ప్రపంచకప్ తో బీసీసీఐకి భారీ నష్టమేనా..!

'నష్టం' భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిక్షనరీలో ఇంత వరకూ లేని పదం ఇది. అలాంటి ఈ సంస్థ తొలి సారి ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాన్నే మూటగట్టుకొంటోంది. అదికూడా ఏకంగా…

'నష్టం' భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిక్షనరీలో ఇంత వరకూ లేని పదం ఇది. అలాంటి ఈ సంస్థ తొలి సారి ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాన్నే మూటగట్టుకొంటోంది. అదికూడా ఏకంగా వందల కోట్ల రూపాయల నష్టాన్ని! ఈ ప్రభావం ఆటగాళ్ల జీత భత్యాలపై కూడా పడుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది బీసీసీఐ చాలా నష్టాలను ఎదుర్కొందట. ప్రతియేటా టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి దాదాపు 800 కోట్ల రూపాయలు దక్కేవి. ఈ సారి ఆ మొత్తం సగం స్థాయికి పడిపోయింది. గత ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ మధ్య కాలంలోమ్యాచ్ టెలికాస్టింగ్ హక్కులకు సంబంధించి దక్కే మొత్తం కేవలం నాలుగువందల కోట్ల రూపాయలేనని తెలుస్తోంది! ఎందుకలా.. అంటే ఈ సారి భారత క్రికెట్ టీమ్ షెడ్యూలే కారణం!

టీమిండియా ఎప్పుడో డిసెంబర్ రెండో వారంలో ఆసీస్ వెళ్లింది. ఏప్రిల్ తొలి వారానికిగానీ ఇండియాకు రాదు! ఆసీస్ తో టెస్టుసీరిస్, ముక్కోణపు వన్డే సీరిస్.. వరల్డ్ కప్ లను పూర్తి చేసుకొని ఇండియన్ టీమ్ ఇండియాకు వస్తుంది. మొత్తంగా ఐదు నెలల సుధీర్ఘ పర్యటన ఇది.

మరి ఈ ఐదు నెలల సుధీర్ఘ సమయంలో దేశీయంగా జాతీయ జట్టు ఆడే టోర్నీలు ఏమీ లేకుండా పోయాయి. ఇండియాకు ఏవైనా టీమ్ లు వచ్చి ఆడితే.. ఇక్కడ మ్యాచ్ లను లైవ్ లో ప్రసారం చేసే టీవీ నెట్ వర్క్ వాళ్లు బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తారు. దీంతో నిధుల వరద పారుతుంది. అయితే గత ఏడాది సమయంలోని ఐదు నెలల్లో బీసీసీఐ హోస్టు చేసే సీరిస్ ఏదీ లేకుండా పోయింది. దీంతో ఈ భారీ నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఆదాయాన్ని కోల్పోవడం కూడా నష్టమే కాబట్టి.. ఆసీస్ తో టెస్టు సీరిస్, ప్రపంచకప్ లు టీమిండియా అభిమానులకు వినోదాన్ని ఇచ్చినా… బీసీసీఐకి మాత్రం భారీ నష్టాలనే చూపించాయి!