నాగార్జునకు ఇప్పుడు అర్జెంటుగా ఓ దర్శకుడు కావాలి. అలాంటిలాంటి దర్శకుడు కాదు. ఓ స్టార్ దర్శకుడు. అదీ తనకు కాదు.. తన వారసుడు అఖిల్ కోసం. అఖిల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని యావత్ తెలుగు చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. స్వతహాగా కొత్త దర్శకుల్ని ప్రోత్సహించే నాగ్… తన తనయుడి కోసం మాత్రం అనుభవజ్ఞుడికే ఓటేస్తున్నారు. నాగచైతన్య విషయంలో తీసుకొన్న రిస్క్… సిసింద్రీ విషయంలోనూ తీసుకోవడానికి ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఈసారి ఆయన ఏకంగా జక్కన్న రాజమౌళికే గురి వేస్తున్నారు.
ఈమధ్య రాజమౌళిని నాగ్ తెగ పొగిడేస్తున్నారు. జక్కన్న సమక్షంలో పొగిడితే.. ఓకే అనుకోవచ్చు. రాజమౌళి లేని చోట కూడా..అతని గురించి నాలుగు మంచి ముక్కలు చెబుతున్నారు. తెలుగు సినిమా స్టాండర్డ్ని పెంచిన దర్శకుడనీ, సూపర్ స్టార్లతో కాదు, ఈగతోనూ అద్భుతాలను సృష్టించాడని కితాబిచ్చారు ఆమధ్య ఇప్పుడేమో.. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీయాలంటే అది రాజమౌళి వల్లే అవుతుందని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే జక్కన్నకు గాలమేస్తున్నట్టే అనిపిస్తుంది.
ఈ గాలాలకు లొంగడానికి రాజమౌళి ఏమైనా చేపపిల్లా..? సముద్రంలాంటోడు. అయినా జక్కన్నతో సినిమా అంటే 2015 వరకూ ఆగాలి. మరి సిసింద్రీ అంత వరకూ ఓపిక పడతాడా?