ఆ మధ్య తెగ హడావుడి జరిగిపోయింది టాలీవుడ్ లో..కొన్ని పేపర్లు, కొన్ని చానెళ్లు, అంటూ, పొదుపు కబుర్ల పేరిట మీడియానుకంట్రోలు చేసే పని మొదలు పెట్టారు దిల్ రాజు సారథ్యంలో కొందరు నిర్మాతలు. ఇది టాలీవుడ్ ఇమేజ్ ను ఎంత దెబ్బతీయాలో అంతా తీసింది.
దాంతో అందరూ మళ్లీ మామూలైపోయారు. అంతెందుకు ఈ వ్యవహారానికి తెరతీసిన దిల్ రాజు కూడా తన సినిమా దగ్గరకు వచ్చేసరికి పాత తోవలోనే వెళ్లారు. ఇక ప్రచారం బడ్జెట్ కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈవారం విడుదలైన భలే భలే మగాడివోయ్, డైనమైట్ సినిమాలకు ఒక్కోదానికి కోటిన్నర నుంచి రెండు కోట్లు ఒక్క ప్రచారానికే ఖర్చు చేసారని తెలుస్తోంది.
తక్కువ సమయంలో సినిమా విడుదలలు ఫిక్స్ కావడంతో సినిమాలకు హైప్ తీసుకురావడానికి పోటీలు పడి మరీ ఖర్చు చేసాయి ఈ రెండు సినిమాలు. అందునా డైనమైట్ అయితే ఓ అడుగు ముందే వుంది ఆ విషయంలో. ఇప్పుడు దిల్ రాజు సిండికేట్ లో వున్న రంజిత్ మూవీస్ దామూ సినిమా హోరా హోరీ విడుదలకు రెడీ అవుతోంది. మరి వాళ్లేం చేస్తారో చూడాలి. పద్దతికి కట్టుబడి అణాకాణీ ప్రచారంతో సరిపెడతారో? లేక అంతకన్నా కాస్త ముందుకు వెళ్తారో?