దూకుడులో సూపర్ దూకుడు ఎవరిదంటే జగన్‌దే అని చెప్పాలి. అతనిలో యింతటి సమైక్యవాది దాగి వున్నాడని నేను ఎన్నడూ ఊహించలేదు. ఏదో పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడంటే – సోనియాను యిరకాటంలో పెట్టాలని పట్టుకున్నాడనుకున్నాను. మానుకోట వెళ్లాడంటే తెలంగాణలోనూ నాకు అనుయాయులు వున్నారని చెప్పుకోవడానికి అనుకున్నా. ఎందుకంటే దరిమిలా సొంత పార్టీ పెట్టాక చంద్రబాబుకి డిటోలాగే ప్రవర్తించాడు. ఒక్కటే తేడా – సమన్యాయం అనే రుమాలు అక్కడ వేసుకుని వుంచాడు. ఆ పాటి మెలిక వేయాలన్న యింగితం బాబుకి లోపించింది. అందువలన యిప్పుడాయన సమన్యాయం అంటూ వుంటే జగన్ ఎంగిలి చేసిన మాటలా వినబడుతోంది. ఇంతకీ యీ సమన్యాయం ఏమిటో బాబుకీ తెలియదు, జగన్‌కి తెలియదు. ఒకవేళ తెలిసినా మనకు చెప్పలేదు. కాంగ్రెసువాళ్లు అష్టకష్టాలు పడి కసరత్తు చేసి ‘ఇదిగో యిదీ యిరుప్రాంతాలు ఓకే చేసిన కాంప్రమైజ్ ఫార్ములా’ అని ఒకటి ముందు పెట్టినా వీళ్లు ‘ఇది సమన్యాయం కాదు’ అంటూ వాదించవచ్చు, కాలం గడపవచ్చు.
బాబు ఏ న్యాయం గురించి మాట్లాడకుండా సమన్యాయం బ్లాంక్ చెక్ యిచ్చేసి కూర్చున్నపుడు జగన్ ఓ అడుగు ముందేసి ‘సమన్యాయం’ అన్నారు. బాబు ఆలస్యంగా రైలెక్కేటప్పటికి అక్కడ సీట్లో జగన్ కిటికీలోంచి వేసి వుంచిన సమన్యాయం రుమాలు కనబడిరది. ఈయనా సమన్యాయం పాట అందుకున్నాడు. వెంటనే జగన్ నిచ్చెన ఎక్కి సమైక్యం అంటూ బెర్త్‌మీద రుమాలు వేసేశాడు. బాబుకి బెర్త్ కేసి ఆశగా చూస్తూన్నారు, కానీ సమైక్యం అనలేకుండా వున్నారు. ఇప్పుడున్న నాయకులందరిలోకి జగనే సమైక్య ఛాంపియన్‌గా కనబడదామని చూస్తున్నారు. అంత బహిరంగంగా సమైక్యం అంటే తెలంగాణలో పార్టీ యూనిట్ మూసుకోవాలి, ఓట్లు రావు అని కొందరు భయపెట్టారు. నిజంగా కొండా సురేఖ లాటి వాళ్లు వెళ్లిపోయారు కూడా. అయినా జగన్ జంకలేదు. ఎందుకలా? ‘సోనియా గాంధీయే జగన్ చేత సమైక్యం నాటకం ఆడిస్తోంది’ అనే థియరీ కాస్సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం –
కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకోబోతోంది అనే మాట సాధారణ ప్రజలకు తెలియడానికి వారం రోజుల ముందే సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు తెలిసిపోయింది. తెలిశాక కూడా వాళ్లు ఏమీ చేయకుండా వూరుకున్నారు. ప్రజలు ఎలా రియాక్టవుతారో వూహించలేక, సోనియాతో గట్టిగా వాదించకుండా మిన్నకుండి పోయారు. ప్రజలు ఆమోదించి ఒకటి రెండు రోజులు నిరసన తెలిపి వూరుకుంటే, ఆ భాగ్యానికి సోనియాతో చెడగొట్టుకోవడం దేనికి అనుకున్నారు. కాంగ్రెసు నాయకుల ద్వారా జగన్‌కు సమాచారం చేరగానే, పబ్లిక్ మూడ్‌ను జగన్ కరక్టుగా అంచనా వేయగలిగారు. అందుకే జులై 30 ప్రకటనకు ముందే తన ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించారు. ప్రకటన వచ్చాక తనూ, తల్లీ కూడా రిజైన్ చేశారు.
ఆ విధంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ప్రజ్వరిల్లినపుడు వారి ఆగ్రహం కాంగ్రెసు, టిడిపిలవైపు పూర్తిగా మళ్లిపోయింది. వైకాపావారిని ఏమీ అనలేదు. ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకుందామని వైకాపావారు ప్రయత్నించారు కానీ ప్రజలు రాజకీయ నాయకులందర్నీ దూరం పెట్టడంతో పెద్దగా లీడ్ తీసుకోలేకపోయారు. కాంగ్రెసు, టిడిపి వారి దిష్టిబమ్మలు తగలబడ్డాయి కానీ వైకాపా వారి జోలికి ఎవరూ పోలేదు. ఎందుకంటే జగన్ అందరి కంటె ఎక్కువ దూకుడు చూపారు. తెలంగాణలో యూనిట్ పోయినా ఫర్వాలేదు సమైక్యం వైపే వుంటాను అని అతను చేసిన ‘త్యాగం’ సీమాంధ్రులను ఆకట్టుకుంది. వైకాపాను యిప్పటికే ఉపప్రాంతీయ పార్టీ అని టిడిపివారు, కాంగ్రెసు వారు ఎద్దేవా చేస్తున్నారు. ‘జగనైతే తెలంగాణను వదిలేసుకున్నాడు కాబట్టి సమైక్యం అనగలడు. మేం రెండు చోట్లా బలంగా వున్నా. ఆ నినాదం మాకెలా కుదురుతుంది?’ అని టిడిపి వారు సంజాయిషీ చెప్తున్నారు. జగన్ తెలంగాణను వదులుకోవడానికి సిద్ధంగా వున్నాడా? వైకాపా తెలంగాణ యూనిట్ నిజంగా మూసేసినట్టేనా? పటిష్టమైన ఆర్థికక్షేత్రం, జగన్ ఆస్తుల్లో చాలాభాగం వున్న హైదరాబాదు తెలంగాణలోనే వుంది కదా. అక్కడ తనకు రాజకీయంగా వునికి లేకుండా వుండేటంత రిస్కు జగన్ తీసుకుంటాడా? నా ఉద్దేశంలో తీసుకోడు.
నిజానికి సమైక్యం అన్నంత మాత్రాన తెలంగాణలో ఓట్లే పడవని అనుకోవడం చాలా పొరబాటు. సమైక్యం అంటున్న సిపిఎం మజ్లిస్‌లకు తెలంగాణలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదని చెప్పగలమా? తెలంగాణ జనాభా 3.5 కోట్లు అయితే దానిలో సమైక్యవాదులు కోటికి మించి వుండి తీరతారు – విభజన తర్వాత కూడా! అంతేకాదు, తెలంగాణలో ఆంధ్ర మూలాలు వున్నవారి జనాభా కూడా కోటి దరిదాపుల్లో వుండవచ్చు. తెలంగాణ రాష్ట్రం వలన తమకు ఏం లాభం సమకూడుతున్నందన్న దానిపై సామాన్య తెలంగాణ ప్రజలలో చాలా గందరగోళం వుందని పత్రికలు రాస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ‘తెలంగాణ వచ్చేసింది కదా, మీరింకా యిక్కడే వున్నారేం?’ అని ఆంధ్రుల్ని అడుగుతున్నారట. ఆంధ్రా యింటాయన యింట్లో అద్దెకున్న తెలంగాణ ఆయన ‘మీకు అద్దె కట్టడం ఎందుకు? ఇంకో రెండు నెలల్లో మీరెలాగూ వెళ్లిపోతారు కదా! ఇల్లు మా సొంతం అయిపోతుంది కదా’ అన్నాట్ట. ఇవన్నీ జోకులు అనుకుంటాం కానీ నాలుగేళ్ల క్రితం రైల్లో నేను ఓ సంభాషణ స్వయంగా విన్నాను.
నల్గండకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగి, అతని భార్య ఓ పక్క కూర్చుంటే మరో పక్క హైదరాబాదులో తరాలుగా స్థిరపడిన మధ్యతరగతి ఆంధ్ర కుటుంబం మరో పక్క కూర్చుంది. ఈ ఆంధ్ర ఆవిడ ‘కెసియార్ మాటలు మీరు వింటారెందుకు?’ అంటూ తెలంగాణ వనితకు సుద్దులు చెప్పబోయింది. ‘కెసియార్ మాట వినము లేమమ్మా, నాకు మీరు వెళ్లిపోండి, మాకు అదే చాలు’ అంటోంది తెలంగాణ వనిత. ‘మేం ఎక్కడికి వెళతాం? ఆంధ్రలో మాకేముంది కనుక? అయినా యిక్కడి ఆస్తులు వదులుకుని మేమెందుకు వెళ్లాలి?’ అంటోంది యీవిడ. ‘ఏమిటి ప్రత్యేక తెలంగాణ వచ్చినా వెళ్లరా? వెళ్లకుంటే ఊకుంటామా? ఉన్నంతకాలం వున్నారు, చేతులెత్తి మొక్కుతా, యికనైనా వెళ్లండి.’ అంటోంది తెలంగాణ మహిళ. ఉద్యమంలో ఎవరు ఏం నూరిపోశారో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే ఆంధ్ర వాళ్లందరూ తట్టాబుట్టా ఎత్తుకుని, ఆస్తులన్నీ తెలంగాణ వారి పరం చేసి వెళ్లిపోతారన్న నమ్మకం బలంగా నాటుకుంది ఆమె స్థాయి వాళ్లకు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2013)