నా బలం అతనే: గుత్తా జ్వాల

గుత్తా జ్వాల.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈమెకి, వివాదాలతోనూ చుట్టరికం వుంది. గత కొంతకాలంగా గుత్తా జ్వాల అంటేనే వివాదాలు గుర్తుకొస్తున్నాయి. బ్యాడ్మింటన్‌ గేమ్‌కి సరికొత్త గ్లామర్‌ అద్దిన గుత్తా…

గుత్తా జ్వాల.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈమెకి, వివాదాలతోనూ చుట్టరికం వుంది. గత కొంతకాలంగా గుత్తా జ్వాల అంటేనే వివాదాలు గుర్తుకొస్తున్నాయి. బ్యాడ్మింటన్‌ గేమ్‌కి సరికొత్త గ్లామర్‌ అద్దిన గుత్తా జ్వాల నితిన్‌ సరసన ఓ సినిమాలోనూ నటించింది ఐటమ్‌ డాన్సర్‌గా. డాన్స్‌ రాకపోయినా, కేవలం స్నేహితుడి కోరిక మేరకే ఆ సినిమాలో నటించానని నిర్మొహమాటంగా తనకు డాన్స్‌ రాదన్న విషయాన్ని బయటపెట్టడంలోనే ఆమె డైనమిజం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ విషయమ్మీద అయినా నిర్మొహమాటంగా  మాట్లాడ్డంలో తనకు తానే సాటి అన్పించుకున్న గుత్తా జ్వాల, ఈ మధ్య వివాదాలతో ఎక్కువగా సావాసం చేస్తోంది. బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్వాహకుడు అయిన పుల్లెల గోపీచంద్‌ విషయంలో ఘాటైన ఆరోపణలు చేస్తూ, సెలక్షన్‌ కమిటీనే సవాల్‌ చేయడం ద్వారా ఆమె నిత్యం వార్తల్లో వుంటోంది. ఆటను ఆస్వాదిస్తానంటోన్న గుత్తా జ్వాల, తాను బ్యాడ్మింటన్‌లోకొచ్చింది పబ్లిసిటీ కోసం కాదని తేల్చి చెప్పింది. ఇంకా ఆమె ఏమంటోందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

సెలక్షన్‌ ప్యాన్‌లో వున్న వ్యక్తి అకాడమీ ఎలా నిర్వహిస్తారు?

బ్యాడ్మింటన్‌ కోచ్‌గా అకాడమీ నడుపుతున్న వ్యక్తి, సెలక్షన్‌ ప్యాన్‌లో వుండడం ఎలా నైతికం.? ఈ విషయాన్నే నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను. అది బ్యాడ్మింటన్‌కి మేలు చేయదు, జాతీయ స్థాయిలో ఎంతోమంది ఔత్సాహికులకి అన్యాయం జరిగే ప్రమాదముంది. గోపీచంద్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. బ్యాడ్మింటన్‌ క్రీడకి ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు రావాలంటే, సెలక్షన్‌ కమిటీ విషయంలో చాలా మార్పులుండాలన్నదే నా అభిమతం. ఈ విషయంలో ఎవరేమన్నా నా అభిప్రాయాన్ని మార్చుకోను. ఇదేదో గోపీచంద్‌తో వ్యక్తిగత విభేదాలతో చెబుతున్న మాట కాదు.

ఐబీఎల్‌లో డబుల్స్‌ కూడా వుండాలి

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో నాకు అన్యాయం జరిగింది. కాంట్రాక్ట్‌ విషయంలో అన్యాయం జరగడంతో, దాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది. సింగిల్స్‌తోనే లీగ్‌ నడవడం చాలామంది అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఎక్కువమంది అభిమానులు సింగిల్స్‌కి ఓటేస్తున్నా, డబుల్స్‌ కూడా చూడాలనుకునేవారున్నారు. నెక్స్‌ట్‌ సీజన్‌లో డబుల్స్‌ని జోడిస్తారనే అనుకుంటున్నా. డబుల్స్‌ని ప్రమోట్‌ చేయాల్సిన బాధ్యత ఐబీఎల్‌ నిర్వాహకులపై వుంది.

అతనే నా బలం..

కష్టకాలంలోనూ వెన్నంటే వున్న నా కోచ్‌ ఆరిఫ్‌ నా బలం. తల్లి దండ్రులకన్నా ఎక్కువగా సమయం ఆరిఫ్‌తో గడుపుతున్నాను. ఎంత సేపు ప్రాక్టీస్‌ చేయాలి? అనేది ఆయనే నిర్ణయిస్తారు. నా కెరీర్‌ని ఆయనే డిజైన్‌ చేశారు. 15 ఏళ్ళ నుంచీ ఆయన సూచనల మేరకే బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నాను. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏ విషయమ్మీద అయినా ఖచ్చితమైన అవగాహన వుండాలనేది ఆరిఫ్‌ని చూసే నేర్చుకున్నాను.

సినిమాల్లోకి అనుకోకుండా..

గ్లామర్‌ ప్రపంచం మీద పెద్దగా ఆసక్తి లేదు. అలాగని అయిష్టత కూడా లేదు. అనుకోకుండా ఓ సినిమాలో నటించాల్సి వచ్చిందంతే. షూటింగ్‌ సమయంలో స్నేహితులు వచ్చి, నన్ను అభినందించారు, ఎంకరేజ్‌ చేశారు. ఏమో, మళ్ళీ సినిమాల్లో నటిస్తానో, లేదో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఏదైనా అనుకోకుండా జరగాల్సిందంతే.

ప్రేమలోని గొప్పతనం అదే

అమ్మ, నాన్నలది ప్రేమ వివాహం. అమ్మ చైనీస్‌, నాన్న ఇండియన్‌. ప్రేమ కోసం దేశాన్ని వదిలి వచ్చేసింది. అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది? కుటుంబ విషయాల్ని జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు, వ్యాపార కార్యకలాపాల్నీ దగ్గరుండి చూసుకుంటుంది అమ్మ. దేశమంతా ఎప్పుడూ టూర్లతోనే ఆమెకు సమయం సరిపోతుంది. అలాగని, కుటుంబ విషయాలేవీ పక్కన పెట్టదు. అమ్మే నాకు ఆదర్శనం.