రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రేటింగ్: 2.5/5
బ్యానర్: సిరి సినిమా
తారాగణం: అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్, హర్షవర్ధన్ రాణె, అభిమన్యు సింగ్, బ్రహ్మానందం, అలీ, భానుశ్రీ మెహ్రా తదితరులు
కథ: విక్రమ్ రాజ్
సంగీతం: శేఖర్ చంద్ర
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్‌కుమార్
నిర్మాత: అమ్మిరాజు కాసుమిల్లి
దర్శకత్వం: బి. చిన్ని
విడుదల తేదీ: నవంబర్ 7, 2014
‘సుడిగాడు’ తర్వాత సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతోన్న అల్లరి నరేష్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’గా మళ్లీ మన ముందుకి వచ్చాడు. త్రీడీ సినిమాలు, లడ్డూ వేషాలతో లాభం లేదని… ఈసారి తన మార్కు కామెడీ చేయడానికి ప్రయత్నించిన అల్లరి నరేష్ ఇప్పుడైనా సక్సెస్ కాగలిగాడా?
కథేంటి?
లక్కీ, రాంకీ కవల సోదరీసోదరులు (కార్తీక, నరేష్). మగరాయుడిలాంటి లక్కీతో రాంకీ అండ్ ఫ్యామిలీ తిప్పలు పడుతుంటుంది. ఇదిలావుండగా శృతి (మోనాల్) అనే అమ్మాయిని రాంకీ ప్రేమిస్తాడు. ఆమెని ఎలాగోలా ఇంప్రెస్ చేసిన రాంకీ ఇక పెళ్లి చేసుకుందామనుకుంటే.. తన చెల్లికి పెళ్లి చేస్తే తప్ప తను పెళ్లి చేసుకోవడానికి లేదని లాక్ వేస్తాడు తన తండ్రి. లక్కీ అప్పటికే ఒకడ్ని (హర్షవర్ధన్) ప్రేమించేస్తుంటుంది. అతడికి ఒక ఫ్యాక్షనిస్టు కూతురితో (భాను) పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఆ పెళ్లి చెడగొట్టి తన చెల్లి ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించే బాధ్యత రాంకీపై పడుతుంది.
కళాకారుల పనితీరు:
నవ్వించడానికి ఈమధ్య వివిధ మేకప్పులు, డ్యూయల్ రోల్సు చేస్తున్న అల్లరి నరేష్ ఈసారి అవేమీ లేకుండా నేచురల్‌గా కనిపించాడు. చాలా సాధారణ సన్నివేశాలు, నాసి రకం సంభాషణలు ఉన్నా కానీ తన మార్కు టైమింగ్‌తో అక్కడక్కడా మెరిసాడు. కానీ ఇంతకంటే బెటర్ కామెడీ ఎప్పుడో చేసేసిన నరేష్‌నుంచి ఈ లెవల్ కామెడీని ఎంజాయ్ చేయడం కష్టమే.
నరేష్ కవల సోదరిగా కార్తీక బాగా సెట్ అయింది. తనకి చాలా మంచి రోల్ దొరికినా కానీ కార్తీక వాడుకోలేకపోయింది. మంచి పర్‌ఫార్మర్ అయి ఉంటే ఈ పాత్రని బాగా రక్తి కట్టించి ఉండేది. హీరోయిన్ క్యారెక్టర్ చేసింది కాబట్టి మోనాల్ గజ్జర్ పేరు చెప్పుకోవాలి కానీ, ఆమె చేసిందంటూ ఏమీ లేదు. హర్షవర్ధన్ రాణె తనకి అలవాటైన పాత్రలోనే కనిపించాడు. రక్తచరిత్ర ఫేమ్ అభిమన్యుసింగ్‌తో కామెడీ చేయించాలని చూసారు. అతని కామెడీ చూసి నవ్వు రాకపోయినా.. ఆ ఆలోచనకి నవ్వుకోవాలంతే. ‘వరుడు’ ఫేమ్ భాను మెహ్రా హ్యాపీగా సైడ్ క్యారెక్టర్స్‌తో నెట్టుకొచ్చేస్తోంది. కన్‌ఫ్యూజన్ మధ్య ఎంటర్ అయి కామెడీ చేసే క్యారెక్టర్‌లో ఇంకా బ్రహ్మానందాన్ని ఎన్నిసార్లు చూడాలో?
సాంకేతిక వర్గం పనితీరు:
సాంకేతికంగా ఈ చిత్రం మరీ ఎనభైవ దశకం నాటి సినిమాల్ని తలపిస్తుంది. దర్శకుడు చిన్నిది ఓల్డ్ స్కూల్ స్టయిల్. అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ హ్యాండిల్ చేసిన తీరులో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఒకటి, రెండు సినిమాలు తీసిన దర్శకుడి నుంచి కాస్త ఫ్రెష్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేసినా డిజప్పాయింట్ అవుతారు. డైలాగ్స్ అంతటా ప్రాసల పరంపర తప్ప గుర్తుండేవి ఏవీ లేవు. పాటలు ఎందుకున్నాయో తెలీదు. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోకపోవడమే మంచిది.
ముందే చెప్పినట్టు ఓల్డ్ స్కూల్ తరహాలో డైరెక్ట్ చేసిన చిన్ని కనీసం కామెడీ పరంగా అయినా కొత్తగా ట్రై చేయలేదు. ఈమధ్య అందరూ చేస్తున్నట్టే… ద్వితీయార్థంలో కన్‌ఫ్యూజన్ డ్రామాతో నెగ్గుకు రావాలని చూసాడు. అంతో ఇంతో ఆసక్తికరమైన కథాంశమే అయినా కానీ దానిని వీలయినంత ఫ్లాట్‌గా తయారు చేసి బిలో యావరేజ్ ప్రోడక్ట్ అందించాడు.
హైలైట్స్:
- అల్లరి నరేష్
డ్రాబ్యాక్స్:
- స్క్రీన్‌ప్లే
- మ్యూజిక్
- డైరెక్షన్
విశ్లేషణ:
ఏదో ఒకటి చేసి ఇంటర్వెల్ తర్వాత హీరోని విలన్స్ ఇంటికి పంపించి… అక్కడ నానా గందరగోళం చేసి, హీరో అనుకున్నది సాధించుకోవడం గత అయిదారేళ్లుగా తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా. ఇప్పటికీ ఈ ఫార్ములా నుంచి కొందరు హిట్లు పిండగలుగుతున్నారు కానీ ఇప్పటికే దీంతో జనం విసుగెత్తిపోయారు. స్టార్ హీరోలున్నా కానీ ఈ ఫార్ములాని ఆడియన్స్ రిజెక్ట్ చేసేస్తున్నారు. కామెడీ మహా గొప్పగా పండిస్తే తప్ప ఈ ఫార్ములాతో సేఫ్‌గా ఒడ్డు చేరడం కష్టం.
ఇలాంటి సినిమాలు చాలానే బోల్తా కొడుతున్నా కానీ ఈ చిత్ర బృందం కూడా ఓ రాయేసి చూసింది. మగరాయుడిలాంటి చెల్లి, నెమ్మదస్తుడైన అన్న… ఈ సినిమా కాన్సెప్ట్ ఇదే. ట్రెయిలర్‌లోనే సినిమా మొత్తం చూపించేసారు. ఇక అక్కడ్నుంచి ముందుకి నడిపించడమే సవాల్. ప్రథమార్థం వరకు తిమ్మిని బమ్మిని చేసి ఏదో మేనేజ్ చేసేసారు కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి శ్రీను వైట్ల రూట్లోకి వెళ్లక తప్పలేదు. తెర నిండా ఆర్టిస్టులున్నా కానీ కామెడీ పండక పోవడంతో అల్లరి నరేష్, బ్రహ్మానందం కూడా చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
కమర్షియల్ సినిమాల్లోను కామెడీ బ్రహ్మాండంగా పండుతోన్న రోజుల్లో అచ్చంగా కామెడీ సినిమానే తీసినపుడు దాని డోస్ ఎలా ఉండాలి, ఎంత పండాలి? అడపాదడపా కొన్ని డైలాగులు పేలడం, ఒకటీ అరా సన్నివేశాలు పండడం మినహా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ తేలిపోయింది. లో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వారిని తప్ప ఈ బొమ్మాళికి బాగా నవ్వించేంత బొమ్మయితే ఖచ్చితంగా లేదు. ఇంతకుముందు యావరేజ్ కామెడీలతో కూడా నరేష్ పాస్ అయిపోయేవాడు కానీ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ హ్యూమర్ పెరగకపోతే ఫెయిలవక తప్పదు.
బోటమ్ లైన్: కొంచెం కష్టమే బ్రదరూ!
– గణేష్ రావూరి