ఎమ్బీయస్‌: ఆంధ్రకు పరిశ్రమలు తరలివస్తాయా?-3

తెలంగాణలో పరిశ్రమలు కొనసాగడానికి విద్యుత్‌ లోటు ఒకటి అవరోధంగా వుంది. కెసియార్‌ సెక్రటేరియట్‌ తరలింపు లాటి అనవసరమైనవాటికి విపరీతంగా ఖర్చు పెట్టి, విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ప్లాన్‌ చేయడం లేదు. విద్యుత్‌ కొనడానికే డబ్బులు…

తెలంగాణలో పరిశ్రమలు కొనసాగడానికి విద్యుత్‌ లోటు ఒకటి అవరోధంగా వుంది. కెసియార్‌ సెక్రటేరియట్‌ తరలింపు లాటి అనవసరమైనవాటికి విపరీతంగా ఖర్చు పెట్టి, విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ప్లాన్‌ చేయడం లేదు. విద్యుత్‌ కొనడానికే డబ్బులు చాలని పరిస్థితిలో కులసంఘాలకు, ప్రాంతీయ సంఘాలకు బిల్డింగులు అవసరమా? ఇవన్నీ ఉత్పాదనకు పనికి వచ్చే ఖర్చు కాదు. విద్యుత్‌ విషయంలో ఆంధ్రలో మిగులు వుంది కాబట్టి పరిశ్రమలకు అటువైపు ఆకర్షణ వుంది. అయితే యీ మిగులు ఎంతకాలం వుంటుందో తెలియదు.  ఇన్నాళ్లూ అక్కణ్నుంచి హైదరాబాదుకి సప్లయి చేస్తూండేవారు. ఇప్పుడు ఆపేశారు కాబట్టి మిగులుతోంది. ప్రస్తుతానికి పరిశ్రమలు లేవు కాబట్టి నిరంతరం యిస్తున్నారు. నిజంగా పరిశ్రమలు వస్తే ఎన్ని గంటలు యివ్వగలరో? విద్యుత్‌ ప్రాజెక్టులు యింకా పెట్టాలంటే నిధులు కావాలి. అక్కడ చంద్రబాబూ సంక్రాంతికి 'చంద్రన్న కానుక' వంటి వృథా వ్యయం చేసి డబ్బులు తగలేస్తున్నారు. ముందుచూపు లోపిస్తోంది.

కొత్తవాటి మాట ఎలా వున్నా యిప్పటికే వున్న కంపెనీలు తెలంగాణ నుంచి ఆంధ్రకు తమ రిజిస్ట్రేషన్లు మార్చుకుంటాయా అనేది మరో ప్రశ్న. జూన్‌ నెల నుంచి కొన్ని నెలలపాటు కొన్ని కంపెనీలు తమ అడ్రసులు తెలంగాణ నుంచి ఆంధ్రకు మార్చడంతో తెలంగాణ ఆదాయం తగ్గింది. ఆ విషయం కెసియార్‌ కూడా కేంద్రానికి యిచ్చిన నివేదికలో చెప్పుకున్నారు. దాని అప్‌టుడేట్‌ తెలియదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రొఫెషనల్స్‌, చిన్న వ్యాపారాల వాళ్లు రీజనల్‌ సెంటిమెంటుతో హెడాఫీసు ఆంధ్రకు షిఫ్ట్‌ చేసినట్లు చూపించి, తమ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగించవచ్చు. కానీ యిన్‌కమ్‌టాక్స్‌ భారీగా కట్టే పెద్ద కంపెనీల వాళ్లు పెద్ద నగరాల నుంచి ఓ పట్టాన మారరు. దేశంలోని అనేక కంపెనీల హెడాఫీసు బొంబాయిలో వుంటుంది. అక్కడ ఒక్క చిన్న గదిలో బుల్లి టేబుల్‌ వేసి, అదే హెడాఫీసు అంటారు. ఎందుకంటే టాక్స్‌ ఫైలు బొంబాయిలో వుంటే అక్కడ మహాసముద్రంలో కాకిరెట్టలా వుండవచ్చు. బొంబాయిలో ఫైళ్లు ఎంత పెద్ద సంఖ్యలో వుంటాయో వూహించండి. అంత వాల్యూమ్‌లో ఎ,బి,సి మెథడ్‌లో (ప్రాధాన్యతా క్రమంలో ఫైళ్లు విడగొట్టడం) చిన్నవాటిని, మధ్యతరహా వాటిని పెద్దగా పట్టించుకోరు. పెద్దపెద్ద కంపెనీలను దులిపితే ఏదైనా రాలుతుంది. చిల్లర ఎంత పోగుచేసినా ఏం లాభం అనుకుని, ఒక లిమిట్‌కు కింద వున్నవాటిని ఎట్‌ ర్యాండమ్‌, మధ్యమధ్యలో ఒకటి తీసి చూసి తక్కినవి వదిలేస్తూంటారు. వాళ్ల చూపు తమపై పడకూడదనుకునేవారికి అలాటి వాతావరణమే కావాలి. 

ఉదాహరణ చెప్పాలంటే మీరు ఉద్యోగానికి యింటర్వ్యూకి వెళుతున్నారనుకోండి. మొదటిరోజు పదిమందిని చేస్తారట, రెండో రోజు యిరవై మందిని చేస్తారట, నీ పేరు ఏ రోజు వేయమంటావు అని అడిగితే 'రెండో రోజు చివర్లో వేయి' అని అడుగుతారు. ఆ పాటికి అలిసిపోయి, పెద్దగా ప్రశ్నలు వేయకుండా వదిలేస్తారనే ఆశతో. మొట్టమొదటి కాండిడేట్‌గా వెళితే వాళ్లు ఫ్రెష్‌గా వుండి వాయించేస్తారన్న భయం వుంటుంది. ట్రాఫిక్‌ పోలీసు చెక్‌ చేస్తూ వుంటే సిగ్నల్‌ దగ్గర ముందు వరసలో వుందామనుకోం. వెనక్కాల నక్కి వుందామనుకుంటాం, అన్ని పేపర్లూ దగ్గరున్నా చెకింగ్‌ అంటే బోరే. జిరాక్స్‌ పెట్టావేం, ఒరిజినల్‌ వుండాలి కదా అనవచ్చు. ఏదో ఒకటి లోటు కనిపెట్టవచ్చు. ఇదీ అలాగే! 

హైదరాబాదు, విజయవాడ మధ్య మీరు ఏ సెంటర్‌ను ఎంచుకుంటారు అని పెట్టుబడిదారుణ్ని అడిగితే, హైదరాబాదులో గుంపులో గోవిందాగా వుంటుంది కాబట్టి అక్కడే అంటారు. విజయవాడ అయితే  అధికారులకు పని ఎక్కువ వుండదు కాబట్టి పట్టిపట్టి చూస్తారని భయం! ఇలాటి కారణాలకు ఎంత వెయిటేజి వుంటుంది అన్నది ఎవరైనా కక్షుణ్ణంగా పరిశోధిస్తే కానీ తెలియదు. ఇదంతా కామన్‌సెన్స్‌తో రాస్తున్నదే! ముళ్లపూడి వెంకటరమణ గారి ''రాజకీయ బేతాళ పంచవింశతిక''లో ''దాచింపాడు రోడ్డు కథ'' అని ఒకటుంది. ఒక గ్రామానికి పట్టణం నుంచి సరైన రోడ్డు వుండదు. రావాలంటే చచ్చే అవస్థ. గ్రామాధికారులు పట్టించుకోరు. ఒక యువకుడు యిదంతా చూసి, కోపగించుకుని ఎన్నికలలో నిలబడతాడు – 'నేను గెలిస్తే రోడ్డు వేయిస్తాను' అనే నినాదంతో. అవతలవాళ్లూ అదే చెప్తారు – 'వాడు గెలిస్తే రోడ్డు వేయిస్తాడు జాగ్రత్త' అని. అతను ఓడిపోతాడు. ఎందుకనే బేతాళప్రశ్నకు జవాబు ఏమిటంటే – రోడ్డు బాగా లేదని యిన్నాళ్లూ ప్రభుత్వాధికారులు చెకింగ్‌కు పెద్దగా రావటం లేదు. ఏడాదికోసారి మొక్కుబడిగా వస్తున్నారు. ఇప్పుడు రోడ్డు పడితే తోచీతోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్లినట్లు వారానికో సారి చెకింగ్‌కు వచ్చి అది లేదని, యిది వుందని సతాయిస్తారని జనం భయపడతారు. అంతకంటె రోడ్డు లేకపోవడమే మేలనుకుంటారు. గొప్ప సెటైర్‌ కానీ వాస్తవాలతో కూడుకున్నది. ఇప్పటికీ వర్తిస్తుంది.

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రకు ఏమైనా తరలి వస్తున్నాయో లేదో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇతర దేశాల నుంచి వస్తున్నాయని బాబు అంటున్నారు. అవన్నీ వచ్చేదాకా, కనీసం భూమిపూజ అయ్యేదాకా లెక్కలోకి తీసుకోలేం. 1972లో ఆంధ్ర వుద్యమం జరిగినపుడు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూన్న సమైక్యవాది ఒకాయన 'విడిపోతే ఆంధ్ర కేరళలా తయారవుతుంది. అందరూ ఎడ్యుకేటెడే, స్కిల్‌డే, కానీ అందరికీ అవకాశాలు వుండవు. ఇప్పుడైతే తెలంగాణలో వాక్యూమ్‌ వుంది కాబట్టి కొందరైనా అక్కడకు వ్యాపించి, తాము బాగుపడి, వాళ్లనూ బాగుచేస్తున్నారు. విడిపోయాక ఆ అవకాశాలు సన్నగిల్లుతాయి. సొంత రాష్ట్రంలో పోటీ ఎక్కువై పోతుంది. తట్టుకోలేనివాళ్లు మలయాళీల్లా యితర రాష్ట్రాలలోకి వెళ్లి బాగుపడాల్సిందే.' అన్నారు. ఆ మాటలు నాకు యిప్పుడు గుర్తుకు వస్తున్నాయి. కేరళలో ఏదీ పెద్ద వూరూ కాదు, ఏదీ గ్రామమూ కాదు, అన్నీ సుమారుసుమారుగా వుంటాయి. ఆగ్రో యిండస్ట్రీస్‌, కుటీరపరిశ్రమలు, సీ ఫుడ్‌ పరిశ్రమలు వీటితో లాక్కుని వస్తూ వుంటుంది. పెద్ద పరిశ్రమలు పెడదామంటే పొల్యూషన్‌ కంట్రోలు వాళ్లు ఒప్పుకోరు. ఆంధ్రలో కూడా ఎక్కడికక్కడ చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకుని జనాలు బతికేస్తూ వుంటారిక. కానీ అందరికీ ఉపాధి దొరకడం కష్టం. అవకాశాల కోసం గతంలో హైదరాబాదుకి వచ్చేవారు, హైదరాబాదు కూడా మందగించింది కాబట్టి, మద్రాసు, బెంగుళూరు, మధ్యప్రదేశ్‌, యిలా వేరే వేరే వూళ్లు వెతుక్కుంటూ వెళతారు. మరీ టాలెంట్‌ వుంటే విదేశాలు వెళతారు. ప్రతిభ వున్నవారిని, కష్టపడేవారిని ఎవరూ ఆపలేరు. పాలకుల కబుర్లు విని ఊహల్లో తేలియాడకుండా తమ టాలెంట్‌ పెంచుకుంటేనే ఆంధ్ర యువతకు మంచిది.- (సమాప్తం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2