సినిమా రివ్యూ: ఎవడు

రివ్యూ: ఎవడు రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తారాగణం: రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయికుమార్‌, శృతిహాసన్‌, కాజల్‌, ఏమీ జాక్సన్‌, జయసుధ, బ్రహ్మానందం, రాహుల్‌దేవ్‌, కోట శ్రీనివాసరావు తదితరులు కథ:…

రివ్యూ: ఎవడు
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయికుమార్‌, శృతిహాసన్‌, కాజల్‌, ఏమీ జాక్సన్‌, జయసుధ, బ్రహ్మానందం, రాహుల్‌దేవ్‌, కోట శ్రీనివాసరావు తదితరులు
కథ: వక్కంతం వంశీ
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: సి. రామ్‌ ప్రసాద్‌
నిర్మాత: రాజు
కథనం, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: జనవరి 12, 2014

ఎప్పుడో గత ఏడాది జులై 31న విడుదల కావాల్సిన ‘ఎవడు’ ఈ సంక్రాంతికి రిలీజ్‌ అయింది. అప్పుడు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల వాయిదా వేసిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి తగిన తరుణం కోసం చూసీ, చూసీ చివరిగా ఇప్పుడు రిలీజ్‌ చేసారు. రామ్‌ చరణ్‌ హీరోగా, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ప్రత్యేక పాత్ర చేయడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విడుదల లేట్‌ అయినా కానీ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి కావాల్సిన అంశాలు నిండా ఉండడంతో ‘ఎవడు’కి ఘన స్వాగతం లభించింది. మరి ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు, మెప్పించే లక్షణాలు ఉన్నాయా? 

కథేంటి?

చరణ్‌ (రామ్‌ చరణ్‌) ఓ కాలేజ్‌ స్టూడెంట్‌. తన స్నేహితుడు ఉండే ఒక కాలనీని కబ్జా చేద్దామని చూస్తున్న ధర్మాకి (సాయికుమార్‌) ఎదురు తిరుగుతాడు. ఆ కాలనీకి అండగా నిలబడతాడు. తన ఆధిపత్యం కొనసాగాలంటే చరణ్‌ని చంపడమే మార్గమని భావించిన ధర్మా అతడిని చంపేస్తాడు. తన కళ్లెదుటే చనిపోయిన చరణ్‌ తిరిగొచ్చి ధర్మాకి షాక్‌ ఇస్తాడు. అతడిని తుదముట్టిస్తాడు. ఈ కథ మధ్యలోని మిస్సింగ్‌ లింక్‌ ‘ఎవడు’కి కీ ఎలిమెంట్‌. 

కళాకారుల పనితీరు!

రామ్‌ చరణ్‌ నటుడిగా పరిణితి కోసం ప్రయత్నించడం లేదు. నటుడిగా తనని పరీక్షించే పాత్రల జోలికి వెళ్లడం లేదు. ఆరెంజ్‌ పరాజయం పాలవడంతో అతను పూర్తిగా సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి… అన్నీ కమర్షియల్‌ సినిమాలే చేస్తున్నాడు. రచ్చ, నాయక్‌ తర్వాత అతని నుంచి వచ్చిన మరో ఫార్ములా సినిమా ఇది. ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా నటించాడు. ఫ్రీడమ్‌ సాంగ్‌లో డాన్స్‌లతో దుమ్ము రేపేసాడు. ఫైట్స్‌లో ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌ బెటర్‌ చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నట్టు లేదు. రచ్చ, నాయక్‌ తర్వాత ఎవడుతో మరోసారి ఫార్ములాని నమ్ముకున్న చరణ్‌ దీనిని బ్రేక్‌ చేసి బయటకి రావాల్సిన అవసరముంది. కృష్ణవంశీతో చేస్తున్న సినిమా అతనికి అలా హెల్ప్‌ అవుతుందేమో చూడాలి.

అల్లు అర్జున్‌ ఉన్నది కాసేపే అయినా తన ముద్ర వేసాడు. ఆ ఫైట్‌ సీన్‌లో కావాల్సిన ఫోర్స్‌తో పాటు లవర్‌ చనిపోతున్న సీన్‌లో ఎమోషన్‌ పండించాడు. సాయికుమార్‌ ఈ పాత్ర విషయంలో బాగా ఎక్సయిట్‌ అయ్యాడు. ఓ పెద్ద సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించాననే ఆనందమే అయి ఉండాలి తప్ప ఈ పాత్ర అంత గొప్పగా ఏమీ లేదు. రొటీన్‌ క్యారెక్టరే కానీ సాయికుమార్‌ తన నటనతో దానికి వన్నె తెచ్చాడు. అతని పక్కన నిలబడి సలహాలిచ్చే పాత్రలో కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో అలరించారు. జయసుధ ఈ చిత్రానికి హైలైట్స్‌లో ఒకరిగా నిలిచారు. బ్రహ్మానందం ఉన్నా కానీ ఉపయోగించుకున్నది తక్కువ. హీరోయిన్స్‌లో శృతిహాసన్‌కి రెండు పాటలు, ఏమీకి ఒక పాట, కాజల్‌కి ఒక కీలక సన్నివేశం ఇచ్చారు. కాజల్‌ బాగా చేసింది. శృతి ఓకే. ఏమీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు… చూడ్డానికో బీచ్‌ సాంగ్‌ తప్ప! రాహుల్‌దేవ్‌, సుప్రీత్‌, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులంతా ఇంతకుముందు చేసిన పాత్రలే మళ్లీ చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. ఆడియో పరంగా సోసో సాంగ్స్‌ ఇచ్చినా కానీ ఆ లోటుని అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కవర్‌ చేసాడు. ఇలాంటి మాస్‌ సినిమాలకి మణిశర్మ నేపథ్య సంగీతంతో ప్రాణం పోసేవాడు. దేవిశ్రీప్రసాద్‌ కూడా తన పవర్‌ ఏంటో ఈ సినిమాలో చూపించాడు. అబ్బూరి రవి రాసిన సంభాషణలు కొన్ని బాగా పేలాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ కూడా ఓకే. ఎక్కడా నస లేకుండా సినిమా వేగంగా ముందుకి సాగుతుంది. కమర్షియల్‌ సినిమాలు దిల్‌ రాజుకి ఇంతకుముందు కలిసి రాలేదు కానీ ఈసారి ఫార్ములా సరిగ్గానే కుదిరింది. 

వంశీ పైడిపల్లి ఎమోషనల్‌ సీన్స్‌ని బాగా హ్యాండిల్‌ చేసాడు. హీరో, విలన్‌ ఎదురెదురు పడ్డాక అతనిలోని దర్శకుడు కదం తొక్కాడు. ఫస్టాఫ్‌లో మరీ ఫ్లాట్‌ నెరేషన్‌తో కేవలం ట్విస్టులు, కథావస్తువు మీద ఆధారపడిపోయాడా అనే అనుమానం కలిగించినా, ద్వితీయార్థంలో దర్శకుడిని గుర్తించేట్టు చేసాడు. 

హైలైట్స్‌:

  • ఫ్రీడమ్‌ సాంగ్‌
  • బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
  • చరణ్‌, సాయికుమార్‌ కాన్‌ఫ్రంటేషన్‌ సీన్స్‌
  • జయసుధ క్యారెక్టర్‌

డ్రాబ్యాక్స్‌:

  •  రొటీన్‌ ట్రీట్‌మెంట్‌
  •  ఫ్లాట్‌ ఫస్ట్‌ హాఫ్‌
  •  వీక్‌ కామెడీ

విశ్లేషణ:

ఈ చిత్రంలోని స్టోరీ పాయింట్‌ని ‘ఫేస్‌ ఆఫ్‌’ అనే ఆంగ్ల చిత్రం నుంచి ఇన్‌స్పయిర్‌ అయ్యారు. ఆ పాయింట్‌తో ఫక్తు తెలుగు సినిమా కమర్షియల్‌ ఫార్ములాకి అనుగుణంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. ఒకింత సాహసమే ఇది. ఎందుకంటే ఆ పాయింట్‌ గురించి ఎక్కువ ఆలోచిస్తే ఇది అసలు లాజిక్‌ పరంగా సాధ్యమేనా అనే అనుమానాలొస్తాయి. వాటి జోలికి అంతగా పోకుండా సినిమా చూసేలా చేయడమే దర్శకుడిపై ఉన్న అతి పెద్ద భారం, బాధ్యత. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి అవసరమైన చోట వేగాన్ని జోడించాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఫ్రీడమ్‌ సాంగ్‌ నుంచి చరణ్‌ కిల్లింగ్‌ సీన్‌ వరకు టెంపో మెయింటైన్‌ చేసాడు. 

ఈ ప్రాసెస్‌లో ఎన్నెన్నో మూస సన్నివేశాలు. ఇంతకుముందు ప్రతి సీన్‌ని కనీసం పదేసి సినిమాల్లో చూసిన జ్ఞాపకాలు వెంటాడతాయి. అయితే అంతగా వాడేసిన సీన్లని కూడా మరోసారి మాస్‌ ఆడియన్స్‌ చేత విజిల్స్‌ కొట్టించేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఫ్రీడమ్‌ సాంగ్‌, కాలనీలో జర్నలిస్ట్‌ హత్య, చరణ్‌ స్నేహితుడి తిరుగుబాటు, చరణ్‌ విలన్‌ ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇవ్వడం, ఆ తర్వాత చరణ్‌ తల్లి జయసుధ దగ్గరకి వచ్చి విలన్‌ షాక్‌ తినడం… ఆపై కాలనీ వాసులు అందరిలో తిరుగుబాటు రావడం… ఇదంతా ఫక్తు కమర్షియల్‌ సినిమా లెక్కల్లో చాలా వేగంగా నడిచిపోతుంది. నిజానికి చరణ్‌ ఇలాంటి సీన్లే ‘నాయక్‌’లోను చేసాడు. ఈ పార్ట్‌ చూస్తుంటే ‘నాయక్‌’లోని కోల్‌కతా ఎపిసోడ్‌ గుర్తుకొస్తుంది. అయినా కానీ దేవిశ్రీప్రసాద్‌ నేపథ్య సంగీతం, దర్శకుడు వంశీ పైడిపల్లి టేకింగ్‌తో రావాల్సిన, కావాల్సిన ఇంపాక్ట్‌ వచ్చింది. 

ఇలాంటి సినిమాకి కీలకమైన కామెడీ వీక్‌గా ఉంది. కమర్షియల్‌ సినిమాకి రిపీట్‌ వేల్యూ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే కామెడీని మిక్స్‌ చేయడంలో రచయితలు ఫెయిలయ్యారు. అలాగే ప్రథమార్థంలో రివెంజ్‌ డ్రామా మొత్తం కావాలని పొడిగించిన ఫీలింగ్‌ వస్తుంది. అంత పగతో రగిలిపోతున్న హీరో అంత తాపీగా రివెంజ్‌ తీర్చుకుంటాడంటే నమ్మబుద్ధి కాదు. ఏమీ జాక్సన్‌ ట్రాక్‌ కూడా ఇరిటేట్‌ చేస్తుంది. ఇంటర్వెల్‌ నుంచి పుంజుకున్న చిత్రం పోస్ట్‌ ఇంటర్వెల్‌ తర్వాత కూడా ఒక నలభై నుంచి యాభై నిముషాల పాటు మంచి గ్రాఫ్‌ మెయింటైన్‌ చేయడంతో పాస్‌ అయిపోయింది. సంక్రాంతి సీజన్‌లో మాస్‌ జనం కోరుకునే అంశాలు ఉండడం, దీనితో పాటు విడుదలైన ‘1’ మన ప్రేక్షకుల అభిరుచికి పూర్తిగా దూరంగా ఉండడం ‘ఎవడు’కి అదనంగా కలిసొస్తాయి. ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తదనం చూపించి ఉన్నట్టయితే ‘ఎవడు’ రేంజ్‌ పెరిగుండేది. కానీ దర్శకుడు సేఫ్‌ గేమ్‌ ఆడడం వల్ల దీని సక్సెస్‌ రేంజ్‌ కూడా రిస్ట్రిక్ట్‌ అవుతుంది. 

బోటమ్‌ లైన్‌: ‘ఎవడు’ లేట్‌ అయినా రైట్‌ టైమ్‌లో వచ్చాడు.

– జి.కె.