ఎమ్బీయస్‌ : ఇది చెంపదెబ్బ కాదు…4

లెనిన్‌ టైములో రష్యాలో యితర నాయకులకు కూడా చోటు వుండేది. స్టాలిన్‌ వచ్చి తన వ్యతిరేకులందరినీ ఏరి పారేశాడు. తన చిత్తం వచ్చినట్లు పాలించాడు. దాని వలన కొంత మంచి జరిగింది, కొంత చెడు…

లెనిన్‌ టైములో రష్యాలో యితర నాయకులకు కూడా చోటు వుండేది. స్టాలిన్‌ వచ్చి తన వ్యతిరేకులందరినీ ఏరి పారేశాడు. తన చిత్తం వచ్చినట్లు పాలించాడు. దాని వలన కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. అంతిమంగా రష్యా నష్టపోయింది. అందరినీ సంప్రదిస్తూ, అందరినీ కలుపుకుని పోవడం చాలా కష్టమైన పని. దానికి ఓపిక, ఓర్పుతో బాటు అవతలివాళ్లపై గౌరవం కూడా కలిగి వుండాలి. అవతలివాడు చెప్పేది నాన్సెన్స్‌ అని తెలిసినా, మర్యాదగానే తిరస్కరించగలగాలి. ఇదంతా టైమ్‌ వేస్ట్‌ అని తీసి పారేస్తే, తోసి పారేస్తే స్టాలిన్‌లాగానే జరుగుతుంది. అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా జర్మనీ పౌరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఎన్నో అద్భుతాలు సాధించాడు. యుద్ధాలకు దిగకుండా వుంటే చాలాకాలం పాలించి వుండేవాడు. అతనిపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ మితిమీరిన అధికారం, తన మాటకు ఎదురాడిన వారిని సహించకపోవడం అనే లక్షణాలే చివరకు జర్మనీని నాశనం చేశాయి. ఈరోజు అడాల్ఫ్‌ అనే పేరు జర్మనీలో ఎవరూ పిల్లలకు పెట్టుకోనంతగా ప్రజల అసహ్యానికి గురయ్యాడు. హిట్లర్‌ తనతో బాటు తొలిరోజుల్లో కలిసి పయనించిన పార్టీలను నాశనం చేసి అందరి స్థానాలనూ తనే ఆక్రమించాడు.

ఇప్పుడు మోదీ చేస్తున్నదీ అదే కదా. ఢిల్లీ ఎన్నికల తర్వాత శివసేన స్టేటుమెంటు చూడండి – మోదీది వేవ్‌ అయితే, ఆప్‌ది సునామీ! తన భాగస్వామి ఘోరపరాజయం పొందితే చంకలు గుద్దుకుంటోంది. ఎందువలన? ఎందుకంటే వాళ్ల పార్టీ సభ్యుణ్ని రాత్రికి రాత్రి బిజెపి తన పార్టీలో చేర్చేసుకుని మంత్రిపదవి కట్టబెట్టినందుకు ఉక్రోషం. పొత్తులో ఎవరు బలవంతులో చూపడానికి విడివిడిగా పోటీ చేయడంలో తప్పు లేదు. కానీ తర్వాత కాస్త ఔదార్యం చూపాలి. రేపు పరిస్థితి తారుమారు అయితే ఎలా? అనే ఆలోచన వుండాలి. అకాలీదళ్‌తో కూడా యిలాగే ఆడుకుని, ఢిల్లీ ఎన్నికలో పంజాబీ ఓట్ల కోసం బాదల్‌కు పద్మవిభూషణ్‌ యిచ్చారు. అవసరమా? అతను చేసిన ఘనకార్యం ఏమిటో చెప్పారా? తన ప్రధాని అభ్యర్థిత్వాన్ని నితీశ్‌ వ్యతిరేకించాడు కాబట్టి నితీశ్‌పై మోదీ పగబట్టి మాంరీ­ని దువ్వాడు. మోదీ దన్ను చూసుకునే బలం లేకపోయినా మాంరీ­ తల ఎగరేశాడు. గవర్నరు మన చేతిలో వున్నాడు కదా అనుకున్నాడు. ఇలాటి భ్రష్టు పనులు చేయడానికే వస్తూనే గవర్నర్లను మార్చేశాడు. అన్నీ కాంగ్రెసు బుద్ధులే. ఎన్టీయార్‌ను పడగొట్టడానికి నాదెండ్లను యిలాగే వాడుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితం చూశాక మోదీ వెనక్కి తగ్గితే అప్పుడు మాంరీ­ నాలిక కరుచుకోవాలి – నమ్మి ఏమారిపోయానే అని. కశ్మీర్‌లో పిడిపితో కూడా బేరాలు తెగలేదు కాబట్టి వాళ్లూ మంటగా వున్నారు. ఢిల్లీ ఫలితాలు రాగానే 'ఇవి వారికి కనువిప్పు కావాలి' అన్నాడు ముఫ్తీ. ఇప్పటికైనా గుఱ్ఱం దిగి సమానస్థాయిలో మాట్లాడు సుమా అని హెచ్చరించాడన్నమాట. టిడిపిది మిత్రపక్షమైనా, చంద్రబాబు అడిగినవి యివ్వకుండా ఎలా తిప్పుతున్నారో చూస్తున్నాం కదా, బాబుకి రాష్ట్రంలో ఆబోరు దక్కే అవకాశం లేకుండా చేశారు కదా!

గత చరిత్ర యింత కథ చెప్తూ వుంటే బిజెపి నాయకులు మోదీకి దాన్ని గుర్తు చేసి 'నిదానించు బ్రదర్‌' అనాలి కదా. అన్నారా? లేదు కదా. అని వుంటే ఢిల్లీ ఎన్నికలు మోదీ ఒంటిచేత్తో నిర్వహించేవాడా? ఢిల్లీ ఎన్నికలు ముఖ్యమైనవే. బిజెపి గెలిచివుంటే ఎవరూ పట్టించుకునేవారు కారు. ఇప్పుడు ఘోరంగా ఓడిపోవడంతో ప్రతిపక్షాలు పార్టీ అయిపోయిందని గంతులేస్తున్నాయి. మోదీ అజేయుడు కాడు, గట్టివాడు ఎవడైనా తగలితే చాలడు అనే సందేశం వెళ్లిపోయింది కదా. ఢిల్లీ ఎన్నికల ప్రాముఖ్యత గమనించి పార్టీలో అందరినీ కూర్చోబెట్టి సలహాలు తీసుకోవాల్సింది. బిజెపి ప్రముఖ నాయకుల్లో చాలామంది ఢిల్లీ వాళ్లే. కానీ ఎవర్నీ అడగలేదు. మోదీ, అతని శాంకో పాంజా అమిత్‌ యిద్దరే కూర్చుని అన్నీ చూసుకున్నారు. హర్షవర్ధన్‌ను 2013 ఎన్నికలలో బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి. అలాటి ఆయనతో పార్టీ విధానం గురించి గాని, అభ్యర్థుల ఎంపిక గురించి కానీ, ప్రచారసరళి గురించి కానీ ఏమీ మాట్లాడలేదట. మేం చెప్తాం, నువ్వు అలా చేసుకుపో అని అందర్నీ డమ్మీలను చేశారు. అంతమాత్రం చేత బిజెపి క్యాడరంతా తిరగబడ్డారని, వేరే పార్టీకి ఓటేశారనీ అనడానికి లేదు. అలా వేసి వుంటే దాదాపు 33% ఓట్లు వచ్చేవి కావు. వాళ్లు మనసు పెట్టి పనిచేయలేదంతే. 

జనసంఘ్‌ రోజుల నుండి ఢిల్లీ బిజెపికి కంచుకోటగా వుండేది. దేశవిభజనలో నష్టపోయిన పంజాబీలు 1947లో ఢిల్లీకి వచ్చిపడ్డారు. ముస్లిం వ్యతిరేకత వారిలో నరనరాలా పాకిపోయింది. వారికి తొలిరోజుల్లో హిందూమహాసభ, తర్వాతి రోజుల్లో జనసంఘ్‌ తమను ఆదుకునే పార్టీలుగా అనిపించాయి. అందుకే వాటికి కోర్‌ సపోర్టర్లుగా యిప్పటికీ నిలిచారు. ఢిల్లీ బిజెపి నాయకుల్లో చాలామంది పంజాబీలే. కష్టించే స్వభావం వలన పంజాబీలు బాగా పైకి వచ్చారు. ఢిల్లీ మొత్తాన్ని డామినేట్‌ చేశారు. కొన్నాళ్లకు ఢిల్లీలోని హరియాణా, యుపి వాసులకు యిది కంటకంగా తోచింది. ఢిల్లీ పంజాబీ సంస్కృతిని పూర్తిగా లోను కావడం గురించి నీరద్‌ సి. చౌధురి తన ఆత్మకథలో వ్యథ వ్యక్తపరిచారు చూడండి. ఈ కౌంటర్‌ ఫోర్స్‌ కాంగ్రెసుకు వెన్నుదన్నుగా నిలిచింది.  ఇప్పుడు అది ఆప్‌కు మళ్లింది. కిరణ్‌ బేదీని బిజెపి అభ్యర్థిగా నిలపడంలో యీ పంజాబీ కోణం కూడా వుంది. పార్లమెంటు ఎన్నికలలో కూడా పంజాబీ ఖత్రీలు, జాట్‌లు, ఓబిసి ( మోదీ బిసి)  బిజెపికి ఓటేశారని గణాంకాలు తెలిపాయి. ఈసారి మోదీ అభ్యర్థి కాదు కాబట్టి, ఓబిసిలు ఆప్‌కు వెళ్లిపోయి వుండవచ్చు. హరియాణా నుంచి వచ్చిన జాట్‌లను భూ సేకరణ చట్టం  అడలగొట్టిందట. ఆ చట్టం ద్వారా యుపి, హరియాణాలలోని తమ భూములు లాక్కుంటారని భయపడి అందువలన వాళ్లంతా ఆప్‌కు వేశారట. మోదీ సర్కారు ఏర్పడ్డాక హిందూత్వ సంస్థలను అదుపు చేయకపోవడం, మంత్రులు సైతం యిష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎక్కువైంది. గాడ్సే కీర్తన, లవ్‌ జిహాద్‌, హరామ్‌ జాదే.. ఒకటా రెండా? హిందూ వనితలు నలుగురేసి పిల్లలను కనాలన్న వ్యాఖ్యపై మీరేమంటారు అని మహిళా ఓటర్లు కిరణ్‌ బేదీని అడిగితే ఆమె మౌనం వహించింది. 

నిజానికి ఆమెకు కూడా మోదీ-అమిత్‌ ప్రసంగాలు నచ్చి వుండవు. మోదీ – అరవింద్‌ నక్సలైట్‌, అరాచకవాది అంటే అమిత్‌షా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు యిచ్చిన యింటర్వ్యూలో – కేజ్రీవాల్‌ను ప్రజలు కొట్టి చంపేవారు అన్నాడు. ఇలా మాట్లాడి అరవింద్‌పై అందరూ జాలిపడేట్లా చేశారు. ప్రజల స్వభావం ఎలా వుంటుందంటే ఎప్పుడూ అండర్‌డాగ్‌ పక్షం వహిస్తారు. సైకిల్‌, కారు గుద్దుకుంటే సైకిలు వాడిది తప్పయినా వాణ్నే వెనకేసుకుని వస్తారు. పార్లమెంటు ఎన్నికలలో మోదీ అండర్‌డాగ్‌, మనలో ఒకడైన చాయ్‌వాలా. రాహుల్‌ గొప్పింటి బిడ్డ. అందుకని మోదీని గెలిపించారు. ఇంటర్వల్‌ తర్వాత మోదీ యిప్పుడు సూట్‌వాలా, అరవింద్‌ మఫ్లర్‌వాలా. పాపం రిపబ్లిక్‌ డే పెరేడ్‌కు పిలుపు కూడా రానివాడు. ప్రచారం చేసుకోవడానికి డబ్బు కూడా లేనివాడు. అతనిపై జాలితో 2013లో 25 వేలు వున్న ఆప్‌ వాలంటీర్లు యిప్పుడు రెట్టింపయ్యారు. డబ్బు తీసుకోకుండా పనిచేశారు. 

మోదీలో హుందాతనం పూర్తిగా లోపించింది. అరవింద్‌ను వెంటాడినట్లు ప్రవర్తించారు. ఎలాగైనా నెగ్గాలనే యావతో మోదీని, బిజెపిని తిట్టిన షాజియా యిల్మీని బిజెపిలో చేర్చుకున్నారు. ఓడిపోయింది. కాంగ్రెసు నుంచి తీసుకుని వచ్చిన దళిత నేత కృష్ణ తీరథ్‌ కూడా ఓడిపోయింది. ఓటర్లలో 45% మహిళలు కాబట్టి కిరణ్‌ బేదీ ఆ ఓట్లు పొందుతుందని లెక్క వేసి పోలింగు మూడు వారాలు వుందనగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కానీ కిరణ్‌ పంజాబీ మూలాలు ఓటర్లలో 24% వున్న పూర్వాంచల్‌ వాసులకు నచ్చలేదు. పోలీసు అధికారిణి సిఎం అవుతారనేసరికి కార్మికులు, శ్రామికులు, చిన్న దుకాణదారులు భయపడ్డారు. 15 వేల నుంచి 25 వేల దాకా ఆర్జించే గ్రూపు 20% వున్నారు. వీరు అక్రమ కాలనీల్లో వుంటారు. కిరణ్‌ బేదీ కూల్చేస్తుందని భయపడ్డారు. ఫలితాలు వెలువడ్డాక కిరణ్‌ తన స్టేటుమెంట్లు మార్చడం చూస్తే అర్థమైంది – ఆమె రాజకీయాలకు పనికి రాదని. నేను ఓడిపోలేదు, పార్టీ ఓడిపోయింది అంటోంది. మళ్లీ మోదీని నిరాశ పరిచాను, సారీ అంటోంది. అంటే ఆమె మోదీకే జవాబుదారీ, పార్టీకి కాదన్నమాట!

బిజెపి ఓడిపోలేదు, దాని కోర్‌ ఓటర్లు దానితోనే వున్నారుగా అని వాదిస్తే భవిష్యత్తులోనూ ఫలితాలు యిలాగే వస్తాయి. తటస్థులను ఆకట్టుకుంటేనే గట్టెక్కుతారు, లేకపోతే మునిగిపోవడమే. ఈ తటస్థులు సాధారణంగా జాలిగుండెతో వుంటారు. వీపు మీద దెబ్బేసి వదిలేస్తూ వుంటారు. కానీ యీసారి ఢిల్లీ ఓటరు కసి కొద్దీ గుప్పిలి బిగించి బిజెపిని కడుపులో గుద్దాడు. సర్వం తానెయై వ్యవహరించిన మోదీ బాధతో విలవిల్లాడుతున్నారు. అమిత్‌ షా కొడుకు పెళ్లికి కూడా హాజరు కాలేదు. పెళ్లిలో బాణసంచా గట్రా కాన్సిల్‌ చేశారు. గవర్నర్ల సమావేశంలో కూడా మోదీ ముభావంగా వున్నారట. దీనితో బిజెపి కథ అంతమై పోయిందని ఎవరూ అనుకోలేరు. టైమ్లీ వార్నింగ్‌ అందినందుకు బిజెపి సంతోషించాలి. పార్టీలో అధికార వికేంద్రీకరణ జరగాలని, బహుళనాయకత్వం సిద్ధాంతం మళ్లీ అమలు కావాలని, కార్పోరేట్‌కు, విదేశీయులకు దాసోహమంటోందన్న భావాన్ని తొలగించాలని, హిందూత్వ శక్తులను అదుపు చేయాలనీ, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోలు ధరలను తగ్గించి, తద్వారా మొత్తం ధరలు తగ్గేట్లా చేయాలనీ, ఆర్డినెన్సులు ఆపి అఖిలపక్షసమావేశాలను ఏర్పరచి యితర పార్టీలనూ సంప్రదించాలని, అన్ని రాష్ట్రాలనూ పక్షపాతరహితంగా చూసి స్థానిక బిజెపి నాయకులు కూడా ఎదిగేట్లు చేయాలనీ – బిజెపి పార్టీ సభ్యులందరూ తీర్మానాలు చేసి మోదీకి కళ్లెం వేయవలసిన తరుణం వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కనబడుతున్న ఒక్క మొగాడు – మోదీయే! అతన్ని సరిదిద్దుకుని సవ్యంగా వాడుకోవాలి. దేశప్రజల సంక్షేమం దృష్ట్యానైనా, బిజెపి కార్యకర్తలు యీ పని చేయాలి. స్టాలిన్‌ రోజుల్లోలాగ, హిట్లర్‌ రోజుల్లోలాగ మోదీ తమను సిబిఐ ద్వారా బెదిరిస్తాడనో, ఇన్‌కమ్‌టాక్స్‌ వారిని ఉసిగొల్పుతాడేమోననో భయపడితే వారికే కాదు, దేశానికే అరిష్టం. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click here For Part-1

Click here For Part-2

Click here For Part-3