‘మగధీర’ రికార్డులకి మూడింది. ‘అత్తారింటికి దారేది’ టాలీవుడ్లో సరికొత్త రికార్డులు నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ ‘మగధీర’ వసూళ్ళను బ్రేక్ చేసేసిందన్న రిపోర్ట్స్ నాలుగైదు రోజుల నుంచీ వస్తున్నా, అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. అయినప్పటికీ ‘అత్తారింటికి దారేది’ జోరు ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, ఆ సినిమాకి పోటీగా ఇంకే సినిమాలూ రాకపోవడంతో ‘అత్తారింటికి దారేది’ టాలీవుడ్లో వసూళ్ళ పరంగా టాప్ ఛెయిర్ని అధిగమించడం ఖాయమే.
అయితే, ‘అత్తారింటికి దారేది’ వసూళ్ళను బ్రేక్ చేయడానికి రేసులో మూడు సినిమాలున్నాయి. వీటిల్లో మొదటిది మహేష్ ‘1’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుమారు 70 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతోందన్న ప్రచారం టాలీవుడ్లో జరుగుతోంది. ఇక, మహేష్ హీరోగా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైన ‘ఆగడు’పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనువైట్ల సినిమా కావడంతో చకచకా నిర్మాణం జరిగిపోవడం ఖాయం. కాబట్టి, ఇది కూడా రేసులో వున్నట్టే.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘బాహుబలి’ తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, మొత్తం సౌత్ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేకపోయినా, రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూస్తే, టాలీవుడ్లో వసూళ్ళ పరంగా ‘బాహుబలి’ నెంబర్ వన్ ఛెయిర్పై కన్నేయడం ఖాయం.. అదెప్పుడు రిలీజ్ అయినా.
రామ్చరణ్ ‘ఎవడు’ కూడా భారీ అంచనాలతోనే తెరకెక్కినా, ఈపాటికే రిలీజైపోవాల్సిన ఈ సినిమా, సవాలక్ష ఆటంకాల కారణంగా అటకెక్కేసింది. కాబట్టి, సినిమాపై క్రేజ్ అమాంతం పడిపోయింది. మంచి టైమ్ కుదిరితే, ‘ఎవడు’ని కూడా అంత తేలిగ్గా తీసిపారేయలేని పరిస్థితి.