సినిమా రివ్యూ: పైసా

రివ్యూ: పైసా రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: ఎల్లో ఫ్లవర్స్‌ తారాగణం: నాని, క్యాథరీన్‌, సిద్ధిక, చరణ్‌రాజ్‌, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్‌, ఆర్‌.కె తదితరులు సంగీతం: సాయి కార్తీక్‌ కూర్పు: త్యాగు ఛాయాగ్రహణం: సంతోష్‌…

రివ్యూ: పైసా
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఎల్లో ఫ్లవర్స్‌
తారాగణం: నాని, క్యాథరీన్‌, సిద్ధిక, చరణ్‌రాజ్‌, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్‌, ఆర్‌.కె తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: త్యాగు
ఛాయాగ్రహణం: సంతోష్‌ రాయ్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2014

కృష్ణవంశీ గత చిత్రాలు నిరాశ పరిచినా కానీ సినీ ప్రియులకి అతని ప్రతి సినిమాపై ఆసక్తి అయితే తప్పక కలిగి తీరుతుంది. రొటీన్‌ సినిమాలు తీసేందుకు ఇష్టపడని కృష్ణవంశీ కష్టకాలంలో కూడా ఫార్ములాని, మాస్‌ మసాలాని నమ్ముకోలేదు. ‘పైసా’ కూడా కృష్ణవంశీ విలక్షణతకి అద్దం పట్టే చిత్రమే. ఇందులోను కృష్ణవంశీ తన ప్రత్యేక ముద్ర చాటుకునే కాన్సెప్ట్‌ని ఎంచుకుని, దానిని తనదైన శైలిలో చిత్రీకరించాడు. అయితే ఎందుకో అతని సినిమాలు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో విఫలమవుతున్నాయి. పైసా కూడా ఆ బాపతు సినిమానే…

కథేంటి?

కోటి రూపాయలుంటే జీవితంలో సెటిలైపోవచ్చు అనుకునే ప్రకాష్‌ (నాని) పాతబస్తీలో ఒక టైలరింగ్‌ షాప్‌కి మోడల్‌గా పొట్ట పోసుకుంటుంటాడు. అదే షాపులో పని చేసే ముస్లిమ్‌ యువతి నూర్‌కి (క్యాథరీన్‌) ప్రకాష్‌ అంటే పిచ్చి. వాళ్ల షాప్‌లో గాగ్రా కుట్టించుకోవడానికి వచ్చిన మినిస్టర్‌ సన్యాసి నాయుడు (చరణ్‌రాజ్‌) కూతురు స్వీటీ (సిద్ధిక) ప్రకాష్‌కి ఫ్రెండ్‌ అవుతుంది. ప్రకాష్‌ ఆమెకి క్లోజ్‌ అయిపోతున్నాడనే బాధతో నూర్‌ ఒక దుబాయ్‌ సేఠ్‌ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆమెని అక్కడ్నుంచి కాపాడి తీసుకొస్తూ ప్రకాష్‌, అతని స్నేహితులు ఒక ఇన్నోవా తీసుకొచ్చేస్తారు. ఆ ఇన్నోవాలో సన్యాసి నాయుడుకి సంబంధించిన యాభై కోట్ల రూపాయలుంటాయి. ఇక ఆ డబ్బు కోసం ఛేజ్‌ స్టార్ట్‌ అవుతుంది. 

కళాకారుల పనితీరు!

కృష్ణవంశీ సినిమాల్లో హీరోలు మంచి పర్‌ఫార్మెన్స్‌ ఇస్తారనే పేరుంది. నాని మంచి నటుడనే సంగతి తెలిసిందే. అతడి ప్రతిభని కృష్ణవంశీ బాగా వాడుకున్నాడు. ప్రకాష్‌ పాత్రకి నాని జీవం పోసాడు. అతని టాలెంట్‌ ఏమిటనేది తెలియడానికి… డబ్బు మొదటిసారి కార్‌ డిక్కీలో చూసినప్పుడు అతని పర్‌ఫార్మెన్స్‌ చూస్తే చాలు. ప్రకాష్‌రాజ్‌ చేయాల్సిన క్యారెక్టర్‌ని చరణ్‌రాజ్‌కి ఇచ్చారు. అతను ఆ పాత్రలో పూర్తిగా తేలిపోయాడు. క్యాథరీన్‌కి ఎక్కువ సీన్‌ లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. సిద్ధికతో ‘మంచు లక్ష్మి’ యాక్సెంట్‌లో మాట్లాడించారు. ఆమె క్యారెక్టర్‌ ఒకింత విసిగిస్తుంది. రాజా రవీంద్ర క్యారెక్టర్‌కి బిల్డప్‌ ఎక్కువ ఇచ్చినా అతని పర్‌ఫార్మెన్స్‌ వీక్‌గా ఉంది. 

సాంకేతిక వర్గం పనితీరు:

సాయి కార్తీక్‌ పాటల కంటే నేపథ్య సంగీతం ఈ చిత్రంలో కీ రోల్‌ ప్లే చేసింది. పలు సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. కృష్ణవంశీ అతనితో రెట్రో స్టయిల్‌ మ్యూజిక్‌ (క్వెంటిన్‌ టరంటీనో ఇన్‌స్పిరేషన్‌) చేయించుకున్నాడు. సాంగ్స్‌ అన్నీ సినిమాకి స్పీడ్‌ బ్రేకర్స్‌ అయ్యాయి. ఇలాంటి సినిమాలకి పాటల అవసరం అస్సల్లేదు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే రెండు, మూడు పాటలతో కానిచ్చేస్తే ఫ్లోని డిస్టర్బ్‌ చేయవు. సాంగ్‌ ప్లేస్‌మెంట్స్‌ కూడా సరిగా కుదర్లేదందుకే. 

కృష్ణవంశీ ఈ చిత్రానికి సంభాషణలు తనే రాసుకున్నాడు. ‘కడుపుకి మించిన ఆకలి, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు… అరగవు’లాంటి సంభాషణలతో పాటు… ‘ప్రేమ, పెళ్లి, జీవితం’ గురించి నాని (తాగి) మాట్లాడే సన్నివేశంలోని తత్వం.. మెప్పిస్తాయి. కృష్ణవంశీ సినిమాల్లో క్లోజప్‌ షాట్స్‌ ఎక్కువగానే ఉంటాయి. ఈ సినిమాలో అవి మోతాదు మించిపోయాయి. దానికి తోడు కొన్ని కెమెరా యాంగిల్స్‌ మరీ ఇబ్బంది పెట్టాయి. ఆమధ్య రామ్‌గోపాల్‌వర్మ ‘డిపార్ట్‌మెంట్‌’, ‘నాట్‌ ఏ లవ్‌స్టోరీ’, ‘అప్పల్రాజు’ తదితర చిత్రాల్లో ఇలాంటి కెమెరా యాంగిల్స్‌తోనే హింస పెట్టాడు. ఫస్టాఫ్‌లో సీన్‌ ప్లేస్‌మెంట్స్‌ పరంగా ఎడిటింగ్‌ లోపాలు కనిపించాయి. హీరో హీరోయిన్స్‌ ట్రాక్‌… ఫిఫ్టీ క్రోర్స్‌ ట్రాక్‌ ప్యారలల్‌గా రన్‌ చేయడంలో విఫలమవడం వలన అసలు కథని వదిలేసి అనవసరపు సొద ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. 

కృష్ణవంశీ గత చిత్రం ‘మొగుడు’తో పోలిస్తే ఖచ్చితంగా ‘పైసా’ బెటర్‌ ప్రోడక్ట్‌. ఇంకా చెప్పాలంటే ఆనాటి ‘క్రియేటివ్‌ డైరెక్టర్‌’ కృష్ణవంశీ అప్పుడప్పుడూ అలా మెరిసి మాయమయ్యాడు కూడా. కృష్ణవంశీ సినిమాలు సాధిస్తున్న ఫలితాల వలన అతని పని అయిపోయిందనే భావన ఎక్కువైంది. కానీ ఇంకా తనలో ఆనాటి ‘గొప్ప దర్శకుడు’ ఎక్కడో నిద్రావస్థలో ఉన్నాడని ఈ చిత్రం చూస్తుంటే అనిపిస్తుంది. అప్పుడప్పుడూ అతడు మేలుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఈమధ్య కృష్ణవంశీ చిత్రాల్లో తాండవిస్తోన్న ‘అతి’ అతడిని లేవనివ్వలేదు. ‘నీతో ఏదో అందామనిపిస్తోంది..’ పాట చిత్రీకరణలో కృష్ణవంశీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

హైలైట్స్‌:

  • నాని పర్‌ఫార్మెన్స్‌
  • క్యాష్‌ నాని చేతికి వచ్చే సీన్స్‌
  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

డ్రాబ్యాక్స్‌:

  •  సినిమాటోగ్రఫీ
  •  స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

అనుకోకుండా మీకో లక్ష రూపాయల నోట్ల కట్ట దొరికిందనుకోండి. అప్పుడెలా ఫీలవుతారు? కాళ్లు, చేతులు వణుకుతాయి. తీసుకుందామా, వద్దా అనే మీమాంసలో పడి మైండ్‌ కొట్టుమిట్టాడుతుంది. వదిలేసి ముందుకెళ్లాలా… వెంట తీసుకుని పోవాలా అంటూ పాదాలు అటూ ఇటూ తచ్చాడుతాయి. ఎంత అవసరం అయినా కానీ మనది కాని డబ్బుని మనం తీసుకోవాలంటే ‘కాన్‌సైన్స్‌’ ఉన్న ప్రతి ఒక్కరికీ అది ఖచ్చితంగా ఇబ్బందికర స్థితే. ఇలాంటి సీనే ఈ సినిమాలో ఉంది. దానిని కృష్ణవంశీ ఎంత బాగా తీసాడంటే… విజిల్స్‌ వేసి, క్లాప్స్‌ కొట్టకపోయినా కానీ మనసులో అయినా తప్పక మెచ్చుకుని తీరే సన్నివేశం. నాని కూడా ఆ సీన్‌లో చాలా చాలా బాగా నటించాడు. దురదృష్టవశాత్తూ… ‘పైసా’లో ఇలాంటి సన్నివేశాలు, ఇంతగా మెచ్చుకునే సందర్భాలు ఎక్కువ లేవు. 

సింపుల్‌గా చెప్పుకుంటే ఒక క్రైమ్‌ కామెడీ కథ ఇది. కానీ అందులోకి రకరకాల ఎలిమెంట్స్‌ని తీసుకొచ్చి క్లమ్జీ చేసి పారేసారు. పొలిటీషియన్స్‌, కిరాయి హంతకులు, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు… ఇలా వివిధ క్యారెక్టర్లు చొరబడి కథ అంతా కంగాళీ అయిపోతుంది. ఈమధ్యలో మళ్లీ ఒక లవ్‌ ట్రాక్‌ కూడా. దానికి మళ్లీ ఒక కోణం (ట్రయాంగిల్‌) ఎక్స్‌ట్రా! అసలు కథ ఎప్పుడో సినిమా మొదలైన గంటగ్గానీ ట్రాకెక్కదు. అందాకా కొసరు కథ అంతగా ఎంటర్‌టైన్‌ చేయదు. ముసలి దుబాయ్‌ సేఠ్‌లు వచ్చి పాతబస్తీలో పేద ముస్లిమ్‌ యువతుల్ని పెళ్లి చేసుకుని తీసుకుపోవడం.. పదికీ, పాతికకి హత్యలు చేసేసే బాల నేరస్థుల ఉదంతం… వగైరా ‘క్రైమ్‌ వాచ్‌’ సీన్స్‌ని కూడా ఈ క్రైమ్‌ కామెడీలోకి కృష్ణవంశీ బలవంతంగా ఇరికించేసాడు. 

కాళ్ల సందుల్లో, టీ ట్రేల్లో కెమెరాలు పెట్టడంలాంటి రోగ్‌ మెథడాలజీతో సినిమాటోగ్రఫీ కొన్ని సందర్భాల్లో ఇరిటేట్‌ చేస్తుంటుంది. అయినా కానీ క్యాష్‌తో ఉన్న కార్‌ని నాని అండ్‌ కో తీసుకుపోవడం దగ్గర్నుంచి… దానిని తిరిగి తీసుకొచ్చి ఒక చోట భద్రపరిచే వరకు ఉన్న సీన్స్‌ అన్నీ గ్రిప్పింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడం వల్ల ‘పైసా’ కొంతవరకు శాటిస్‌ఫై చేస్తుంది. అదే గ్రిప్‌ చివరంటా మెయింటైన్‌ చేసినట్టయితే ‘పైసా’ ఖచ్చితంగా పైసా వసూల్‌ అయిపోయి ఉండేది. కానీ ఎక్కడైతే ఒడిసి పట్టాలో అక్కదే వదులైపోవడంతో… ‘పైసా’ పతాక సన్నివేశం చేరుకునే కొద్దీ పలుచబడిపోయింది. మొత్తం మూడు గ్రూపులు కలిసి ఆ మీటింగ్‌ పెట్టుకోవడమనే క్లయిమాక్స్‌ సీన్‌ ఏదైతే ఉందో… అది కామెడీ కోసం అనుకోమంటే కృష్ణవంశీగారికో నమస్కారం. 

ప్రతి సినిమాలో హీరో గుడ్‌ క్యారెక్టర్‌ అయి ఉండాల్సిన రూల్‌ లేదు. ముందు నెగెటివ్‌ మైండ్‌ సెట్‌ ఉన్నవాడు సడన్‌గా మారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చివర్లో ప్రకాష్‌ క్యారెక్టర్‌లో పరివర్తన తీసుకురావడం పాత్రోచితంగా లేనే లేదు. అతను మారిపోయి అప్పటికప్పుడు సంఘ సంస్కరణ చేసేయడం అనేది ఫోర్స్‌డ్‌గా ఉంది కానీ బిలీవబుల్‌గా లేదు. సినిమాలో పాత్రలు నిజజీవితానికి దగ్గరగా ఉండాలని తపించే కృష్ణవంశీ తన హీరోని సగటు మనిషిలానే మిగిల్చేసి ఉంటే బాగుండేది… అలా ఉన్నపళంగా హీరోని చేసేయకుండా. 

కృష్ణవంశీ బోల్డ్‌నెస్‌ని మాత్రం మెచ్చుకుని తీరాలి. చాలా పార్టీలపై అతను డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసినట్టున్నాడు (డైలాగ్స్‌ సెన్సార్‌ కోతకి గురైపోయాయి). అలాగే కొన్ని దుష్ట పాత్రల్ని చూస్తే కొందరు రాజకీయ నాయకులనే సంగతి రిజిష్టర్‌ అవుతుంది. పాతబస్తీని చాలా నేచురల్‌గా, ఎఫెక్టివ్‌గా చూపించిన కృష్ణవంశీ… అక్కడ రెడ్‌లైట్‌ ఏరియాలున్నాయనే దానిని కూడా హైలైట్‌ చేసాడు. కృష్ణవంశీలోని ఆ డేరింగ్‌ ఫిలింమేకర్‌ కాస్త ఆ నిద్రావస్థ నుంచి బయటపడి పూర్తి స్థాయిలో తన ప్రతిభ చూపిస్తే ఇప్పటికీ తననుంచి మంచి చిత్రాలు రావడానికి ఆస్కారముంది. పైసాతో సగం మేలుకున్న కృష్ణవంశీ.. త్వరలోనే పూర్తిగా ఎటెన్షన్‌లోకి వచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫార్ములాకి అతీతంగా వెళ్లి కూడా సగటు ప్రేక్షకుడి నాడి పట్టగల దర్శకులకి ఇప్పుడు కొరత బాగా ఉంది.

బోటమ్‌ లైన్‌: ‘పైసా’ చెల్లిపోయేదే కానీ… ‘చిల్లు’ పడింది!

-జి.కె