ఇవాళ చూస్తే గోదావరి జిల్లాల వాళ్లు కూడా ఉత్తరాలు యిచ్చారట – గోదావరి-తెలంగాణ ఏర్పాటు చేయాలని. భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి జిల్లాకు, అక్కణ్నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు లింకు వుంది కాబట్టి, గోదావరి నది తెలంగాణను, గోదావరి జిల్లాలను కలుపుతోంది కాబట్టి యీ ప్రతిపాదనట. ఇన్నాళ్లూ తెలుగువాళ్లందరూ ఒకటే అన్న థీమ్ మీద సాగింది. ఇప్పుడు హైదరాబాదుతో లింకు కోసం 'మనం మనం బరంపురం' (మీది తెనాలి, మాది తెనాలి ఫ్రేజ్కు యిది మూలరూపం) అని మొదలుపెట్టారు.
జెసి దివాకరరెడ్డి కూడా తెలంగాణతో మా కెంతో అనుబంధం వుంది. వాళ్లకూ బోనాలున్నాయి, మాకూ బోనాలున్నాయి అనసాగారు. ఈ పెద్దమనిషే మొన్నటిదాకా రాష్ట్రం విడిపోతే మమ్మల్ని కర్ణాటకలో కలపండి, మాకు నీటితో సహా అనేక బంధాలు, అనుబంధాలు వున్నాయి అంటూ వచ్చారు. కలుపుకుందామంటే ఎన్ని చుట్టరికాలైనా గుర్తుకు వస్తాయి. వీరిని కలుపుకోవడం యిష్టం లేని తెలంగాణ నాయకులకు యిలాటివేవీ గుర్తుకు రావడం లేదు. 'అడ్డపంచె గాళ్లు, హంతకులు, కబ్జాకోరులు' అంటున్నారు. జెసి వెంటనే 'అబ్బే మేం కత్తులు, కఠార్లు వదిలేశాం, ఆ సంస్కృతి అంతా కృష్ణా, గుంటూర్లకు వెళ్లిపోయింది. ఇంకా కాస్త మిగిలినది కడప వాళ్ల దగ్గరుంది. ఇప్పుడు మనం మనం ఒకటే, ఆ కోస్తా వాళ్లే వేరు' అంటున్నారు.
వింటూంటే ఎంత నీచంగా వుందో మాటల్లో రాయలేం. ఎందుకీ దేబిరింపు? మొన్నటిదాకా అనంతపురం నాయకులు తెలంగాణవాళ్లపై ఎటువంటి మాటలు ప్రయోగించారు? తెలంగాణవాళ్లు అప్పుడూ యిప్పుడు ఎప్పుడూ రాయలసీమ వాళ్లని తిడుతూ, అసలు వాళ్లు వచ్చాకనే తెలంగాణలో కబ్జాలు ప్రారంభమయ్యాయని, మతకలహాలు వచ్చిపడ్డాయని, వాళ్లను దోచుకున్న ముఖ్యమంత్రులందరూ రాయలసీమ వాళ్లేననీ అంటూ వచ్చారు. రాష్ట్రసమైక్యత కోసం అన్ని మాటలు పడినా అదొక అందం, ఆదర్శం. కానీ రాయలసీమలోని తక్కిన రెండు జిల్లాలను కుప్పమీద పడేసి రాయల తెలంగాణ కోసం తపించడం వెనకు స్వార్థం తప్ప వేరే ఏమీ కనబడటం లేదు. ఆ స్వార్థం కూడా తన ప్రాంతప్రజలు బాగు పడతారని కాదు, తన బస్సు వ్యాపారం బాగుండాలని! అది కూడా ఎంత లక్షణంగా సాగుతోందో మొన్నటి వోల్వో వ్యవహారం చాటి చెపుతోంది. జెసి మాట సరే, సమైక్య ఉద్యమం తీవ్రంగా జరిగిన అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజల్లో తిరుగుబాటు ఎందుకు రావడం లేదు? అని అడుగుతున్నారు. ఇప్పుడే పుకార్లని నమ్మి స్పందించడం ఎందుకని ఆగివుండవచ్చు. రెండు నెలలపాటు ఉద్యమం చేసి తడాఖా చూపించారు. ఇప్పుడు ఫైనల్గా బిల్లులో రాయల తెలంగాణ వుంటుందో లేదో తెలియనప్పుడు మళ్లీ సమ్మెలెందుకు? బిల్లు వచ్చాక ఏకంగా మళ్లీ మొదలెడదాం అనుకుని వుండవచ్చు.
ఇంకోలా ఆలోచిస్తే తెలంగాణతో కలవడానికి వాళ్ల లాజిక్ వాళ్లకుండవచ్చు. సీమాంధ్రకు రాజధానిగా కర్నూలు ఎంపిక అవుతుందో లేదో తెలియదు. విజయవాడ, వైజాగ్, ఒంగోలు, తిరుపతి.. యిలా నాలుగైదు ఆప్షన్లలో కర్నూలు కూడా ఒకటి. రాజధాని ఎలాగూ రానపుడు ప్రస్తుతం వున్న రాజధానితో అంటకాగితే సరిపోతుంది కదా. ఏ వైజాగో రాజధాని అయితే దాని కంటె హైదరాబాదే దగ్గర కదా. విజయవాడ, గుంటూరు వాళ్లతో పోటీ పడడం కంటె తెలంగాణలో యిప్పటికే అలవాటైన చోట నెగ్గుకురావడం సులభం కదా. మెహబూబ్ నగర్లో అనేక వ్యాపారాలు కర్నూలు వాళ్లవేనట. కొత్త రాజధానికి డబ్బులు యిస్తారో లేదో తెలియదు. చేతిలో వున్నది వదులుకుని కేంద్రం హామీలు నమ్మి మోసపోవడం దేనికి? అనుకోవచ్చు. పైగా నీళ్లు రావన్న భయం లేదు. తెలంగాణ వాళ్లు తమకు చచ్చినట్టు నీళ్లు యివ్వాల్సిందే!
వీళ్ల లాజిక్ యిలా వుందని కెసియార్కూ తెలుసు. అందుకనే ఆయన రాయల తెలంగాణకు ససేమిరా అంటున్నాడు. 'వాళ్లను మాతో కలుపుకుంటే ఆ జిల్లాలలో కట్టిన ప్రాజెక్టులను మేం చట్టబద్ధం చేయాల్సి వుంటుంది. అలా చేయడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?' అని అడిగాడాయన. అంటే రాయలతెలంగాణ కాకుండా మామూలు తెలంగాణ ఏర్పడితే నీళ్లు ఆపడం తథ్యం అని అర్థమవుతోంది. అంతేకాదు, పోలవరం ముంపు గ్రామాలను కూడా తెలంగాణకు యిచ్చేస్తోంది మంత్రుల ముఠా. పోలవరం ఆపాలన్న తమ డిమాండ్ నెగ్గించుకోవడానికి అక్కడ పునరావాస చర్యలు ప్రారంభించకుండా చూడవచ్చు కెసియార్. అది కట్టే బాధ్యత నాది అని కేంద్రం అంటోంది. వచ్చే ప్రభుత్వం ఏమంటుందో తెలియదు. కేంద్రం పట్టుబట్టినా తెలంగాణ రాష్ట్రం అడ్డుకొట్టవచ్చు. ఒడిశాలాగే ఆ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా చూడవచ్చు. శాంతిభద్రతలు స్టేట్ సబ్జక్ట్ కాబట్టి కేంద్రం ఏమీ చేయలేదు. హైదరాబాదు వరకు అధికారాలు గవర్నరు చేతిలో వుంటాయి కానీ జిల్లాలలో అధికారాలు తెలంగాణ ప్రభుత్వానివే.
కెసియార్ మాట్లాడిన విధానం చూస్తే ఆయన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రతో సఖ్యంగా వుండే లక్షణాలు ఏమీ చూపటం లేదు. 'రాయలసీమ రెండు జిల్లాలు అంటగట్టినా అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి వదిలించేసుకుంటాం' అంటున్నారాయన. అంత సులభమా? అలా అయితే తమకు ఓట్లేయని జిల్లాలన్నిటినీ అసెంబ్లీ తీర్మానాలతో వదిలించేసుకుంటే ఏ పార్టీ కూడా ఎన్నికలలో ఓడిపోదు. హరీష్రావుగారు అసెంబ్లీ తీర్మానం అనటం లేదు కానీ, 13 జిల్లాల జిడ్డు వదిలించుకున్నవాళ్లం 2 జిల్లాలను వదిలించుకోలేక పోతామా? అని ధైర్యంగా అన్నారు. అంటే వాళ్లకు నీళ్లు, నిధులు యివ్వకుండా ఎండగడతారా? అప్పుడు వాళ్లంతట వాళ్లే గోల పెట్టి బయటకు పోతాం అంటారా? అలా అనిపించి అప్పుడు ఆ రెండు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పాస్ చేసి పంపినా కేంద్రం కదలకపోతే వీళ్లు ఏమీ చేయలేదు. విదర్భ బిల్లు, యుపి బిల్లు పాస్ అయి పార్లమెంటులో మగ్గుతున్నాయి. అందుచేత వదిలించుకోవడం వీళ్లు అనేటంత సులభం ఏమీ కాదు. ఇలా యీసడింపుగా మాట్లాడి రాయలసీమ వాళ్లను మరింత రెచ్చగొట్టి సమైక్యం వైపు నిలిచేట్లా చేయడం తప్ప కెసియార్, హరీష్ వీటితో సాధించేది ఏమీ లేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్