫెషనల్ అన్న సంగతీ అందరికీ తెలుసు. ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు కూడా. ఆయన ప్రవర్తన గురించి సహరచయిత ఆరుద్ర కూడా 'సినీమినీ కబుర్లు'లో రాశారు. రమణగారు 'కోతికొమ్మచ్చి'లో రాశారు. నేను పనిగట్టుకుని పరువు తీసినదేముంది? ఇక్కడ నేను చెప్పదలచినది నిర్మాతల కష్టాల గురించి. రచయితలకు, కవులకు చేతిలో కలం వుంటుంది. వారి పక్షాన్నుండి సబబనుకున్నది రాయడానికి అవకాశం వుంటుంది. ''అనుగ్రహం'' సినిమా రచయితగా తనను తీసేసి ఆరుద్రను పెట్టినపుడు శ్రీశ్రీ ఎంతటి వ్యాసాలు రాశారో గుర్తున్న వారికి నా పాయింటు అర్థమౌతుంది. శ్రీశ్రీ చెప్పాపెట్టకుండా చైనా చెక్కేశారని నిర్మాత చేసుకున్న మొత్తుకోళ్లు పుస్తకాల్లో రావు. శ్రీశ్రీ సాహితీసర్వస్వంలో ఆయన వెర్షనే కనబడుతుంది. కళాకారులు పైకి కనబడేటంత అమాయకులు కారు. మీరేదైనా కచ్చేరీ ఏర్పాటు చేసినా, ఒక ఆడియో సిడి ప్లాన్ చేసినా సృజనాత్మకత వున్నవారితో వేగడం ఎంత కష్టమో తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్ వ్యాసంలో ఆత్రేయ గురించే కాదు, బి సరోజాదేవి కుటుంబం గురించి కూడా రాశాను గమనించారో లేదో. ''దసరా బుల్లోడు''కై జయలలితను బుక్ చేస్తే ఆవిడ ఆఖరి నిమిషంలో ఆ డేట్స్ ''శ్రీకృష్ణవిజయం''కు యిచ్చేసింది. అప్పటికప్పుడు వాణిశ్రీని బుక్ చేయవలసి వచ్చింది. తారలు వాళ్లల్లో వాళ్లు కొట్టుకున్నా, జబ్బు పడినా, గర్భం దాల్చినా, మధ్యలో పేచీ పెట్టినా మునిగిపోయేవాడు నిర్మాతే. రామానాయుడు వ్యాసం మొదట్లోనే చెప్పాను – నిర్మాతకు అభిరుచి లేకపోతే సినిమా మొదలే కాదని. ఈ రోజు ఎయన్నార్ సినిమాలు, ఎన్టీయార్ సాంగ్స్.. అంటూ నటుల పరంగా మాట్లాడుతున్నారు కానీ నటుడి స్థానం నాలుగోదేనని ఎయన్నార్ చెప్పేవారు. నిర్మాత పెట్టుబడి పెట్టాలి, రచయిత సృష్టించాలి, దర్శకుడు రూపుదిద్దాలి అప్పుడే నటుడికి తన ప్రతిభ చూపే ఛాన్సు వస్తుంది. అయితే నిర్మాతల గురించి ఎవరూ పట్టించుకోరు. నటీనటుల జయంతికి, వర్ధంతికి ఏటేటా వ్యాసాలు వస్తాయి. వారి పేర అవార్డులు యిస్తూ వుంటారు. వారిపై పుస్తకాలు రాస్తారు. నిర్మాతలు అనామకులుగా మిగిలిపోతున్నారనే బాధతోనే మురారి గారు నిర్మాతల డైరక్టరీ తలపెట్టి వ్యయప్రయాసలతో వెలువరించారు.
నటీనటుల గురించి ఎవరైనా రాస్తారు, నిర్మాతల గురించి రాయాలని నాకుంటుంది. అయితే వారి గురించి పుస్తకాలు బహు తక్కువగా వుంటాయి. నాదంతా కాప్స్యూల్ తయారీ వ్యవహారం. అంటే ఏదైనా పెద్ద పుస్తకం చదివి, దాని సారాంశాన్ని పాఠకులకు సులువుగా అందించే పని. పుస్తకం లేకుండా వ్యాసం మాత్రమే దొరికితే యిక నేను పిండడానికి ఏముంటుంది, నా తలకాయ! అందుకే అనేకమంది కళాకారుల పట్ల గౌరవం వున్నా నేను వ్యాసాలు రాయలేకపోతున్నాను. భానుమతి, సావిత్రి గురించి రాసినపుడు అంజలి గురించి రాయలేదేం అని చాలామంది అడిగారు. ఆవిడ గురించి పుస్తకం ఏదీ లేకపోతే నేనేం చేయగలను? ఇలాటి ప్రాక్టికల్ యిబ్బందులుంటాయి తప్ప కులపరమైన పరిగణనలు ఒక్కనాటికీ వుండవు. నాకే కాదు, ఏ రచయితకూ వుండవు. ఉంటే మనజాలడు – ఆ కులానికి సంబంధించిన పత్రిక ఏదైనా వుంటే దానిలోనే రాసుకుంటూ వుంటే తప్ప!
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)