రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్‌కి సచిన్ గుడ్ బై చెబుతున్న క్షణాల్ని ఆస్వాదించేందుకు దేశమంతా.. కాదు కాదు, ప్రపంచంలోని సచిన్ అభిమానులంతా టీవీలకు కళ్ళను కట్టేసుకున్నారు. చివరి మ్యాచ్‌ని సచిన్ ఎలా ముగిస్తాడు.? అన్న ఆసక్తి అందరిలోనూ వుంది. సాధారణంగా ఇలాంటి మ్యాచ్‌లను పేలవంగా పలువురు క్రికెటర్లు ముగించారు.
సచిన్ కూడా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకు ఔట్ కావడం, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో, చివరి మ్యాచ్‌పై తీవ్రమైన టెన్షన్ నెలకొంది. అయితే బరిలోకి దిగిన సచిన్, హాఫ్ సెంచరీ బాది, అభిమానులకు టెన్షన్‌ని దూరం చేశాడు. అయితే 74 పరుగుల వద్ద సచిన్ వికెట్ పారేసుకోవడం కొంత నిరాశపర్చింది అభిమానులకి.
సెంచరీ కొట్టి వుంటే సచిన్‌కి చివరి మ్యాచ్ మధురాతిమధురంగా మిగిలిపోయి వుండేదే. సచిన్‌కే కాదు, అభిమానులకీ చివరి మ్యాచ్‌లో సచిన్ సెంచరీ కొట్టడం మధుర జ్ఞాపకంగా మిగిలేది. ఎలాగైతేనేం, గౌరవ ప్రదమైన స్కోర్ చేసి సచిన్ ఔట్ కావడంతో స్టేడియంలో మ్యాచ్‌ని చూస్తున్నవారు, టీవీ సెట్లకు అతుక్కుపోయినవారు కొంచెం నిరాశ కలిగినా, ఎక్కువ సంతృప్తి చెందారు.
సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం దాదాపు లేనట్టే. ఎందుకంటే, భారీ ఆధిక్యం దిశగా టీమిండియా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 200 పరుగులకు పైగానే ఆధిక్యం సంపాదించింది వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో. ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించాడు.