కపిలముని : ‘పార్క్‌వుడ్‌’ పాపం ఉట్టెక్కిందా?

ఒక అమ్మాయి మీద కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితే వారందరికీ ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. భారతజాతి యావత్తూ అది జాతి సాధించిన విజయం లాగా పండగ చేసేసుకుంది. అదే కొందరు అమ్మాయిల మీద పదేపదే…

ఒక అమ్మాయి మీద కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితే వారందరికీ ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. భారతజాతి యావత్తూ అది జాతి సాధించిన విజయం లాగా పండగ చేసేసుకుంది. అదే కొందరు అమ్మాయిల మీద పదేపదే పలుమార్లు అత్యాచారాలకు పాల్పడిన ఒక ధూర్తుడికి మాత్రం కేవలం పదేళ్ల జైలుశిక్షతో సరిపెట్టి.. అది కూడా తాము ఎక్కువ శిక్ష వేసేశాం అన్నట్లుగా ఇప్పుడు బెయిలు ఇచ్చి బాహ్య ప్రపంచంలోకి అనుమతించింది. వికారాబాద్‌లోని పార్క్‌వుడ్‌ పాఠశాల డైరక్టర్‌ మహ్మద్‌ సలావుద్దీన్‌ అయూబ్‌ పాఠశాల విద్యార్థినులపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడుతున్నందుకు నాంపల్లి కోర్టు అతనికి పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ సలావుద్దీన్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఆయన తిరిగి తన అత్యాచారాలు, అరాచకాలను కంటిన్యూ చేసుకోవడానికి మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. 

నిర్భయ అనే ఒక అమ్మాయి మీద, అర్ధరాత్రి బస్సులో ప్రయాణిస్తుండగా.. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పెనగులాటలో ఆమెను బస్సులోంచి కిందకు కూడా తోసేసి చావుకు కారకులయ్యారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తగా సంచలనం సృష్టించింది. పబ్లిసిటీ బాగానే జరిగింది. దేశవ్యాప్తంగా నిర్భయకోసం కొవ్వొత్తుల ప్రదర్శనలు గట్రా చేయడానికి ఉద్యమించిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ జన చైతన్యం అభినందించదగినదే. మొన్నటికి మొన్న మాధాపూర్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని అభయ కారుడ్రైవరు చేతిలో అత్యాచారానికి గురికావడం మరో ఘోరం. ఆమె చనిపోలేదు గనుక.. దేశం యావత్తూ స్పందించలేదు. కానీ హైదరాబాదు వరకు అందరూ బాగానే స్పందించారు. పెద్దఎత్తునే ఉద్యమాలు చేశారు. నిందితుల్ని పట్టుకున్నారు. ప్రస్తుతం కోర్టులో ఉంది. నిర్భయ చట్టం కిందనే కేసు నమోదు అయింది.

అయితే పార్క్‌వుడ్‌ అత్యాచారాల సంగతి ఏమిటి? ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేరిట ఓ విద్యాసంస్థను స్థాపించి డైరెక్టర్‌ అనే ముసుగులో ఓ ధూర్తుడు పాఠశాలలోని అమ్మాయిల మీద  పదేపదే అత్యాచారాలు  చేస్తూ సుదీర్ఘకాలం పాపానికి ఒడిగడుతూ ఉంటే.. అది ఒకనాటికి బయల్పడింది. మన ఖర్మం ఏంటంటే.. అప్పటికి నిర్బయ చట్టాలు లేవు.  ఒక అమ్మాయి మీద పది సార్లు చేసినా.. పది మంది అమ్మాయిల మీద వందల సార్లు చేసినా.. అంతా కలిపి అత్యాచారం కిందికి మాత్రమే వస్తుంది గనుక.. ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. కొన్నాళ్లు గడిచేలోగానే.. కోర్టు విధించిన శిక్ష అక్రమం అని సలావుద్దీన్‌ గారికి గుర్తుకు వచ్చింది. ఆయన ఎంచక్కా హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. పైకోర్టు వారు కేసు సంగతి తర్వాత అన్నట్లుగా ఆయనకు ముందుగా బెయిలు మంజూరు చేసేశారు. 

ఇక్కడ కొంచెం పోల్చిచూడవలసి ఉంది. అమ్మాయి అర్థరాత్రి వేళ ఒంటరిగా దొరికినప్పుడు, దుండగులు తాగి ఉన్నప్పుడు జరిగే అత్యాచారాలకు.. సలావుద్దీన్‌ చేసిన అత్యాచారాల్లో ఏవి గొప్పవి? ఏవి ఎక్కువ శిక్షార్హమైనవి. తొలి రెండు కేసులు కూడా ఆవేశం, అవకాశాన్ని బట్టి జరిగిన అత్యాచారాలు మాత్రమే. బస్సులో నిర్బయ అర్ధరాత్రి ఎక్కకుండా ఉంటే ఆ అత్యాచారం జరిగేది కాదు. హైదరాబాదు అభయ ఖాళీ ట్యాక్సీలో ఒంటరిగా ఎక్కకుండా ఉంటే ఈ అత్యాచారం జరిగేది కాదు. 

కానీ సలావుద్దీన్‌ కేసు వేరే. ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి.. ప్రతి ఏడాది ఇలా అనేక మంది అమ్మాయిలు.. అదీ అభం శుభం తెలియని స్కూలు విద్యార్థినులు.. పాఠశాల డైరక్టర్‌ మాయమాటలకు , ప్రలోభాలకు, లేదా ఒత్తిళ్లకు భయాలకు లొంగిపోయే వారు.. ఇలా సీరియల్‌గా వారు అత్యాచారాలకు గురవుతూనే ఉండాల్సిన పరిస్థితి. 

ఇక్కడ మనం హత్యకేసులో నిందితుడు అయినా తప్పించుకోవచ్చు గానీ.. ఆర్థికనేరగాడు తప్పించుకోరాదనే సుప్రీం కోర్టు నిర్దేశాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ఆర్థిక నేరగాడు చాలా వ్యూహాత్మకంగా, కావాలని, ఉద్దేశపూర్వకంగా నేరం చేస్తాడు గనుక.. అతనికి ఎక్కువ శిక్ష తప్పకుండా పడాలనేది సర్వోన్నత న్యాయస్థానం వారి ఆలోచన. కానీ ఇక్కడ అత్యాచారాల విషయంలో ఏం జరుగుతోంది. క్షణికావేశంలో, అవకాశం దొరికినప్పుడు చేసిన అత్యాచారాలు ఉరిశిక్ష వైపు నడిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఒక నీచుడు పిల్లల మీద నిరంతరాయ అత్యాచారాలు సాగిస్తోంటే వాడు ఎంచక్కా బెయిలు మీద బయటకు వచ్చి.. కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై కోర్టుకు వెళుతున్నాడు. పైకోర్టుకు వెళ్లడం అనేది అతని రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ, ఇలాంటి చీడపురుగుకు బెయిలు ఎలా దక్కుతోందన్నదే ప్రశ్న.

ఇలాంటి వ్యవహారం మీద మహిళా సంఘాలు గానీ, ప్రజా సంఘాలు గానీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్న. సలావుద్దీన్‌ అయూబ్‌ బెయిలు రద్దు చేయడం గురించి ఉద్యమం జరగాలి. సలావుద్దీన్‌ అయూబ్‌ మీద కేసులను హైకోర్టు పున: పరిశీలించే ముందు ఆ కేసులన్నిటినీ నిర్భయ చట్టం కిందికి మార్పు చేసేలా ఉద్యమం జరగాలి. ఏ రేప్‌కు ఎక్కువ పబ్లిసిటీ ఉంటుందో.. ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు నిత్యం ఆరేప్‌ల వెంటబడి ప్రయాణించడం .. తెచ్చిపెట్టుకున్న హాహాకారాలు చేయడం కాదు. ఏ నేరంలో ఎక్కువ ఘోరం ఉందో దానికి తగిన శిక్ష పడడం కోసం ఉద్యమించాలి.

-కపిలముని

[email protected]